దాశరథి, సినారె జయంత్యుత్సవంలో..


Mon,July 15, 2019 12:36 AM

-చిందు యక్షగాన మహోత్సవం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదకు ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ విముక్తి కోసం పాటు పడిన సాహితీ ప్రముఖుల్లో ఒకరు. దాశరథి కృష్ణమాచార్య 1925, జూలై 22న జన్మించారు. ‘విశ్వంభర’తో జ్ఞానపీఠ్‌ అవార్డును పొంది సాహితీ రంగానికే వన్నె తెచ్చిన ప్రముఖ సాహితీవేత్త, తెలుగు కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి 1931, జూలై 29న జన్మించారు. జూలై 22 నుంచి 29 వరకు దాశరథి - సినారె జయంత్యుత్సవాలను పురస్కరించుకొని వారం రోజుల పాటు చిందు యక్షగాన మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వీఎస్‌ జనార్దన మూర్తి తెలిపారు. పౌరాణిక, సాంఘీక ఇతివృత్తాలను తీసుకొని తమదైన శైలిలో ప్రదర్శించే ఈ కళాకారుల ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో చిందు యక్షగానాన్ని ప్రోత్సహించి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వారం రోజుల పాటు త్యాగరాయ గానసభలో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు కళా వీఎస్‌ జనార్దన మూర్తి తెలిపారు. వివిధ రంగాలకు చెందిన కళాకారులు, కళా రూపాలను, సాహిత్య, సంస్కృతుల సంస్థలను ప్రోత్సహించేందుకు త్యాగరాయ గానసభలోని ఐదు వేదికల్లో నాలుగింటిని ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు.
ఏడు రోజులు.. ఏడు ప్రదర్శనలు
కళా వేంకట దీక్షితులు కళా వేదికపై 22 నుంచి 29 వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల వరకు చిందు యక్షగాన ప్రదర్శనలు ఉంటాయి. 22న పిల్లిట్ల సంజీవయ్య బృందం ‘శశిరేఖా పరిణయం’, 23న పిల్లిట్ల కృష్ణయ్య బృందంతో మాంధాత నాటకాన్ని ప్రదర్శిస్తారు.24న పిల్లిట్ల గోవర్ధన్‌ బృందం ‘మాయా సుభద్ర’ కథను, 25న రాయల వెంకటయ్య బృందం ‘కుమార స్వామి కల్యాణం’ కథను, 26న పిల్లిట్ల కృష్ణ బృందం ‘సతీ తులసీ’, 27న గడ్డం ఈశ్వరీ బృందం ‘సత్యహరిశ్చంద్ర’ కథను ప్రదర్శిస్తారు. 28న శ్యాంసుందర్‌ బృందం ‘అలీరాణి కల్యాణం’, 29న గడవెల్లి వెంకన్న బృందం ఆధ్వర్యంలో ‘కీచకవధ’ను ప్రదర్శించనున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...