ఆషాఢ బోనం..వేడుక ఘనం


Mon,July 15, 2019 12:44 AM

మెహిదీపట్నం : చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆదివారం నాలుగో బోనం సందర్భంగా ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. నగీనా బాగ్‌ మీదుగా పుట్ట వద్దకు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి ఊరేగింపుగా కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు వెళ్లి బోనాలను సమర్పించారు. ముందుగా అమ్మవారి విగ్రహం ఎదుట వేసిన నవధాన్యాల పటం వద్ద ఆలయ ఈవో మహేందర్‌కుమార్‌, బోనాల ఉత్సవాల చైర్మన్‌ జి.వసంత్‌రెడ్డిలు పూజలు చేశారు. ఆమ్మవారికి బోనాలను తీసుకువెళ్లే క్రమంలో పోతరాజులు, శివసత్తుల నృత్యాలు, యువకుల ఆనందోత్సవాలు గోల్కొండలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా క్యూ లైన్లలో భక్తులు ఎంతో ఓపికగా నిలబడి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వైద్యశాఖ జిల్లా అధికారి వెంకటి ఆధ్వర్యంలో డిప్యూటీ డీఆండ్‌హెచ్‌వో ఈశ్వరి, జలమండలి డివిజన్‌ -3 జీఎం వినోద్‌భార్గవ్‌, శాంతి భద్రతల పరంగా సమస్యలు లేకుండా పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌.శ్రీనివాస్‌ , టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకృష్ణల పర్యవేక్షణలో ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ నంద్యాల నర్సింహరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డిలు బందోబస్తును పర్యవేక్షించారు. ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ట్రాఫిక్‌ డీసీపీ బాబురావు పర్యవేక్షణలో టోలిచౌకి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు.

జనసంద్రంగా కోట పరిసరాలు
ఆషాఢ మాసం బోనాలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఆదివారం గోల్కొండ కోటలో నిర్వహించిన నాల్గో బోనం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో లంగర్‌హౌస్‌, కార్వాన్‌, సెవన్‌టూంబ్స్‌, టోలిచౌకి, రాందేవ్‌గూడ, ఇబ్రహీంబాగ్‌, నార్సింగ్‌ల వరకు జాతర సందడి కనిపించింది. ఉదయం ఆరుగంటల నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాలు, జంటనగరాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి మొదలైన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో బోనాలు, తొట్టెల సమర్పణ రాత్రి వరకు కొనసాగింది.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బాలహిస్సార్‌ వద్ద, నగీనా బాగ్‌ల వద్ద వేదికలు ఏర్పాటు చేసి భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలతో పాటు తీన్మార్‌ పాటలతో కోటలో సాంస్కృతిక శాఖ కళాకారులు సందడి చేశారు. అదే విధంగా లంగర్‌హౌస్‌ నుంచి తొట్టెల ఊరేగింపులో కూడా సాంస్కృతిక శాఖ కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. చారిత్రాత్మక గోల్కొండ కోట గోడలపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం త్రీడి మ్యాపింగ్‌తో తెలంగాణ సంస్కృతిని, గోల్కొండ బోనాల ఘన చరిత్రను ప్రదర్శించారు.

అమ్మవారికి తొట్టెల సమర్పణ
ఆదివారం మధ్యాహ్నం నుంచి లంగర్‌హౌస్‌ మీదుగా తొట్టెల ఊరేగింపు ప్రారంభమైంది. పురాణాపూల్‌, ఆసిఫ్‌నగర్‌, ఉప్పుగూడ, కార్వాన్‌, ముస్తైద్‌ పూరా, సఫిల్‌గూడ, మాసాబ్‌ట్యాంక్‌, సబ్జిమండి తదితర ప్రాంతాల నుంచి తొట్టెలను సమర్పించారు. పురాణాపూల్‌ నుంచి సంఘ సేవకులు ఎంపీ.భీష్మ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భారీ తొట్టెలను వేల మందితో ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పించారు.

ఆశ్చర్యపోయిన మంత్రి తలసాని
సాయంత్రం 5 గంటలకు గోల్కొండ కోటకు వచ్చిన రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోటలో క్లాపింగ్‌ పోర్టికో, నగీనా బాగ్‌లో నుంచి పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను చూసిన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం రాణిమహల్‌ మీదుగా పురావస్తు కార్యాలయం వద్ద నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత గోల్కొండ కోటలో జరిగే బోనాలకు ఏడాదికేడాది బోనాలు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందన్నారు. ప్రభుత్వ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించి బోనాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం కూడా గోల్కొండ బోనాల విజయవంతానికి ఓ కారణంగా పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల వారందరూ సమన్వయంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు చేయడం అభినందనీయమని అన్నారు. మంత్రితో పాటు యువనాయకులు తలసాని సాయికిరణ్‌యాదవ్‌, కార్వాన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి ఠాకూర్‌ జీవన్‌సింగ్‌, కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్‌, మిత్ర కృష్ణ, గోల్కొండ బోనాల చైర్మన్‌ జి.వసంత్‌ రెడ్డి , నాయకులు శేఖర్‌ రెడ్డి, గోవింద్‌రాజ్‌, వినోద్‌, శేఖర్‌యాదవ్‌, రాజ్‌మల్లేశ్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

శ్రీజగదాంబ అమ్మవారికి బంగారుబోనం, పట్టువస్ర్తాలు
చాంద్రాయణగుట్ట : చారిత్రాత్మకమైన లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల సందడి మొదలైంది. ఆదివారం లాల్‌దర్వాజ సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్‌ తిరుపతి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, భక్తులు గోల్కొండలోని శ్రీ జగదాంబ అమ్మవారికి ప్రత్యేకంగా బంగారు బోనం, పట్టువస్ర్తాలను సమర్పించారు. అమ్మవారికి ఒడిబియ్యం నింపారు. అంతకుముందు లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సలహాదారుడు జి.మహేశ్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు కె.విష్ణుగౌడ్‌, ఎ.మాణిక్‌ప్రభుగౌడ్‌, ప్రధాన కార్యదర్శి మారుతియాదవ్‌, కాశీనాథ్‌గౌడ్‌, బద్రీనాథ్‌గౌడ్‌, శీరా రాజ్‌కుమార్‌, పోసాని సుధాకర్‌, తిరుపతి భాస్కర్‌రావు, తిరుపతి శివకుమార్‌, తిరుపతి అనురాధ, డి.ఎల్‌.నర్సింగ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...