ఎన్జీటీ ఆదేశాలను పాటించాలి

Fri,July 12, 2019 02:48 AM

ములుగు, నమస్తేతెలంగాణ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయో మెడికల్ వేస్ట్, నదుల కాలుష్యం, ఎయిర్‌పొల్యూషన్, ఇసుక మైనింగ్ తదితర అంశాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ప్రణాళికను రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైద్రాబాద్‌లోని సచివాలయంలో జీవో నంబర్ 606/2018నకు సంబంధించి.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై సీఎస్, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్, సీబీసీ సెక్రటరీ అనిల్‌కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ నీతు ప్రసాద్, హైద్రాబాద్ కలెక్టర్ మానిక్‌రాజ్, టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్, మైన్స్ డైరెక్టర్ సుశీల్‌కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్‌జీటీ ఉత్తర్వుల ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై జిల్లా కమిటీలు ప్రతీ నెల సమావేశం అయ్యి మినేట్స్‌లను పంపడంతో పాటు త్రైమాసిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. పట్టణ, గ్రామాలకు డంపింగ్ యార్డులు ఉండేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్తను సేకరించే వారికి తడి, పొడి చెత్తను వేరు చేయడంపై శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. చెత్త సేకరణకు అవసరమైన ఆటోలు, రిక్షాలు జిల్లా స్థాయిలో సమకూర్చుకోవాలని సీఎస్ ఆదేశించారు. బయో మెడికల్ వేస్ట్‌కు సంబంధించిన రాష్ట్రంలో ఉన్న దవాఖానలను 11 ఇన్సులేటరీ యూనిట్‌కు ట్యాగ్ చేయాలన్నారు. రిజిస్టర్ కాని దవాఖానను రిజిస్టర్ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

అక్రమ ఇసుక మైనింగ్‌ను అరికట్టడంతో పాటు.. శుద్ధ్ది చేయని వ్యర్థాలు నదులలో కలువకుండా చూడాలని కలెక్టర్లను కోరారు. వాయు కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన చోట ఎయిర్‌క్వాలిటీ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక మైనింగ్‌ను శాస్త్రీయ పద్ధ్దతిలో చేపట్టాలన్నారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా మాట్లాడుతూ నెల వారీగా జిల్లా స్థాయి కమిటీలు చేపడుతున్న కార్యక్రమాలు, కొత్తగా చేపట్టిన అంశాలను ప్రత్యేకంగా పేర్కొనాలని సూచించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీలను ములుగు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సీఎస్ ఎస్‌కే జోషీకి వివరించారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య, భూగర్భ జలశాఖ అధికారి రాజిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవి, జిల్లా ప్రణాళిక అధికారి వెంకటరమణ, రవాణా అధికారి రవీందర్, పశు సంవర్థక శాఖ అధికారి బాలకృష్ణతదితరులు పాల్గొన్నారు.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles