బ్యాంకింగ్‌లో మహిళలను ప్రోత్సహించాలి

Fri,July 12, 2019 02:48 AM

ములుగు, నమస్తేతెలంగాణ: జిల్లాలో బ్యాంకు సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో మహిళా సంఘంలోని చదువుకున్న మహిళా సభ్యులకు స్త్రీ నిధి మహిళా బ్యాంకు ద్వారా మినీ బ్యాంకు ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన స్త్రీ నిధి మహిళా బ్యాంకు సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా స్థాయిలో రుణవితరణ ప్రగతిని, రికవరీ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తీసుకున్న రుణాలను 100శాతం రికవరీ చేసి మహిళా సంఘాలచే ఏర్పాటు చేసిన స్త్రీనిధి మహిళా బ్యాంకు అభివృద్ధికి పాటు పడాలని సెర్ఫ్, స్త్రీ నిధి సిబ్బందికి సూచించారు. వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ, షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ, పంచాయతీరాజ్ శాఖలలో మహిళా రైతులను గుర్తించి వారికి రుణాలను మంజూరీ చేయాలని ఆదేశించారు.

రూ.49కోట్ల మంజూరు చేయాలి
జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.49కోట్ల రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల బారి నుంచి మహిళా సంఘాల సభ్యులను విముక్తులను చేయడం కోసం ఏర్పాటు చేసిన స్త్రీ నిధి మహిళా బ్యాంకు సేవలను గ్రామ గ్రామాన విస్తరింపజేయాలని సెర్ఫ్, స్త్రీ నిధి సిబ్బందిని ఆదేశించారు. దీనిపై మరో 15 రోజుల్లో మరో సమీక్షా సమావేశం నిర్వహించి రుణవితరణ, లోన్ రికవరీ, గ్రేడింగ్ పెరుగుదలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ వసంతరావు, స్త్రీ నిధి జోనల్ మేనేజర్ వై. రమేష్, రీజనల్ మేనేజర్ ఎం. అరుణ్‌సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి కె.ఎ. గౌస్‌హైదర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డీపీవో రవి, పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్, ఆర్‌ఎస్ డీటీఐ డైరెక్టర్ హేమంత్‌కుమార్ , ఏడీఎం శ్రీనివాస్, మండల సమైక్య పదాధికారులు, స్త్రీనిధి, సెర్ఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నూతన శాఖలను ప్రారంభించాలి
జిల్లాలోని మండల కేంద్రాల్లో నూతన బ్యాంకు శాఖలను ప్రారంభించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి బ్యాంకు అధికారులను కోరారు. గురువారం ఆయన బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని మండల కేంద్రాల్లో విద్యుత్, నెట్‌వర్క్ నిరంతరాయంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. స్త్రీనిధి బ్యాంకు స్వయం సహాయక సంఘాలలోని చదువుకున్న మహిళలను ఎస్‌బీఐ , ఆంధ్ర బ్యాంకు కరస్పాండెంట్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం, ఎస్‌బీఐ, ఆంధ్ర బ్యాంకు, కెనరాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, స్త్రీ నిధి మహిళా బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్‌బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో వైద్యులు, సిబ్బంది క్రమశిక్షణతో విధులను నిర్వహించాలని ములుగు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆయన వైద్యులు, సిబ్బందితో దవాఖాన సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. పేద ప్రజలకు ఏరియా దవాఖాన ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ రోగుల పట్ల స్నేహ పూర్వకంగా వ్యవహరించాలన్నారు. బాధ్యతగా సేవలు అందించి దవాఖానకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరెడ్డి, వైద్యులు గౌతమ్‌చౌహాన్, హెడ్ నర్సు వాణి, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

18
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles