రోటా వైరస్ టీకాలు తప్పక వేయించాలి

Sat,August 24, 2019 02:50 AM

ములుగు, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఏడాది వయస్సున్న చిన్నారులు విరేచనాల బారిన పడకుండా రోటా వైరస్ వాక్సిన్‌లను తప్పక వేయించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య ప్రజలను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రభుత్వ ఏరియా దవాఖానలోని సమావేశ మందిరంలో వైద్య సిబ్బందికి రోటా వైరస్ వ్యాక్సినేషన్‌పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జిల్లాలోని ఏడాది లోపు చిన్నారులకు టీకా ఇప్పించాలని, తద్వారా డయేరియా రాకుండా ఉంటారని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ టీకాలను వేయించాలని సూచించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో తిరిగి ఏడాది లోపు వయస్సున్న పిల్లలను గుర్తించాలని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా చూడాలని కోరారు. ఆశావర్కర్లు సైతం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. చిన్నారులకు వ్యాక్సిన్ వేసే క్ర మంలో తల్లిదండ్రులకు సందేహాలు కలిగితే వైద్య సిబ్బంది వాటిని నివృత్తి చేయాలన్నారు. సమావేశంలో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్యాంసుందర్, యూఎన్‌డీపీ ప్రాజెక్టు ఆఫీసర్ శ్యాంసన్, మాస్‌మీడియా అధికారి నవీన్‌రాజ్‌కుమార్, వైద్య సిబ్బంది ప్రతాప్, తిరుపతయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles