సత్యవతి రాథోడ్‌ అనే నేను..

Mon,September 9, 2019 03:30 AM

-వరించిన మంత్రి పదవి
-గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమశాఖ కేటాయింపు
-34 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం
-మురిసిన జిల్లావాసులు
-ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు దక్కిన మరో మంత్రి పదవి
మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరోమంత్రి పదవి వరించింది. ఇప్పటికే పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సత్యవతిరాథోడ్‌కు మంత్రివర్గంలో స్థానం లభించడంతో మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. ముందు నుంచి అందరూ అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి దక్కింది. సత్యవతిరాథోడ్‌కు గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖలను సీఎం కేసీఆర్‌ కేటాయించారు. మంత్రి పదవి రావడానికి సామాజికవర్గంతోపాటు మహిళా కావడం ఆమెకు కలిసి వచ్చింది. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ఇద్దరు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇద్దరి మహిళల్లో జిల్లాకు చెందిన సత్యవతిరాథోడ్‌కు అవకాశం లభించింది. సత్యవతిరాథోడ్‌కు ఎస్టీ, మహిళాకోట రెండు కలిసి వచ్చాయని చెప్పాలి. అదేవిధంగా పార్టీకి, ప్రభుత్వానికి విధేయురాలిగా ఉంటూ వస్తున్నారు. సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పటి నుంచి ఆమెకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. ఎస్టీ లంబాడ సామాజికవర్గానికి చెందిన సత్యవతిరాథోడ్‌కు రిజర్వేషన్‌, మహిళ కావడం, సీఎం కేసీఆర్‌కు ముందు నుంచి విధేయురాలిగా ఉండటంతో మంత్రి పదవి వరించింది. 34 ఏండ్ల సుదీర్ఘ రాజకీయం అనుభవం...ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడే తత్వం...అందరిని ఆత్మీయంగా పలకరించే నైజం ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ సొంతం. నమ్ముకున్న పార్టీ అభివృద్ధికోసం కష్టపడి పనిచేయడమే సత్యవతిరాథోడ్‌ను అందలం ఎక్కించింది.

టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌, చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ కోసం కష్టపడ్డారు. 2009వ సంవత్సరంలో టీడీపీ తరుపున డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో తనదైన పాత్ర పోషించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ అధినేత కేసీఆర్‌ చెప్పిన పనులను తుచ తప్పకుండా చేసి అనేక విజయాలను సాధించారు. సీఎం కేసీఆర్‌ మాట ఇస్తే తప్పరు అనేందుకు సత్యవతిరాథోడ్‌ రాజకీయ జీవితం చక్కని ఉదాహరణగా నిలిచింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామ పంచాయతీలో గుగులోత్‌ లింగ్యా, దస్మిల చివరి సంతానంగా జన్మించిన సత్యవతిరాథోడ్‌ ప్రాథమిక విద్యాభ్యాసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్రాతిమడుగు(విలేజ్‌)లో సాగింది. చదువులో చురుకైన విద్యార్థినిగా పేరుతెచ్చుకున్నారు. 7వ తరగతి వరకు చదువుకున్న సత్యవతి పై చదువులు చదువుకోవడానికి అవకాశం లేకపోయింది. 1982వ సంవత్సరం మేనెలలో 13 సంవత్సరాల చిన్న వయస్సులోనే కర్నాటక రాష్ర్టానికి చెందిన భూక్య గోవింద్‌ రాథోడ్‌తో సత్యవతిరాథోడ్‌ వివాహం జరిగింది. గోవింద్‌ రాథోడ్‌ ఆర్పీఎఫ్‌లో ఉద్యోగ రీత్యా డోర్నకల్‌లో ఉండేవారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన సత్యవతిరాథోడ్‌ రాజకీయ జీవితం కూడా అనుకోని విధంగానే ప్రారంభమైంది.

34 ఏళ్ల రాజకీయ నేపథ్యం..
డోర్నకల్‌ ప్రాంతంలో మార్వాడీ సేట్‌ గోవింద్‌ నారాయణ లడ్డా ప్రోద్బలంతో, అన్న కిషన్‌ నాయక్‌ సహకారం, భర్త గోవింధ్‌ రాథోడ్‌ ప్రోత్సాహంతో ఎన్టీఆర్‌ సమక్షంలో 1984 సంవత్సరంలో టీడీపీలో సత్యవతిరాథోడ్‌ చేరారు. ఆ సమయంలో వచ్చిన ఎన్నికల్లోనే టీడీపీ తరుపున రాజకీయ ఉద్ధండుడు రామసహాయం సురేందర్‌రెడ్డిపైనే పోటీచేసే అవకాశం వచ్చింది. అయితే పోటీ చేసేందుకు వయస్సు సరిపోక పోవడం మూలంగా అవకాశం చేజారింది. 1989వ సంవత్సరంలో గిరిజన మహిళగా టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. 1995లో గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా జనరల్‌ స్థానంలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నర్సింహులపేట జడ్పీటీసీ స్థానం నుండి గెలుపొందారు. ఆ తర్వాత గెలుపులు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ.. నమ్మిన పార్టీ సిద్ధాంతం కోసం అహర్నిశలు కృషి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆశయాలు నచ్చి 2014 మార్చి 03వ తేదీన టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ తరుపున డోర్నకల్‌ నుంచి పోటీ చేసి రెడ్యానాయక్‌పై ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ నవంబర్‌ 05వ తేదీ 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు.

అధినేత కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలకు పోకుండా సత్యవతిరాథోడ్‌ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ వస్తున్నారు. 2019 సంవత్సరంలో తప్పనిసరిగా సీటు వస్తుందని భావించారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల హామీ మేరకు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, మహబూబాబాద్‌ అసెంబ్లీ స్థానంలో శంకర్‌నాయక్‌ గెలుపునకు తనవంతు కృషి చేశారు. ఆ సమయంలో నల్గొండ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కోసం కష్టపడే తత్వాన్ని అధిష్ఠానం గుర్తించింది. అన్నమాట ప్రకారం సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రక నిర్ణయంతో తొలిసారిగా గిరిజన మహిళకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఏప్రిల్‌లో వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకుని ఎంపీ మాలోత్‌ కవిత గెలుపులో కీలక భూమిక పోషించారు. అంతేకాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరించి అక్కడ జెడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎరగవేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఆమెకు నర్సంపేట, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. రెండు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేశారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles