వసూళ్ల దందా!

Sat,September 14, 2019 02:16 AM

- సదరం సర్టిఫికెట్ల రెన్యువల్‌లో చేతివాటం
- అనర్హులకు ధ్రువీకరణ పత్రాల జారీ
- రూ. 5వేల నుంచి 20 వేల వరకు వసూళ్లు
- డీఆర్‌డీఏ ఉద్యోగులే కీలకధారులు
- చక్రం తిప్పుతున్న సస్పెండైన ఉద్యోగి
- ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న ఆర్థిక భారం
- ఫిర్యాదు చేసిన బాధితులు
- విచారణకు ఆదేశించిన కలెక్టర్ నారాయణరెడ్డి

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: దివ్యాంగుల సర్టిఫికెట్ల రెన్యువల్ ప్రక్రియలో వసూళ్ల బాగోతం నడుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను రెట్టింపు చేయడంతో.. అనర్హులైన దివ్యాంగులు సైతం.. పింఛన్ పొందేందుకు అడ్డదారులను ఆశ్రయిస్తున్నారు. మధ్య దళారుల మాయ మాటలతో వేలాది రూపాయల సొమ్మును వెచ్చించి.. నకిలీ సర్టిఫికెట్లను పొందుతున్నారు. 40 శాతం అంగవైకల్యం లేని వారికి ఆసరా పింఛన్లతోపాటు ఉద్యోగాల రిజర్వేషన్లు వర్తించవు. ఈ నేపథ్యంలో గతంలో 30 నుంచి 39 శాతంతో సదరం సర్టిఫికెట్లు పొందిన వారు సంబంధిత శాఖలోని ఉద్యోగులను ఆశ్రయిస్తుంచి డబ్బులు ముట్టజెప్పి ఎక్కువ వైకల్యంతో ధ్రువీకరణ పత్రాలు పొందుతూ అర్హులకు అన్యాయం చేస్తున్నారు.

జోరుగా నకిలీ సర్టిఫికెట్ల జారీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ఆసరా పింఛన్‌లను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం గత జూన్ మాసంలో ప్రత్యేకంగా అర్హులైన ఆసరా ఫించన్ దారులకు అర్హత పత్రాలను అందజేసింది. అదేవిధంగా దివ్యాంగులకు అందిస్తున్న ఫించన్‌లను సైతం రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. సంబంధిత డీఆర్‌డీఏ శాఖ ఆధ్వర్యంలో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం జిల్లాలో వేగంగా మొదలై వసూళ్ల దందాకు తెర లేపింది. అనర్హులైన దివ్యాంగులు సదరమ్ సర్టిఫికెట్ల కోసం మధ్య దళారులను ఆశ్రయించారు. మధ్య దళారులు.. డీఆర్‌డీఏ శాఖ ఉద్యోగులతో కలిసి దివ్యాంగుల నుంచి రూ. 5వేల నుంచి రూ.20వేల వరకు వసూళ్ళు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

జిల్లాలో 4040 మంది లబ్ధిదారులు
జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలో 4040 మంది దివ్యాంగులు పింఛన్ పొందుతున్నట్లు డీఆర్‌డీఏ శాఖ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందు కోసం వారు గతంలో రూ.1500 పింఛన్ ఉన్నప్పుడు.. ప్రభుత్వం సదరమ్ సర్టిఫికెట్ల జారీకి పకడ్భందీ కార్యాచరణను రూపొందించి, జిల్లా కేంద్రంలో ప్రతీ శుక్రవారం సదరమ్ క్యాంపు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం రెన్యూవల్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు డీఆర్‌డీఏ శాఖలో పనిచేస్తున్న ఏపీఎం స్థాయి ఉద్యోగులు రూ.5వేల నుంచి రూ.20 వేలకు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

చక్రం తిప్పుతున్న సస్పెండైన ఉద్యోగి
డీఆర్‌డీఏలో ఉన్నత స్థానంలో పనిచేసి ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలతో సస్పెండైన ఓ ఉద్యోగికి.. ఈ వసూళ్ల దందాలో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. డీఆర్‌డీఏలో బలమైన పట్టు ఉండటం వల్ల ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సూచనలు, సలహాలు జారీ చేస్తూ యథేచ్ఛగా వసూళ్ల పర్వానికి పాల్పడే విధంగా ప్రొత్సహిస్తున్నాడని పలువురు అంటున్నారు.

అక్రమ దందాపై కలెక్టర్‌కు ఫిర్యాదు
దివ్యాంగుల సదరం క్యాంపులో.. అనర్హులకు సర్టిఫికెట్ల రెన్యూవల్‌లో భాగంగా డీఆర్‌డీఏ ఉద్యోగులు దివ్యాంగుల నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌కు బాధిత దివ్యాంగులు కొంత మంది ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డబ్బులు ఇచ్చుకోలేని దివ్యాంగులు కొత మంది.. అర్హత లేని దివ్యాంగులు సర్టిఫికేట్లను పొందుతున్న విషయాన్ని నేరుగా జిల్లా కలెక్టర్‌కు మెసేజ్ రూపంలో పంపించడంతో స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖ అధికారి విచారణ చేపట్టి పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించినట్లు సమాచారం.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles