30రోజుల ప్రణాళికపై శ్రద్ధ తీసుకోవాలి

Thu,September 19, 2019 02:53 AM

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్/ములు గు, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, పచ్చదనం వంటి ఆశించిన ఫలితాలు కనబడేలా కలెక్టర్లు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంటితోపాటు ప్రభుత్వ సంస్థలైన పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేం ద్రాలు, పంచాయతీ భవనాలు, హాస్టళ్లు ఇతర అన్ని రకాల సంస్థలలో పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు. అలాగే, ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామసభల ద్వారా గ్రామ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని, నా గ్రామాన్ని నేను పరిశుభ్రంగా ఉంచుకుంటాననే పరివర్తనను ప్రజల్లో కల్పించాలని అన్నారు. 30రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమం ఫలితాలను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయని తెలిపారు.

గ్రామాల్లో పచ్చదనం..
ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు, చింతకుంట నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజల విస్తృత భాగస్వామ్యంతో చేపట్టిన 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంతో తమతమ జిల్లాల్లోని గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతను సంతరించుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి వివరించారు. గ్రామాల్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు వివిధ కమిటీలను వేసినట్లు తెలిపారు. పాడుబడిన భవనాల కూల్చివేత, పిచ్చి మొక్కల తొలగింపు, పాడుబడిన బావులు, గుంతల పూడ్చివేత, వంగిన, ఇరిగిన విద్యుత్తు స్తంభాలను తీసి కొత్తవి వేయడం, మూడవ లైన్ వేయడం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం వలన ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారు వివరించారు. మారుమూల మండలాలైన పలిమెల, మహదేవపూర్, మహాముత్తారంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో జయశంకర్ జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జెడ్పీసీఈవో శిరీష, డీఆర్డీవో సుమతి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జే నరేశ్, ములుగు జిల్లా నుంచి డీఆర్వో రమాదేవి, జెడ్పీ సీఈవో పారిజాతం, డీఆర్డీఏ పీడీ వసంతరావు, డీపీవో వెంకయ్య పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles