ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన


Sun,July 21, 2019 01:29 AM

- రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు పంచుతున్న సీఎం కేసీఆర్
- అన్ని వర్గాల ప్రజలకు చేయూత
-కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం
-అందుకోసమే ప్రాజెక్టుల నిర్మాణం
-విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
-లబ్ధిదారులకు పెంచిన పింఛన్ల ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి
చిట్యాల : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, రాష్ట్రంలో కేవలం సంక్షేమానికే రూ. 40వేల కోట్లను ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం చిట్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెంచిన ఆసరా ఫించన్ల ప్రొసీడింగ్స్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చి పోయాయని, కానీ టీఆర్‌ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ మాత్రం అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోలో పేర్కొన్న వాటితో పాటు ఇవ్వని అనేక హామీలను అమలు చేశారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్, అమ్మఒడి వంటి పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని, ఆర్థిక ముఖచిత్రం చిన్నాభిన్నంగా మారిందని, చాలీ చాలని సంపాదనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక కేవలంలో కొన్ని సంవత్సరాల్లోనే ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ప్రజలు ఆర్థిక పరిపుష్టివైపు ఆడుగులు వేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కేవలం సంక్షేమ రంగంపైనే శ్రద్ధ చూపకుండా రైతులకు సాగునీరందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు, జిల్లాకు నీరందించే పాలమూరు డిండి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరందించటమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి ఆ దిశగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడ అప్పుల ఊబిలో ఉండవద్దని రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలతో పాటు రైతుబీమాను కూడా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తాజాగా కొత్త పంచాయతీ, పురపాలక చట్టాలతో అవినీతి రహిత పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.

కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ మాట్లాడుతూ పెంచిన ఫించన్లను ప్రజలకు తెలియజేయటానికి వారికి ప్రొసీడింగ్స్ అందజేస్తున్నామన్నారు. ఎవరైనా అర్హత ఉండి ఫించన్లు రాకపోతే ఎంపీడీఓలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కొత్తగా ఏర్పడిన చిట్యాల మున్సిపాలిటీలో పలు సమస్యలు ఉన్నట్లు రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలియజేటంతో ఆ సమస్యల పరిష్కారానికి రూ. 40లక్షలు కేటాయించామని వాటితో మంచినీరు, మురికి కాలువలు, విద్యుత్తు దీపాలు, రోడ్ల సమస్యలను పరిష్కరించుకోవాలని మరిన్ని నిధులు అవసరమైతే మంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేస్తామన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ మాట తప్పని ముఖ్యమంత్రిగా పేరున్న కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గతంలో ఉన్న పింఛన్లను రెండింతలు చేశారని అన్నారు. జిల్లాకు గోదావరి జలాలు అందించటం ద్వార సాగునీటి సమస్య తీరుతుందని వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి ఆర్‌డీఓ జగదీశ్వర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, అడిషనల్ స్పెషల్ ఆఫీసర్ వినోద్‌కుమార్, ఎంపీడీఓ బీ.లాజర్, తహశీల్దార్ సీహెచ్ విశాలాక్షి, ఎంపీపీ కొలను సునీతావెంకటేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీలు, అంతటి వెంకటేష్, బుర్రి రవీందర్‌రెడ్డి, రత్నం పుష్ప, దేవరపల్లి సత్తిరెడ్డి, పెదబోయిన సత్తయ్య, ముద్దసాని నీత, ఏళ్ల ప్రభావతి, వడ్డేపల్లి లక్ష్మయ్య, టీఆర్‌ఎస్ నాయకులు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, పాటి నర్సిరెడ్డి, జడల ఆదిమల్లయ్య, కొలను సతీష్, కర్నాటి ఉప్పలవెంకట్‌రెడ్డి, రాచకొండ కిష్టయ్య, గోలి గణేష్ పాల్గొన్నారు.

లబ్దిదారుల వద్దకే వెళ్లి..
పెరిగిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను మంత్రి లబ్ధిదారుల వద్దకే వచ్చి అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది వికలాంగులు, వృద్ధులు ఉండటంతో వారిని ఇబ్బంది పెట్టవద్దని మంత్రే స్వయంగా వేదిక దిగి వారి వద్దకు వెళ్లి మరీ పత్రాలు అందించారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...