గుమ్మడం ఎంపీటీసీ రజిత ఆత్మహత్య

Thu,July 11, 2019 03:50 AM

పెబ్బేరు రూరల్ : పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కావలి రజిత (24) బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెబ్బేరు మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నెల 4వ తేదీన ఎంపీటీసీగా ప్రమాణం చేసిన ఆమె అనూహ్యరీతిలో ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆమెను ఎంతో అభిమానించే వారు. పలు సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ రజిత వివాహం తానే దగ్గరుండి చేయిస్తానని చెప్పేవారు. గురువారం సాయంత్రం గుమ్మడం గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో మంత్రి పాల్గొని కన్నీరు పెట్టారు. గుమ్మడం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడైన చెన్నయ్య రెండో కూతురు రజిత. ఎంఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆమె ఊహించని విధంగా ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. ఈ నెల 8న సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండగానే ఆమె పురుగుల మందు తాగింది. వెంటనే వారు పెబ్బేరులోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. ఆరోగ్యం మెరుగు పడక పోవడంతో కర్నూలుకు తీసికెళ్లి కార్పొరేట్ దవాఖానలో చేర్పించినప్పటికీ ఫలితం దక్కలేదు. బుధవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందడంతో మృతదేహాన్ని గుమ్మడం గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసుల సూచన మేరకు వనపర్తి ఏరియా దవాఖానలో పోస్టుమార్టం చేయించారు.

ఈ విషయమై తండ్రి చెన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కూతురు రజిత తీవ్ర అనారోగ్యంతో చాలా కాలం నుంచి బాధపడుతోందని, దాన్ని తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఈ దారుణానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఇటీవల ఎంపీటీసీల ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి రజిత గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. విద్యాధికురాలు, చిన్న వయసులో ఎంపీటీసీ కావడం పట్ల అభినందించారు. రజిత పెళ్లి తాను దగ్గరుండి జరిపిస్తానని, కన్యాదానం కూడా చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. ఊహించని రీతిలో ఆమె మృత్యువాత పడటం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోస్టుమార్టం సందర్భంగా వనపర్తి దవాఖానలో ఆమె మృతదేహానికి నివాళుర్పించడమే గాక, గుమ్మడంలో జరిగిన ఆమె అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనై కళ్ల వెంట నీరు కార్చారు. అంతకుముందు శ్రీరంగాపురంలో జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రసంగించా ల్సిందిగా నిర్వాహకులు మంత్రిని కోరగా, తన మనసు ఈ రోజు బాగోలేదంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారు.

పార్టీలకతీతంగా సంతాపం
గుమ్మడం ఎంపీటీసీ రజిత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పార్టీలక తీతంగా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. ఆమె కుటుంబానికి తీవ్ర సానుభూతిని తెలిపారు. పెబ్బేరు ఎంపీపీ ఆవుల శైలజ, జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్, శ్రీరంగాపురం జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, నాయకుడు పృద్వీరాజు, పెబ్బేరు మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు హరిశంకర్ నాయుడు, మాజీ మార్కెట్ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మేకల కర్రెస్వామి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విశ్వరూపం, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలు పార్టీల నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles