త్యాగం మరువలేనిది

Tue,July 16, 2019 04:56 AM

మక్తల్ రూరల్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భూములను కోల్పోతోన్న నిర్వాసితుల త్యాగం మరువలేనిదని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దేవరకద్ర-మునీరాబాద్ రైల్వేలైన్‌లో భాగంగా మక్తల్ సమీపంలో వ్యవసాయ భూములు, ఇండ్లస్థలాలను కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నష్టపరిహారం చెక్కులను స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగానే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నదన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే కేసీఆర్ పాలనలో ముంపు తక్కువ, ప్రయోజనం ఎక్కువ ఉండే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును నిర్మిస్తే దాదాపు 67వేల ఎకరాలతో పాటు 26 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయని, కానీ 40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ఎక్కడా ముంపునకు గురి కాలేదన్నారు. కేవలం కాలువల నిర్మాణం కోసం తప్ప బరాజ్‌ల నిర్మాణంలో ఒక్క ఎకరా కూడా మునగలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కూడా ముంపు తక్కువగా ఉండేందుకు చర్యలు చేపడుతామన్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles