ముంచిన కృష్ణమ్మ

Thu,August 15, 2019 03:13 AM

- నీలవేణి ఉగ్రరూపంతో పంటలు నీటిపాలు
- జిల్లాలో 6,170 ఎకరాలలో దెబ్బతిన్న వరి
- 151 ఎకరాలలో ఇతర పంటలకు నష్టం
- వరద దెబ్బకు కుదేలైన అన్నదాతలు
- నష్టం వివరాల సేకరణలో అధికారులు

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో గత పది రోజులగా సాగుతున్న కృష్ణా నది వరద తీవ్రతతో రైతులు కుదేలయ్యారు. ఎన్నెన్నో ఆశలతో సాగు చేసుకున్న పంట చేలన్నీ నీట మునిగి పోగా నిస్సహాయ స్థితిలో మిగిలారు. ఇప్పటికే వరద తాకిడికి గురైన కృష్ణా, మాగనూర్, మక్తల్ మండలాలలోని దాదాపుగా 14 గ్రామాలకు చెందిన రైతులు పంట చేలన్నీ నీట మునిగి పోవడంతో విలవిలలాడుతున్నారు. ప్రత్యేకించి కృష్ణా మండలంలో హిందూపూర్, వాసునగర్, మురహరిదొడ్డి, ముడమాల్, గురుజాల, కృష్ణ తదితర గ్రామాలలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ గ్రామాలలో సాగు చేసిన 4,860 ఎకరాల వరి సాగు వరద పాలు కాగా మరో వంద ఎకరాలలోని ఇతర పంట చేలు నీట మునిగాయి. మాగనూర్ మండలంలోని మందిపల్లి, కొల్పూరు, పుంజనూరు గ్రామాలలో 649 ఎకరాలలో ఉన్న వరి సాగు, 30 ఎకరాలలో సాగు చేసిన పత్తి చేను నీట మునిగింది. మక్తల్ మండలంలోని పసుపుల, అంకెన్‌పల్లి, అనుగొండ, దాదన్‌పల్లి తదితర గ్రామాలలో 661 ఎకరాలలో సాగు చేసిన వరి, 21 ఎకరాలలో ఇతర పంట చేలు నీట మునిగాయి. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ పంట చేల నష్టం దాదాపుగా రూ. 7 కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు సూచన ప్రాయంగా పేర్కొంటున్నారు.

పూర్తి స్థాయిలో నివేదిక
జిల్లాలో సంభవించిన పంట చేల నష్ట గణాంకాలను అధికారులు పూర్తి స్థాయిలో సేకరించారు. కృష్ణ, మాగనూర్, మక్తల్ మండలాలలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడా జరుగనంత సాగు నష్టం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 6170 ఎకరాల వరి చేలు దెబ్బ తినగా 150 ఎకరాలలో ఇతర పంట చేలు నీట మునిగినట్లుగా అధికారులు వివరాలను సేకరించారు.

ఒకట్రొండు రోజులలో వరదలు తగ్గితే..
ఒకట్రొండు రోజులులో వరదలు తగ్గినా వరి, ఇతర పంటలకు జరిగిన నష్టం తగ్గుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు మూడు రోజులలో వరద తగ్గి నీట మునిగిన చేలు బయట పడితే అవి తిరిగి ఊపిరి పోసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వరద తీవ్రత కొంత మేర తగ్గిన కారణంగా చేలు తేలే అవకాశలు ఉన్నాయని అధికారులు, రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వానికి నివేదిక పంపాం..
వరి చేల్లు, ఇతర పంటలకు వరద కారణంగా జరిగిన నష్టం వివరాలను సేకరించాం. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుతావని కి పంపాం. ఇప్పటి వరకు ఒక్కొక్క ఎకరంపై రైతులు రూ.10 నుంచి 15 వేల ఖర్చు చేసి ఉండవచ్చని భావిస్తున్నాం. వరద తీవ్రత తగ్గితే పంట నష్టం కొంత తగ్గుతుంది.
- జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు

పంట మొత్తం నీట మునిగింది..
నేను నాకున్న 14 ఎకరాల పొలంలో వరి నాట్లు వేశాను. పంట చేతికి వచ్చి మేలు జరుగుందని ఆశించాను. అనుకోకుండగా వరద ప్రవాహం రావడం, వరి నాట్లన్నీ ఆ వరదలో కొంత కొట్టుకు పోగా మరి కొంత మునిగింది. ప్రభుత్వం వరదల కారణంగా నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి.
- నాగరాజు, వాసునగర్..కృష్ణ మండలం

ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి..
మేము 25 ఎకరాలలో వరి సాగు చేశాం. కష్ట నష్టాలకు ఓర్చి నాట్లు వేసి ఎరువులు వేశాం. వేలాది రూపాయలు ఇందు కోసం ఖర్చు చేశాం. వరదల్లో పంటలు మొత్తం నీట మునిగాయి. ఇప్పుడు వరదలు తగ్గినా ఏ మాత్రం పలితం ఉండదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
- తిప్పయ్య, రైతు గుడెబల్లూరు, కృష్ణ మండలం

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles