వరి.. సిరి

Tue,September 17, 2019 02:52 AM

-జిల్లాలో రికార్డు స్థాయిలో వరిసాగు
- పెరిగిన భూగర్భ జలాలు
- 11 మండలాల్లో 82,814 ఎకరాల సాగు విస్తీర్ణం
- మక్తల్ మండలంలో అత్యధికంగా 15,586 ఎకరాలు
- దామరగిద్ద మండలంలో అత్యల్పంగా 2,632 ఎకరాలు
- ఆశించిన స్థాయిలో వర్షాలు లేనప్పటికీ నిండిన రిజర్వాయర్లు
- భీమా నుంచి సంగంబండ, భూత్పూర్, కోయిల్‌సాగర్‌కు ఎత్తిపోతల
- కృష్ణా జలాలతో నిండిన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు
- రైతులకు భరోసానిచ్చిన సర్కారు
నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నారాయణపేట జిల్లాలో రైతుల ఇంట సిరులు కురిపించేలా వరినాట్లు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా ప్రజలు వరి పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంగంబండ, భూత్పూర్, కోయిల్‌సాగర్‌లలోకి భీమా ఎత్తిపోతల ద్వారా జలాలు చేరడం, పలు చోట్ల కుంటలు, చెరువుల్లోకి నీళ్లు రావడంతో వరి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ఆగస్టు చివరి వారం నాటికి 60వేలకు పైగా ఎకరాలలో వరిపంట సాగు కాగా, ఈ సంవత్సరం ఇప్పటికే 82,814 ఎకరాలలో రైతులు వరిని సాగు చేశారు. కృష్ణ ప్రవాహం యథావిధిగా సాగుతుండడం, భీమా నుంచి ఎత్తిపోతల ద్వారా ఆయా రిజర్వాయర్లలోకి జలాలను ఎత్తిపోస్తుండడంతో రైతులు నమ్మకంగా వరి సాగును జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికీ పలు గ్రామాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఈనెలాఖరులోపు వరిసాగు దాదాపుగా లక్ష ఎకరాలకు చేరుకోవచ్చని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.

అత్యధికంగా మక్తల్ మండలంలో వరిసాగు
జిల్లాలోని మొత్తం 11 మండలాల్లో వరిసాగు జరుగుతోంది. అత్యధికంగా మక్తల్ మండలంలో వరిసాగు కాగా, అత్యల్పంగా దామరగిద్ద మండలంలో సాగయింది.

భరోసానిస్తున్న రిజర్వాయర్లు
జిల్లాలోని రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన రిజర్వాయర్లు భరోసానిస్తున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీని భీమా ద్వారా రిజర్వాయర్లు నిండడంతో తాము సాగుచేసిన వరి పంటలకు నీటి కొరత ఉండదని రైతులు నమ్మకంగా ఉన్నారు. ప్రత్యేకంగా కృష్ణా, మాగనూరు, మక్తల్, నర్వ, మరికల్, ధన్వాడ మండలాలకు సంబంధించి సంగంబండ, భూత్పూర్, కోయిల్‌సాగర్ నుంచి సాగునీరు పుష్కలంగా అందుతుంది. పలు చెరువులు సైతం నిండడంతో రైతులు వరిసాగు పట్ల అమితమైన ఆసక్తిని చూపారు. కోస్గి, మద్దూరు, ఉట్కూర్, దామరగిద్ద, నారాయణపేట మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా రైతులు బోరుబావుల కింద వరిని సాగు చేశారు.

మరింత విస్తీర్ణం పెరిగే అవకాశం
జిల్లాలోవరిసాగు ఈ నెలాఖరు వరకు మరో 20వేల ఎకరాల పెరిగే అవకాశం ఉంది. రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కన్నా ఈ సంవత్సరం రైతులు వరినాట్లు వేశారు. వరి పంటకు ఎటువంటి రోగాలు వచ్చినా రైతులకు తగిన సలహాలు, సూచనలు చేసి మంచి దిగుబడిని సాధించుకునేలా ప్రోత్సహిస్తాం.
- జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నారాయణపేట

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles