సబ్సిడీపై వేరుశనగ

Wed,September 18, 2019 02:02 AM

-ముగిసిన టెండర్ల ప్రక్రియ
-వారం రోజుల్లో గోదాంలకు చేరేలా చర్యలు
-ఆన్‌లైన్ ద్వారా రైతుల సమాచార నమోదు
-పీఏసీఎస్ సెంటర్ల వారీగా పంపిణీ
-ఉమ్మడి జిల్లాకు 40 వేల క్వింటాళ్ల కేటాయింపు
-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ
వనపర్తి ప్రతినిధి,నమస్తే తెలంగాణ: వ్యవసాయ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నది. దేశంలోనే వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వేరుశనగ పండించడంలో ప్రత్యేక స్థానముంది. ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతుండటంతో ప్రస్తుతం యాసంగి వేరుశనగ విత్తనాలను అన్నదాతలకు అందించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటూ వేరుశనగ విత్తనాలను తెప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా అవసరాలకు తొలి విడతలో 40,500 క్వింటాళ్లు అవసరమవుతాయని కేటాయించారు. ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుండటంతో సాగుబడులు ఆశాజనకంగా సాగుతున్నాయి. వర్షాధారం అంతంత మాత్రమే ఉన్నా నదుల నీటితో రైతాంగానికి ఊరట లభిస్తున్నది. 40 రోజులుగా ఉమ్మడి జిల్లాలో నాలుగు ఎత్తిపోతల పథకాలు నడుస్తున్నాయి. వీటి ఆధారంగానే ప్రస్తుతం సేద్యం పనులు నడుస్తున్నాయి. ఇప్పటివరకు వరి సాగుబడులు మెజార్టీగా చేసిన రైతాంగం ఇక యాసంగిపైనా దృష్టి నిలిపే అవకాశం ఉంది. వరికి ఎక్కువ నీరు పడుతుందన్న క్రమంలో యాసంగికి వీలున్న రైతాంగం పల్లీలు వేసే పనులకు ప్రాధాన్యతనిస్తున్నది. గడచిన మూడేండ్లుగా ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరందుకుంటున్న ప్రాంతాలు పెద్ద ఎత్తున వేరుశనగ సాగు చేసి కోట్లాది రూపాయల పంటలను పండిస్తున్నారు. నదులకు నీరు కూడా ఆలస్యంగా వస్తుండటంతో యాసంగికి అనుకూలమన్నట్లుగా సాగుపై రైతులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ
యాసంగిలో అందించబోతున్న సబ్సిడీ విత్తనాల సరఫరా ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సక్రమ పద్ధతిలో సబ్సిడీ విత్తనాల పంపిణీకి వ్యవసాయ శాఖ సన్నద్ధం అయింది. జిల్లాల్లోని కోఆపరేటివ్ సహకార సంస్థల పరిధిలో సబ్సిడీ వేరుశనగను అందించాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో రైతులు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, వీఆర్‌వో ధ్రువీకరించిన భూమి వివరాలను తీసుకుని ఏఈవోల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి. అనంతరం ఏఈవో ఇందుకు సంబంధించిన సబ్సిడీ విత్తనాల పర్మిట్‌లను జారీ చేస్తారు.

టెండర్ల ప్రక్రియ పూర్తి
సబ్సిడీ వేరుశనగ పంపిణీకి అవసరమయిన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు రాష్ట్రస్థాయిలో టెండర్లను నిర్వహించారు. ఇక టెండరుదారులు ఆయా జిల్లాల వారీగా పంపిణీ చేపట్టాల్సి ఉంది. దాదాపు వారం నుంచి 10 రోజుల్లోపు కేటాయించిన ప్రాంతాల వారీగా వేరుశనగను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతంగా ఉండటం.. అక్కడక్కడ చిరు జల్లులు పడుతుండటం.. కాలువల్లో నీరు పారుతుండటంలాంటివి రైతులను యాసంగి వేరుశనగల వైపు మళ్లిస్తున్నాయి. వారం రోజుల్లోపు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు అందితే ఇక రైతు యాసంగి పనుల్లోను బిజీ బిజీ అవుతారు. ఈ పాటికే అక్కడక్కడ వరిపై ఆశలేని కొందరు రైతులు యాసంగి వేరుశనగ వేసుకున్నారు. వరిపైన దృష్టినిలిపిన రైతులు ఆ పనులను ముగించి వేరుశనగ పైర్ల సాగుపైకి ఇప్పుడిప్పుడే మళ్లుతున్నారు.

టీఎస్‌ఎస్‌డీసీఎల్ ఆధ్వర్యంలో..
టీఎస్‌ఎస్‌డీసీఎల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 9500 క్వింటాళ్ల వేరుశనగ సిద్ధంగా ఉన్నది. వ్యవసాయ శాఖ వారి ప్రతిపాదన మేరకు పీఏసీఎస్ కేంద్రాలకు ఈ వేరుశనగను తరలిస్తున్నారు. వేరుశనగ పంపిణీకి సంబంధించి సబ్సిడీ ధరలు బుధవారం రానున్నాయి. రెండు, మూడేండ్లుగా ప్రభుత్వం 40 నుంచి 50 శాతం మేర వేరుశనగపై సబ్సిడీ ఇస్తూ వచ్చింది. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో రైతులకు సబ్సిడీ అందించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో ఉన్న తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సబ్సిడీ వేరుశనగ పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

చొరవ తీసుకుంటున్న మంత్రి సింగిరెడ్డి
యాసంగిలో వేరుశనగ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేయించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రైతులకు వీలైనంత త్వరగా విత్తనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవలే వేరుశనగ సరఫరా కోసం టెండర్లను పిలవడం.. ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో ఇక త్వరితగతిన మిగిలిన ప్రక్రియ పూర్తి చేసేందుకు మంత్రి చొరవ తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పుణ్యమా అంటూ వేరుశనగ సాగుబడులు పెరగడంతో అందుకు అనుగుణంగా రైతులకు విత్తనాలు.. ఎరువులు అందించడంలోనూ మంత్రి కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాకు 40 వేల క్వింటాళ్లు
ఉమ్మడి జిల్లాకు 40,500 క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం తొలివిడతలో కేటాయించింది. ఈ మేరకు రైతులకు అవసరమైనంతమేర విత్తనాలను సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సబ్సిడీ వేరుశనగను టీఎస్‌ఎస్‌డీసీఎల్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లోని పీఏసీఎస్‌ల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం యాసంగిలో సబ్సిడీ విత్తనాల లక్ష్యాలను కేటాయింపులు చేసింది. ప్రధానంగా వనపర్తి, నాగర్‌కర్నూల్ కొత్త జిల్లాలు వేరుశనగ సాగులో ముందున్నాయి. ఈ ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాల సాగునీటి సౌకర్యం ఎక్కువగా ఉన్నందునా యాసంగిలో వేరుశనగ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఎత్తిపోతల పథకాలున్నప్పటికీ అక్కడ వేరుశనగను అంత ప్రాధాన్యతగా చూడటం లేదు. ఈ మేరకు ప్రస్తుతం తొలి విడతలో మహబూబ్‌నగర్ జిల్లాకు 7,200 క్వింటాళ్లు, నాగర్‌కర్నూల్‌కు 14,850 క్వింటాళ్లు, వనపర్తికి 15,300 క్వింటాళ్లు, నారాయణపేటకు 1,800 క్వింటాళ్లు, గద్వాల జిల్లాకు 1,350 క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగను కేటాయించారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles