అయ్యో..పాపం


Wed,July 10, 2019 01:05 AM

జైనథ్ : పేదరికం.. కన్నకూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి అడ్డుపడుతున్నది. ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలను గాలిలో దీపంలా వదిలేసి నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఓ పేద కుంటుంబం దీనగాథ ఇది! బుడిబుడి నడకలతో బడికి వెళ్లే వయసులో ఆ చిట్టితల్లికి మాయాది జబ్బు బ్రెయిన్ ట్యూమర్ రూపంలో వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేని ఆ తల్లిదండ్రులు ఆధునిక వైద్య చికిత్సలకు ముందుకు రాలేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా తమ చిట్టితల్లిని కాపాడేందుకు దేవుడిలా వస్తారని ఎదురుచూస్తున్నారు. జైనథ్ మండలం ఆకోలి గ్రామానికి చెందిన నైతం నరేశ్-అనూరాధ దంపతుల గారాల పట్టి నైతం రత్న అనే ఏడేండ్ల పాప బ్రెయిన్‌ట్యూమర్‌తో బాధపడుతోంది. దినసరి కూలీలుగా పనిచేసే ఆ దంపతులు తమ పాపకు మెరుగైన వైద్య చికిత్సకు హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. రావాణా చార్జీలు సైతం లేని ఆ గిరిజన కుటుంబం ఎవరైనా తమ పాపకు సహాయపడతారేమోనని నమస్తే తెలంగాణను సంప్రదించారు.

కటిక దారిద్య్రం...
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద గిరిజన కుంటుంబానికి చెందన నైతం నరేశ్‌కు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. మొదటి సంతానమైన పదేండ్ల కూతురు గాయత్రి కండ్లు సరిగ్గా కనిపించక విధిలేక బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. విధి వక్రించి రెండో కూతురికీ ప్రమాదకర వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయి తల్దిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏడేండ్ల వయసున్న రెండో కూతురు రత్న ఆకోలి ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో ఉన్నఫళంగా ఈ పాపకు 15 రోజుల క్రితం తీవ్ర జ్వరం, ఫిట్స్ వచ్చాయి. చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌లో చేర్పించగా.. సిటీస్కాన్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాప మెదడులో రక్తం గడ్డ కట్టిందని మెరుగైన శస్త్ర చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఊహించని వ్యాధి ఉందని తెలిసి కుటుంబం ఆందోళనకు గురైంది. చేతిలో డబ్బులేక ఉన్న రెండు మేకలను అమ్ముకోగా వచ్చిన డబ్బులతో మరుసటి రోజే హైదరాబాద్ గాంధీ దవాఖానలో చేర్పించారు. అక్కడ వైద్యులు స్పందించకపోవడంతో నీలోఫర్ దవాఖానలో చేర్పించారు. అక్కడ రెండు మూడు సిటీస్కాన్‌లు, వైద్య పరీక్షలు నిర్వహించి పాపకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని తేల్చి, మెరుగైన శస్త్రచికిత్స కోసం రూ.లక్ష ఖర్చవుతుందని తెలిపారు. అంత డబ్బు తమతో సాధ్యంకాదని ఆ తలిదండ్రులు నిస్సహాయస్థితిలో ఇంటికి తిరిగివచ్చారు. ఆపరేషన్ చేయక పోతే తమ కూతురు బతకదని తెలిసిన తల్లిదండ్రులతో పాటు ఆ చిన్నారి అక్క, తమ్ముడు గుండెలవిసేలా విలపిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ఈ పేద గిరిజన పాపకు ఈ వ్యాధి సోకడంతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మానవతామూర్తులు స్పందించాలని, పాపకు పునర్జన్మనివ్వాలని కోరుకుంటున్నారు. దాతలు సెల్ నంబర్ 9550062826 ద్వారా సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ 60196246679 (బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ గిమ్మ, జైనథ్ మండలం జిల్లా ఆదిలాబాద్)గా బాధిత కుటుంబం వెల్లడించింది.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...