కస్తూర్బాల్లో ఇంటర్ విద్య


Wed,July 10, 2019 01:07 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:పేద విద్యార్థుల చదువుల కోసం పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వారికి మరింత మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. పేదరికం, ఇతర సమస్యలతో మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థినులకు మంచి చదువులను అందించేందుకు జిల్లాలో ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 18 కస్తూర్బా పాఠశాలలు ఉండగా 16 పాఠశాలల్లో పదో తరగతి వరకే విద్యార్థినులు చదువుకునే అవకాశం ఉంది. దీంతో పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితుల్లో కస్తూర్బా పాఠశాల్లలో ఇంటర్ వరకు విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గతేడాది రెండు పాఠశాలల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం కాగా ఈ ఏడాది నుంచి మరో ఐదు పాఠశాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ చదివే అవకాశం లభించింది.
నిరుపేదలు, అనాథలు, మధ్యలో బడిమానేసిన ఆడ పిల్లల కోసం ప్రభుత్వ కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేసింది. జిల్లా విభజనకు ముందు 13 పాఠశాలలు ఉండగా, జిల్లా విభజన తర్వాత మరో ఐదు పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగ తి వరకు విద్యార్థినులు చదువుకునే అవకాశం ఉం డగా విద్యతోపాటు వృత్తి విద్యా కోర్సులను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కోర్సుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను సైతం నియమించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు మంచి విద్యతో పాటు పౌష్టికాహారాన్ని విద్యార్థినులకు అందజేస్తున్నారు. ఫలితంగా ఈ పాఠశాలల్లో బాగా డిమాండ్ పెరిగింది. కస్తుర్బాలో ఉచితంగా పదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థినులకు ఇంటర్, పైచదువులు చదువుకునే అవకాశం లేకుండా పోతున్నది.

ఈ పాఠశాలల్లో ఇంటర్ లేకపోవడంతో పేద విద్యార్థినులు పదో తరగతి వరకు చదివి మానేస్తున్నారు. ఇలాంటి వారి కోసం కస్తూర్బాల్లో ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. జిల్లాలోని కస్తూర్బా పాఠశాల్లో ఇంటర్ తరగతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా గతేడాది జిల్లాలోని బోథ్, జైనథ్ కస్తూర్బా పాఠశాల్లో ఇంటర్ తరగతుల కోసం అనుమతి లభించింది. జైనథ్‌లో సీఈసీ, ఎంపీఎస్‌డబ్లూ గ్రూపులు, బోథ్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల నిర్వహణకు అనుమతులు రావడంతో ఇక్కడ ఏడాది నుంచి ఇంటర్ తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా పాఠశాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులకు రెండు పాఠశాలల్లో ఉన్న సీట్లు సరిపోకపోవడంతో మరికొన్ని పాఠశాల్లో ఇంటర్ తరగతులు నిర్వహించేదుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐదు పాఠశాలల్లో ఇంటర్ కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అనుమతి లభించింది.

ఐదు పాఠశాలల్లో ఇంటర్ తరగతులు
జిల్లా వ్యాప్తంగా ఐదు కస్తూర్బా పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభంకానున్నాయి. నేరడిగొండ, ఉట్నూర్ పాఠశాలలతో పాటు తలమడుగు మండల లింగి విద్యాలయాల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లోని పాఠశాలల్లో సీఈసీ, ఎంపీఎస్‌డబ్యూ గ్రూపులు ప్రారంభమవుతాయి. ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థినులకు ప్రవేశం కల్పిస్తారు. కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులకు మంచి చదువు పౌష్టికాహారం లభిస్తుండంతో విద్యార్థినులు ఈ పాఠశాల్లలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ విద్యాలయాల్లో ప్రవేశాలకు బాగా డిమాండ్ ఉంది. ఐదు పాఠశాలల్లో ఆయా విద్యాలయాల్లో పదో తరగతి పూర్తయిన విద్యార్థినులతో పాటు ఇతర పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఐదు పాఠశాలలకు మంజూరైన ఇంటర్ తరగతులను త్వరలో ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం కానుండడంతో విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిందని వారు అంటున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...