టీఆర్టీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం


Fri,July 12, 2019 02:08 AM

ఎదులాపురం : ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అభ్యర్థులకు గురువారం సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయంలో ఉదయం నుంచే అభ్యర్థులు హాజరు కావడం కార్యాలయ ప్రాంగణం అభ్యర్థులతో కిటకిటలాడింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 213 స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, భాషా పండితుల భర్తీ కోసం జిల్లా శాఖకు ఉత్తర్వులు రావడంతో నియామక ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షిస్తూ పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ 213 మంది అభ్యర్థులకు గాను 149 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలనకు పిలిచామన్నారు. మిగతా 64 పోస్టులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నందున వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను త్వరలో చేపడుతామని తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించిన వారికి పోస్టింగ్‌లు 15వ తేదీ లోపు ఇస్తామని వెల్లడించారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరుతారన్నారు. ప్రస్తుత ప్రక్రియకు గైర్హాజరైన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌లో చివరి స్థానాలు కేటాయిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మహిళా ఉపాధ్యాయులను బాలికల పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏడీ అబ్దుల్ గనీ, పీజీ హెచ్‌ఎం అశోక్, ఎస్‌వో శ్రీహరిబాబు, మనోజ్ చంద్రసేన్, డీఈవో సీసీ సీడాం రాజేశ్వర్, టీచర్లు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...