కొత్త సార్లొస్తున్నారు..


Sun,July 14, 2019 12:52 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన టీచరు రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్టీ) ద్వారా ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియామక ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా సాగేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) స్థానంలో తెలంగాణ ప్రభుత్వం టీచరు రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి అప్పగించింది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో 2017లో టీఆర్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు భర్తీ చేస్తామని అప్పట్లోనే ప్రకటించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1582 పోస్టుల వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించగా.. ప్రభుత్వం అంగీకరించింది. టీఎస్సీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన భర్తీ ప్రక్రియ చేపట్టారు. ముందుగా స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేయగా.. అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను కూడా పరిశీలించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 180 ఖాళీలను గుర్తించగా.. 135 స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీడీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులను ఎంపిక చేసేందుకు కౌన్సెలింగ్ చేపట్టారు. 69 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 63 భాషా పండితులు, 3పీడీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు పోస్టులు, ఏజెన్సీ ప్రాంతంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో 48, మైదాన ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12, మైదాన ప్రాంతంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో 70 పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక భాషా పండితుల పోస్టులు, ఏజెన్సీ జిల్లా పరిషత్ పాఠశాలల్లో 17 స్కూల్ అసిస్టెంట్, 31 భాషా పండితులు, మైదాన ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో 9 స్కూల్ అసిస్టెంట్లు, 3 భాషా పండితులు, మైదాన ప్రాంత జిల్లా పరిషత్ పాఠశాలల్లో 42 స్కూల్ అసిస్టెంట్లు, 28 భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులను శని, ఆదివారాల్లో ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తున్నారు. వీరంతా ఈ నెల 15న ఎంపికైన పాఠశాలల్లో చేరేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఈ నెల 18న పోస్టింగ్ ఆర్డర్లును పంపిణీ చేస్తారు. 19న అభ్యర్థుల రిపోర్టింగ్ వివరాలు ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు అందజేస్తారు. రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను ఈనె ల 20న టీఎస్‌పీఎస్సీకి అందజేస్తారు. నియామకాల తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తారు. ఈ నెల 20 తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ) నియామక ప్రక్రియ కోసం షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగానే ఎస్జీటీల ఎంపిక ప్రక్రియ చేపడుతారు. ఈ నెలాఖరు వరకు జిల్లాలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తవడంతో ప్రభు త్వ పాఠశాలల్లో కొరత తీరనుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది.

ప్రాధాన్యత క్రమంలో పోస్టుల భర్తీ
తాజాగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో ముందుగా బడుల్లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు పరిగణలోకి తీసుకొని భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రాధాన్యత క్రమంలో పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. తర్వాత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి ఆయా చోట్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలుత డి, సి కేటగిరిలను ప్రాధాన్యతగా తీసుకొని భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాఠశాలల ప్రారంభంలోనే కొత్త టీచర్లు ప్రభుత్వ బడులకు వెళ్లనున్నారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత తీరడంతో పాటు ప్రభుత్వ విద్య బలోపేతం అయ్యేందుకు దోహదపడుతోంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల రాకతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...