జల సంరక్షణ కోసం కృషి చేయాలి


Tue,July 16, 2019 04:27 AM

నేరడిగొండ : ప్రతి ఒక్కరూ జలసంరక్షణ కోసం కృషి చేయాలని కేంద్ర సహాయ కార్యదర్శి ఇలా త్రిపాఠి కోరారు. వర్షపు నీటిని పొదుపు చేసి నీటిని సంరక్షించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమాలను చేపడుతున్నదని చెప్పారు. సోమవారం నేరడిగొండ మండలంలోని వాగ్దారి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాదాపూర్‌లో ఇలా త్రిపాఠి గిరిజన గ్రామస్తులను కలిసి మాట్లాడి జలసంరక్షణపై అవగాహన కల్పించారు. నీటి వనరులు కాపాడుకుంటే భవితకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే దేశంలో నీటి సమస్య చాలా ప్రాంతాల్లో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి మొదటి విడతలో ఎంపిక చేసిందన్నారు. అందులో ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాలు కాగా అందులో నేరడిగొండ మండలం కూడా ఉందన్నారు. జలవనరుల సంరక్షణ కోసం చేపడుతున్న పనులను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మాదాపూర్ గ్రామంలో జలసంరక్షణ పనుల చేపట్టేందుకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండడంతో సాగునీటి వసతి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. వాటిని రీచార్జ్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. జలసంరక్షణ కోసం చేపట్టిన కందకాలు, చిన్ని నీటి కుంటలు, చెరువులు తదితర వాటిని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. గ్రామంలో చెరువులు, కుంటల నిర్మాణాలపై ఆరా తీశారు. పంటల భీమా పథకం, భూ పరీక్షల వంటివి అమలవుతున్నాయా.. లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయని ఆరా తీశారు. పంట పెట్టుబడులు, విత్తనాల కొనుగోలుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేరడిగొండ గ్రామ సమీపంలో వాటర్‌షెడ్ పథకం ద్వారా చేపట్టిన రాతికట్టును, కుంటలను పరిశీలించారు. అనంతరం జలవనరుల సంరక్షణకు వాటర్‌షెడ్‌లో మరిన్ని పనులు చేపట్టాల్సిన అవసరముందని అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో రాథోడ్ రాజేశ్వర్, ఏపీడీ కృష్ణారావు, స్వామి, ఇరిగేషన్ డీఈ భీంరావ్, ఏఈ సురేందర్, ఈజీఎస్ ఏపీవో మంజులరెడ్డి, ఏఈవో స్వర్ణలత, వాటర్‌షెడ్ అధికారులు, స్థానిక సర్పంచ్ తప్ప గంగాదేవి, నేరడిగొండ సర్పంచ్ పెంట వెంకటరమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...