టీఆర్‌ఎస్ ప్రజల పార్టీ


Thu,July 11, 2019 01:27 AM

ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ఆది నుంచి టీఆర్‌ఎస్ పార్టీకు మద్దతుగా నిలిచిందని, ఇప్పుడు సైతం అదే ఊపులో నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదు ఉత్సాహంగా కొనసాగుతోందని నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి తుల ఉమ అన్నారు. వారం రోజులుగా ఆమె రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి నాయకులకు కో ఆర్డినేషన్ చేస్తూ టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతున్నారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ తో ఆమె మాట్లాడారు.

నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు లక్ష్యమెంత..?
తుల ఉమ : ప్రతి నియోజకవర్గానికి 50వేల సభ్యత్వ నమోదు లక్ష్యం నిర్దేశించారు. దీంట్లో క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం అని రెండు రకాలుగా తీసుకుంటున్నాం. క్రియాశీల సభ్యత్వం రూ.100 ఉండగా, దీంట్లో రిజర్వేషన్ కేటగిరీ వారికి రూ.50, సాధారణ సభ్యత్వం అందరికీ రూ.30కి అందజేస్తున్నాం.

పార్టీ సభ్యత్వం ద్వారా బీమా కల్పిస్తున్నారా..?
సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్న పార్టీ శ్రేణులు, ప్రజలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రమాదబీమా సౌకర్యం కల్పించారు. ప్రతి ఒక్కరి వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం.

సభ్యత్వానికి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది..?
టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు తమ ఇంటి పార్టీగా గుర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు పార్టీ ఏమి చేసిందో ప్రజలు అన్ని గమనించారు, గమనిస్తున్నారు. ప్రజల బాగోగులు చూసుకునే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని ప్రజలు గుర్తించారు. ఆరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా దేశం గర్వించే స్థాయిలో, దేశం ఆచరించే స్థాయిలో అత్యుత్తమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇవన్ని ప్రజలు గుర్తించారు కాబట్టే టీఆర్‌ఎస్ పార్టీ తమ పార్టీగా భావించి పార్టీ సభ్యత్వం తీసుకోడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమ తమ ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీలో భాగస్వాములం కావాలన్న ఉద్దేశంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు.

ఈ స్పందన మున్సిపల్ ఎన్నికల్లో సైతం లాభం చేకూరుస్తుందంటారా..?
తప్పకుండా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే త్వరలో జరగనున్న మున్పిపల్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటి అన్ని బల్దియాలపై జెండా ఎగురవేయడం ఖాయం. సభ్యత్వం ద్వారా ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ మా పార్టీ అనే భావన వచ్చింది, కాబట్టి తప్పకుండా ఈ సభ్యత్వం సైతం మున్సిపల్ ఎన్నికలకు లాభం చేకూరుస్తుందని చెప్పవచ్చు.

ఇప్పటి వరకు ఎంత మేర లక్ష్యం చేరుకున్నారు...?
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదులో నిజామాబాద్ రూరల్ ముందంజలో ఉంది. ఇప్పటికే 25వేల సభ్యత్వం పూర్తి చేశాం. ఇవే కాకుండా చాలా మంది ఆన్‌లైన్‌లో సైతం సభ్యత్వాల నమోదు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తప్పకుండా లక్ష్యాన్ని మించి సభ్యత్వం నమోదు కావడం ఖాయం.

సభ్యత్వ నమోదుకు ఎప్పటి వరకు గడువు ఉంది..?
తుల ఉమ : ఈనెల 10నే గడువు అనుకున్నాం. కానీ, ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ఈనెల 20తో సభ్యత్వాల నమోదు పూర్తి చేయాలనుకుంటున్నాం.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...