ఇందూరు ఆత్మ బంధువు దాశరథి


Mon,July 22, 2019 01:52 AM

ఖలీల్‌వాడి: మహాకవి, కళాప్రపూర్ణ దాశరథి కృష్ణమాచార్యులు వరంగల్‌లో పుట్టినా ఆయన పేరు ప్రస్తావనకు రాగానే నిజామాబాద్ గుర్తుకొస్తుంది. ఆయన మూడు నెలలు ఇక్కడ గడిపిన జైలు జీవితం ఆయనను ఈ గడ్డ బిడ్డగా మార్చింది. ఆయన పలు సందర్భాల్లో నిజామాబాద్‌కు వచ్చినప్పటికీ.. 1947 నాటి జైలు జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైంది అని పేర్కొన్నారు. ఆయన రచించిన అగ్నిధార రచన ఇక్కడి జైలులోనే పురుడు పోసుకున్నది. బొగ్గు ముక్కను పాలకులపై వజ్రాయుధంగా ప్రయోగించి ఆయన కవీంద్రుడై వెలసిందిక్కడే. తెలంగాణ జనం కండ్లళ్లలో వెన్నెల కాయిస్తా.. జనం గుండెల్లో ఆనందం పండిస్తా.. అన్న నినాదం తెలంగాణ పోరాట యోధులందరి ఆశయమైంది. 1948 సెప్టెంబర్ 17, 2014 జూన్ 2 పండుగలు ఆ ఆశయానికి రూపమనడంలో సందేహం లేదు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని వీణపై హిందోళాన్ని ఆ వెంటనే రుద్రరాగాన్ని పలికించాడు దాశరథి. ఆయన తెలంగాణ యుగపురుషుడు. ఉద్యమ కాలంలో మధ్యాహ్నపు మార్తాండుడు. సినీ జగత్తులో పున్నమి చంద్రుడు. ప్రభుత్వాల దృష్టిలో అత్యంత ప్రతిభావంతుడు. మూడు కోణాలలో విజేతగా నిలిచిన అరుదైన కవితా శిఖరం డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు. రాజును బూజుగా, కవితను దానిని తుడిచే కర్రగా అభివర్ణించడం దాశరథికే చెల్లింది. రైతుదే తెలంగాణమని ఆయన అనడంలో పోతన మళ్లీ పుట్టాడన్న భావన కలిగించారాయన. దాశరథికి నిజామాబాద్ జిల్లాకు మధ్య ఉన్నది రక్తబంధం కన్న గొప్ప ఆత్మబంధం. జిల్లాలోని ఖిల్లా జైలులో శిక్షణను అనుభవిస్తున్న కాలంలో ఇందుపుర ద్గురము రచన అత్యంత ప్రజాదరణ పొందినది.

దాశరథి రుణం తీర్చుకుంటున్న జిల్లా...
2007లో జరిగిన నిజామాబాద్ జిల్లా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూపొందించిన శకటంపై దాశరథి చిత్రపటాన్ని పెట్టి గౌరవించారు. 2009 డిసెంబర్ 25న ఆయన జైలు శిక్షను అనుభవించిన బ్యారక్ నంబరు 8లో హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ కవులందరూ దాశరథి స్మృతిలో ఒక రోజు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటుచేశారు. జిల్లా నుంచి జైలు తరలిపోవడంతో ఈ ప్రాంతాన్ని దాశరథి స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జిల్లా సాహితీవేత్తలు, సాహితీ సంస్థలు తీర్మానాలు చేశారు. జైలు ప్రాంగణంలో రఘునాథ ఆలయ కమిటీ కూడా దాశరథి స్మారక కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితారాణా ఉన్నప్పుడు దాశరథి స్మారక ప్రాంగణం అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. బ్యారక్ నంబరు 8లో దాశరథి జీవితంలోని ఘట్టాలను తెలియజెప్పే చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాశరథి కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, మనువళ్లు, మనువరాళ్లను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ ఖిల్లా ప్రాంగణాన్ని సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, అవసరమైన సౌండ్ అండ్ లైట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంగణాన్ని సందర్శించిన నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దాశరథి స్మృతి వనాన్ని అందరూ గర్వించేలా తీర్చిదిద్దుతామన్నారు. ప్రముఖ కవి, గాయకుడు, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ఖిల్లా ప్రాంగణాన్ని సందర్శించి తెలంగాణ అస్తిత్వ కేంద్రమని అభివర్ణించారు. ఆకర్షణీయమైన, విజ్ఞానభరితమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. హరిదా రచయితల సంఘం, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాశరథి స్మృతిలో కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. గతంలో ఇందూరు భారతి నిర్వహించిన పలు కార్యక్రమాలకు దాశరథిని ఆహ్వానించారు. వచ్చే యేడు దాశరథి జన్మదినం వరకు దాశరథి స్మృతి కేంద్రం సంపూర్ణ రూపం దాలుస్తుందని జిల్లా సాహితీ ప్రియులు, దాశరథి అభిమానులు కోరుకుంటున్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...