ఇది చారిత్రక జల దృశ్యం


Sun,July 14, 2019 01:32 AM

మంథని, నమస్తే తెలంగాణ : దిగువన ఉన్న ప్రాణహిత నీరు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎగువకు పారుతుండడం చారిత్రాత్మకమనీ, సీఎం కేసీఆర్ మహాసంకల్పంతోనే ఇలాంటి అద్భుత జల దృష్యం ఆవిష్కృతమైందని జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా గోదావరి, ప్రాణహిత నుంచి లక్షల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నా.. వాటిని తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలన్న ఆలోచన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఏనాడూ రాలేదని ఆయన దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కృషితో ప్రాణిహిత నీరు, రాష్ట్రంలోని బీడు భూములను తడుపబోతున్నదని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అసత్యాలు మాట్లాడడం మాని, మహాద్భుత కాళేశ్వరాన్ని కళ్లు తెరచి చూడాలని ఆయన హితవుపలికారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పరిశీలకుడు కర్ర శ్రీహరితో కలిసి, మంథని గౌతమేశ్వర గోదావరి తీరంలో బోటులో కొంత దూరం వరకూ వెళ్లి, ఎదురెక్కుతున్న జలాలను పుట్ట మధు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రాత్మకమైనని చెప్పారు.

ఇకనుంచి కాళేశ్వరానికి ముందు, కాళేశ్వరం తర్వాత అని చరిత్రను చెప్పుకోవాలన్నారు. పల్లానికి ప్రవహించాల్సిన నీరు ఎదురెక్కడం ఎక్కడా కనిపించదనీ, అది ఒక్క తెలంగాణలోని కాళేశ్వరంలోనే దర్శనమిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడంతో పాటుగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం నుంచి ఎదురెక్కుతున్న నీళ్లతో రెండు మూడు రోజుల్లో ఎల్లంపల్లిని నింపుకుంటామన్నారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ రకాలుగా చేసిన ఆరోపణలకు కాళేశ్వరం నీళ్లే సమాధానం చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కళ్లుండి చూడలేని కబోదీలని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడే ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. సీఎం పిలుపు మేరకు మంథని నియోజకవర్గంలోని రైతులు ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చారనీ, ఈ రోజు ఆ రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయన్నారు.

గత పాలకుల వైఫల్యాలు తెలుస్తున్నయ్..
సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలనతో గత పాలకుల వైఫల్యాలేమిటో ప్రజలకు తెలుస్తున్నాయని టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు పరిశీలకుడు కర్ర శ్రీహరి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన అనేక కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేవేననీ, అందులో కాళేశ్వరం అతి ప్రధానమైదనని చెప్పారు. గోదావరి నది ఎదురు ప్రయాణం దాదాపుగా సగం పూర్తయిందనీ, మరో సగమైతే ఎల్లంపల్లికి చేరుకుంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండా శంకర్, నాయకులు ఎక్కేటి అనంతరెడ్డి, గుజ్జుల రాజిరెడ్డి, ఏగోళపు శంకర్‌గౌడ్, ఆకుల కిరణ్, కనవేన శ్రీనివాస్, సీపతి బానయ్య, వీకే రవి, ఎస్‌కే బాబూ ఉన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...