మేధోమథనం.. మానసిక వికాసం


Sat,July 20, 2019 03:11 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నలుగురు కాలేజీ విద్యార్థులు కలిస్తే.. సాధారణంగా ఏం మాట్లాడుకుంటారు. సినిమా, పార్టీలు, షికార్లు, సరదా సంభాషణలు సాగిస్తారు. కాలేజీలో కూడా అనవసరపు మాటలతో కాలక్షేపం చేస్తారు. అంతకు మించి ఇంకేముంటుందనేది చాలామంది అభిప్రాయం. అయితే ఇది ఒకప్పటి మాట అని ఈతరం విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల ఐడియాలజీ మారింది. జ్ఞాన సముపార్జనకు అవసరమయ్యే దారు లను వెతుక్కుంటున్నారు. అందుకు సంబంధించి వేదికలను సృష్టించుకుంటున్నారు. ముఖ్యంగా కాలేజీ క్లబ్స్ పేరుతో తమ ఆలోచనలకు పదునుపెడుతున్నారు. ఖాళీ సమయాల్లో ఒక గ్రూపుగా ఏర్పడి చర్చలు.. నిర్వహిస్తూ గురువుల మన్ననలు పొందుతున్నారు. అంతేకాదు అకాడమిక్‌లో రాణించేందుకు టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటున్నారు. స్టూడెంట్ క్లబ్ కల్చర్ గతంలో ఉన్నా.. ఇప్పుడు వాటి ఆవశ్యకత పెరగడం విశేషం.

ఒకరికొకరు..చర్చించి
తరగతి గదుల్లో గురువు చెప్పే పాఠాలు అర్థం అవకపోతే స్టూడెంట్స్ క్లబ్‌లో ఒకరికొకరు చర్చించి తెలుసుకుంటున్నారు. వారికి తెలిసిన విషయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా సామాజిక అంశాలు, అకాడమిక్ సబ్జెక్ట్స్, లైఫ్‌ైస్టెల్ తదితర వాటిపై చర్చలు చేస్తున్నారు. అంతేకాదు వీరి చర్చలను పర్యవేక్షించడానికి ఓ గురువును సలహాదారుడిగా పెట్టుకుంటున్నారు. కాలేజీ యాజమాన్యాలు స్టూడెంట్ కల్చర్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. నగరంలో ప్రతీ పది కళాశాలల్లో ఐదుకు పైగా కళాశాలల్లో స్టూడెంట్ క్లబ్‌లు ఏర్పడుతున్నాయి. మానసిక వికాసానికి స్టూడెంట్ క్లబ్స్ ఎంతగానో తోడ్పడుతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. చర్చల సమయంలో వారిలో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. నైపు ణ్యం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో విద్యార్థులు స్టూడెంట్ క్లబ్‌గా ఏర్పడుతున్నారు. వారివారి అకాడమిక్ సబ్జెక్టులు చర్చిస్తూనే ఇతర అంశాలపై మాట్లాడుకుంటున్నారు. ఏదైనా సహకారం అందించాలంటే క్లబ్ తరపున వారు ముందుంటున్నారు.

స్టూడెంట్ క్లబ్‌తో స్నేహభావం
కాలేజీలో కొత్తగా ప్రవేశించిన విద్యార్థులకు కొంత బెరుకు సహజం. సీనియర్లు ర్యాగింగ్ చేస్తారనే భయం ఉంటుంది. కానీ స్టూడెంట్ క్లబ్‌లో ఉన్న విద్యార్థులు జూనియర్లతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతుంటారని లెక్చరర్లు చెబుతున్నారు. క్లబ్‌లో విద్యార్థులకు ప్రతిఅంశంపై అవగాహన ఉండేలా చర్చలు ఉంటాయని ఓ కళాశాల లెక్చరర్ రవీంద్ర తెలిపారు. విద్యార్థుల మధ్య స్నేహభావం పెంపొందేలా వాతావరణం ఉంటుందని చెప్పారు. కేవలం అకాడమిక్ సబ్జెక్టులే కాకుండా రాజకీయాలు, సక్సెస్ స్టోరీలపై విద్యార్థులు చర్చలు జరిపేలా ప్రణాళికలు అందిస్తామన్నారు. అంతేకాదు పుస్తకాలు చదివేలా వారిని ప్రోత్సహిస్తామని, విద్యార్థులు సాధారణంగా అకాడమిక్ పుస్తకాలు చదవటానికి కొంత ఆసక్తి చూపించరు. అలాంటి విద్యార్థులు స్టూడెంట్ క్లబ్‌లో చేరితే ఇతర విద్యార్థులను చూసి నేర్చుకుంటున్నారు. అంతేకాదు లెక్చరర్ల దృష్టిలో పడి మంచిపేరు తెచ్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

టెక్నాలజీతో పాఠాలు షేర్
ఈతరం విద్యార్థులు టెక్నాలజీని విరివిగా వాడుతారు. ఏ యాప్ ఎందుకు వాడుతారో టక్కున చెప్పేస్తారు. విద్యార్థులు కేవలం టెక్నాలజీని సరదాల కోసం కాకుండా పరిజ్ఞానం కోసం ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు వాట్సాప్‌లో గ్రూపుగా ఏర్పడి అందులో లెక్చరర్లు ఉండేలా చూస్తున్నారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు తరగతికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో సబ్జెక్టులపై చర్చిస్తున్నారు. ఈరోజు హోం వర్క్ ఏంటీ? ఏదైన సందేహాలుంటే ఆ గ్రూపులో అడిగి తెలుసుకుంటున్నారు. లెక్చరర్లు కూడా గ్రూపులో ఉత్సాహంగా ఉండి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, కెమిస్ట్రీకి సంబంధించిన డౌట్స్‌ను క్లియర్ చేసుకోవడానికి వాట్సాప్ గ్రూపు చాలా ఉపయోగపడుతుందని ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి నవీన్ చెప్పాడు. లెక్చరర్లు తమకు నచ్చిన సక్సెస్ స్టోరీలను గ్రూపులో పెట్టి విద్యార్థులు చదివేలా ప్రోత్సహిస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...