లోక్ అదాలత్‌తో...సత్వర న్యాయం సమన్యాయం


Sat,July 13, 2019 10:39 PM

-జాతీయ లోక్ అదాలత్‌లో 3,663 కేసుల పరిష్కారం
-రూ.2,29,42,509 కోట్లు రికవరీ
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవి
సంగారెడ్డి టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 3,663 కేసులను పరిష్కరించి రూ.2,29,42,509 నగదు రికవరీ చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవి అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా కోర్టులో జాతీయ న్యాయసేవాధికార సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.భవానీ ఆధ్వర్యంలో జాతీయలోక్ అదాలత్ నిర్వహించారు. ఈ జాతీయ లోక్‌అదాలత్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్‌ల ముఖ్య ఉద్దేశం రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు సత్వర న్యాయం- సమన్యాయం కోసం నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్‌లో న్యాయవివాదాలను పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు వీలు ఉంటుందని, న్యాయ స్థానాల్లో సివిల్, క్రిమినల్ కేసులను కక్షిదారుల ఆమోదం మేరకు రాజీ పద్ధతిన పరిష్కరించుకోవడానికి వీలుగా న్యాయసేవాధికార సంస్థ లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేస్తుందన్నారు.

కక్షిదారులు వారి ఆస్థి తగాదాలు, మోటరు వెహికల్ ప్రమాద నష్టపరిహార కేసులు. బాగ పరిష్కార కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, టెలీఫోన్ రికవరీ కేసులు, కుటుంబ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు తదితర అన్ని రకాల కేసులు రాజీ మార్గాన పరిష్కరించుకునే కేసులను లోక్ అదాలత్‌లలో పరిష్కరిస్తామన్నారు. కంది మండలంలోని ఓడీఎఫ్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రూ.31,87వేల నష్టపరిహారం అందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో మొత్తం 3,663 కేసులను పరిష్కరించారు. సివిల్ కేసులు 17, ఎంవీవోపీ కేసులు 35, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 1100, 138 ఎన్‌ఐ యాక్టు కేసులు 10, బ్యాంకు రికవరీ కేసులు 47, విద్యుత్ చౌర్యం కేసులు 2448, టెలీఫోన్ కేసులు 3, ఎల్‌ఏవోపీ కేసులు 3 మొత్తం 3,663 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. వాటికి సంబంధించి రూ.2 కోట్ల 29లక్షల42వేల 509లు నష్టపరిహారం రికవరీ చేసినట్లు వివరించారు. లోక్ అదాలత్‌లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవాని, సీనియర్ సివిల్ జడ్జీ ఎం.శ్యాంశ్రీ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎండి,జలీల్ అహ్మద్, అదనపు ప్రథమశ్రేణి జడ్జి ఎం.కల్పన, సెకెండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రభాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నర్సింగ్‌రావు, పోలీసు అధికారులు, సీనియర్ న్యాయవాదులు, బెంచీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...