నర్సాపూర్‌లో ఆరోగ్య వేదిక


Wed,July 17, 2019 12:38 AM

ఝరాసంగం:నర్సాపూర్‌ను గ్రామంగా మార్చడంలో అందరి పాత్ర అవసరమని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం నర్సాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ ఆరోగ్యవేదిక కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలు, ప్రజాప్రతినిధులకు వివరించారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు కలిసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం నిర్వహణపై రెండు కమిటీలు వేయాలన్నారు. గ్రామ మంచినీటి, పారిశుధ్య కమిటీ, వైద్యారోగ్య కమిటీ సర్పంచ్ అధ్యక్షతన వేయాలన్నారు. రెండు కమిటీలు తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వీరికితోడు ప్రజ లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో పర్యటించి ప్రతి కుటుంబం సమగ్ర సమాచారం తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ప్రతి ఇంటి ఆవరణలో 10 మొక్కలు పెంచుకోవాలన్నారు. వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేసి వారికి ఉన్న రోగనిర్ధారణ చేయాలని ఆదేశించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గ్రామంలో పరిసరాల పరిశుభ్రత ఉండేందుకు గ్రామస్తులు సహకరించాలన్నారు. చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డంపింగ్ యార్డులో వేయా లని, ఇంటింటికి చెత్తబుట్టలు పంపిణీ చేస్తామన్నారు. స్థల దాతలు ముందుకు వచ్చి 00.20 గుంటల భూ మిని ఇస్తే డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు నిర్మా ణం చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గ్రామం లో చెత్తను సేకరించేందుకు బ్యాటరీ ఆటో ట్రాలీని పంపిణీ చేస్తామన్నారు. గ్రామంలో ఉన్న యువకులతో నర్సాపూర్ గ్రామ యువజన సంఘంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులకు సూచించారు.

మహిళా సంఘాలతో కమిటీలు ఏర్పాటు చేయాలి..
గ్రామంలో మహిళా సంఘాలతో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి వారం పరిసరాల పరిశుభ్రతపై చర్చించి గ్రామ అభివృద్ధిపై సమావేశంలో తీర్మానం చేయాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు గర్భిణులు, బాలింతలు కిషోరబాలికలను గుర్తించాలన్నారు.

పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలి..
ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఉపాధి హామీ సిబ్బంది గ్రామంలో జరుగుతున్న పనులపై దృష్టి సారించాలన్నారు. మూడు నెలల్లోనే ఆదర్శ గ్రామంగా మారుతుందన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని తొలిగించి కొత్త భవన నిర్మాణానికి కావాల్సిన నిధుల విషయంలో సహకరిస్తానన్నారు. నూతన భవనానికి వెంటనే పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని డీపీవో వెంకటేశ్వరావును ఆదేశించారు. గ్రామంలో కొనసాగుతున్న పశువైద్య శిబిరాన్ని సందర్శించి పశువులకు టీకాలు వేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశా రు. చిన్నారులకు అన్నప్రాసన చేసి ఆరోగ్యవంతులుగా ఉన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ జితేశ్‌పాటిల్, జిల్లా వైద్యాధికారి మోజీరాంరాథోడ్, మాతాశిశు సంక్షేమశాఖ అధికారి గాయిత్రీదేవి, డీపీ వో వెంకటేశ్వరావు, జిల్లా ఐసీడీఎస్ పీడీ మోతి, జిల్లా పశువైద్యాధికారి రామోజీరాథోడ్, డీపీఎంవో జగనాథ్‌రెడ్డి, డీపీఆర్‌వో విజయలక్ష్మి, జహీరాబాద్ ఆర్‌డీవో రమేశ్ బాబు, ఎంపీడీవో సుజాత, తహసీల్దార్ అమీన్‌సింగ్, ఎంపీపీ అధ్యక్షుడు కటికె దేవవాసు, ఐసీడీఎస్ ప్రోగ్రాం అధికారి బ్రహ్మజీ, మండల వైద్యాధికారి మాజీద్, గ్రామ సర్పంచ్ శశిరేఖ, పీఎస్ సీఎస్ చైర్మన్ సంగారెడ్డి పాల్గొన్నారు.
కేతకీలో కలెక్టర్ పూజలు ..
ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో కలెక్టర్ హనుమంతరావు పూజ లు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ నర్సంహాగౌడ్ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...