ఆక్వా ఉత్పత్తిలో నల్లగొండ ప్రథమస్థానం


Thu,July 11, 2019 03:54 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం వందశాతం సబ్సిడీలో అందజేసినటువంటి చేప పిల్లలను ఎక్కువ చెరువుల్లో విడుదల చేసి అత్యధిక చేపపిల్లల ఉత్పత్తి (ఆక్వా) సాధించడంలో నల్లగొండ ప్రథమస్థానం సంపాదించడం సంతోషకరమైన పరిణామమని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. జాతీయ మత్స్య కృషి వలుల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంబించగా ఆ తర్వాత మత్స్యకారులు ప్రభుత్వ సబ్సిడీతో పొందిన లబ్ధిని గురించి తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్య సంపద ఎక్కువ రావడానికి కృషి చేసిన మత్స్యశాఖ అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. జిల్లా వ్యాప్తంగా 490 గ్రామ పంచాయతీ, 213 మత్స్యశాఖ చెరువులతో పాటు 9 జలాశయాలు ఉండగా వాటిపై 22,630 మత్స్యకారులు జీవనోపాధిని పొందుతున్నారన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద రూ.38 కోట్లతో మార్కెటింగ్‌కు కావల్సిన వాహనాలతో పాటు ఇతర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీలో అందజేయగా అర్హులందరికి వాటిని పంపిణీ చేశామన్నారు.

ద్విచక్ర వాహనాలతో పాటు టాటాఏస్‌లు, ఇన్సులేటెడ్ ట్రక్కులు, వలలు, 70 కొత్త చెరువుల నిర్మాణానికి నిధులు, 2 రీసర్క్యులేటరీ ఆక్వా కల్చరీ సిస్టమ్‌లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో నీలి విప్లవం పథకం కింద 46 కొత్త చేపల చెరువులతోపాటు 3 రీసర్క్యులరీ ఆక్వా కల్టరీ సిస్టమ్‌లు, 2ఏటరీలు మంజూరయ్యాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని మత్స్యకారులకు సూచించారు. అనంతరం మత్స్యశాఖ అధికారి చరిత మాట్లాడుతూ 2016-17, 2017-18 ఆర్ధిక సంవత్సరంలో నీలి విప్లవం పథకం కింద 5 కొత్త చేపల చెరువులు, 5 ఏటరీలు మంజూరయ్యాయన్నారు. ఒరిస్సా రాష్ర్టానికి డా.హీరాలాల్ చౌదరి అనే శాస్త్రవేత్త 1957లో జులై 10న చేప విత్తన ప్రేరేపిత అండోత్పత్తి విధానాన్ని విజయవంతంగా ప్రయోగం చేసినందున 2001 నుంచి భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ మత్స్యకృషి వలుల దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారి డా.రమేష్, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ వినోద్, ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మీ, సూపరింటెండెంట్ నిర్మల, ఎఫ్‌డీవో అంజయ్య, జ్యోతి ప్రసాద్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...