ఫుల్ జోష్‌లో టీఆర్‌ఎస్


Sat,July 13, 2019 01:58 AM

- గులాబీ శ్రేణుల్లో మున్సిపల్ ఎన్నికలకు ముందే ఉత్సాహం
- వాడవాడలా సాగుతున్న సభ్యత్వ నమోదు
- అభివృద్ధి పనులతో పట్టణాలు చుట్టేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి
- వార్డుల వారీ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఎమ్మెల్యేలు
- మున్సిపల్ చైర్మన్ పీఠాల క్లీన్ స్వీప్‌పై టీఆర్‌ఎస్ నేతల నజర్
ఉద్యమంలా సాగుతున్న సభ్యత్వ నమోదు ఒకవైపు.. అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి మరోవైపు.. వెరసి మున్సిపల్ ఎన్నికలకు ముందే ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త ఉత్సాహం ఆవహించింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరీ టీఆర్‌ఎస్ సభ్యత్వాల కోసం వాడ వాడలా క్యూలు కడుతున్న పరిస్థితులు పలుచోట్ల నెలకొంటున్నాయి. అన్ని స్థాయిల టీఆర్‌ఎస్ నాయకులు సంబురంలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట వంటి ప్రధాన పట్టణాల్లో ఇప్పటికే మంత్రి జగదీష్‌రెడ్డి విస్తృత పర్యటనలు ప్రారంభించారు. ప్రతీవార్డుకు లాభం చేకూర్చేలా పెద్ద సంఖ్యలో గతంలోనే మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను మొదలు పెడుతున్నారు.
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికలు ఏవైనా తిరుగులేని ఆధిక్యం చాటుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పైనా ఇప్పటినుంచే నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీ స్థానాలు ఉండగా.. నకిరేకల్ మినహా మిగిలిన అన్నిచోట్లా ఇప్పటికే పాలకవర్గాల గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు శరవేగంగా చేపడుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జిల్లాలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 18 స్థానాల చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే లక్ష్యంతో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా వ్యూహాత్మకంగా పని చేస్తోంది. ఉద్యమంలా ప్రతీనిత్యం వాడవాడలా సాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది. పెద్దగా శ్రమించాల్సిన పనిలేకుండా.. పట్టణాలు, పల్లెటూళ్లలో ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తుండడం విశేషం.

అభివృద్ధి పనులతో ప్రతీ వార్డుకూ పలకరింపు
సభ్యత్వ నమోదు సందడి ఓ వైపు పల్లెటూళ్లతోపాటు పట్టణాల్లోనూ కొనసాగుతుండగానే.. ప్రతీ నిత్యం ప్రజల మధ్యనే గడుపుతున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు తమ పర్యటనలు మరింత ముమ్మరం చేశారు. ముఖ్యంగా పురపాలికల్లో ప్రతి వార్డునూ పలకరిస్తున్నారు. సమస్యలు ఆరా తీస్తూ తక్షణ పరిష్కారాలు చూపుతున్నారు. దీనికితోడు గతంలోనే పెద్దమొత్తంలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు సైతం ఉత్సాహంగా చేపడుతున్నారు. విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం సూర్యాపేట పట్టణంతోపాటు నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు సైతం చేపట్టారు. త్వరలోనే మరికొన్ని పట్టణాల్లోనూ మంత్రి కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆయా పట్టణాల్లోని పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది. మున్సిపాలిటీ ఎన్నికలకు ముందే పూర్తి ఉత్సాహంతో కూడిన వాతావరణం తమ పార్టీ శ్రేణులకు మరింత బలాన్ని చేకూరుస్తుందని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 18మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను భారీ మెజారిటీలతో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...