సామర్థ్యాల పెంపునకు ఏబీసీ


Wed,July 17, 2019 04:25 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యనందించి వారి భవిష్యత్‌కు బాటలు వేసేలా చేయాలనేది ప్రభుత్వం, విద్యాశాఖ లక్ష్యం. అయితే, చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ తరగతుల్లోకి వచ్చిన విద్యార్థులకు సైతం చదవడం, రాయడం, గణితం అంశాల్లో వెనుకబడి ఉన్నారనేది నేషనల్ అచివ్‌మెంట్ సర్వే-2017తో వెల్లడైంది. దీంతో విద్యాశాఖ వాటిని పెంచేందుకు త్రీఆర్స్(చదవడం,రాయడం,ఆర్థమెటిక్)ను అందుబాటులోకి తెచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో 2019-20 సంవత్సరానికి విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు మూలాల్లోకి వెళ్దాం పేరుతో ఏబీసీ(అటైన్‌మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటెన్సి) నూతన కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది.

3నుంచి 7తరగతుల విద్యార్థులకు అమలు...
ఈ విద్యా సంవత్సరం జూలై మొదటి వారం నుంచే ప్రాథమిక, ప్రాతమికోన్నత, ఉన్నత, కేజీబీవీ పాఠశాలల్లో 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాతృభాష, గణితం, ఆంగ్ల భాషల్లో ఆయా తరగతుల్లో కొనసాగడానికి అవసరమైన కనీస సామర్థ్యాలను సాధించేలా పాఠశాలల వారీగా కార్యాచరణను రూపొందించి ఏబీసీ అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విద్యార్థులకు తొలుత సామర్థ్య పరీక్ష నిర్వహించి తెలుగు, గణితం, ఆంగ్లంలో వారి సామర్థ్యాలను నిర్ధారించుకుని ప్రత్యేక ప్రణాళికలతో రెగ్యులర్ తరగతులకు ఆటంకం కలుగకుండా ఏబీసీ విధానంలో పాఠ్యాంశాలు బోధించి సామర్థ్యాలను పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఆగస్టు 31 వరకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు విద్యార్థి వారిగా నివేదికలను నమోదు చేసి తెలియపరచాల్సి ఉంటుంది.

జిల్లావ్యాప్తంగా 1,483పాఠశాలల్లో అమలు...
జిల్లా వ్యాప్తంగా 1,483ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఏబీసీ అమలు చేస్తున్నారు. వీటిలో 246ఉన్నత పాఠశాలలు, 136 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,038 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటన్నిటిలో 1.09,735 మంది విద్యార్థులుండగా 8 నుంచి 10తరగతులు విద్యార్థులు మినహాయించి మిగిలిన తరగతుల విద్యార్థులకు ఏబీసీతోనే విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఎబీసీని పటిష్టంగా నిర్వహిచేందుకు విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు బోధనెలా చేయాలి..? అనే అంశంపై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. గణితంలో చదుర్వేద ప్రక్రియలు చేయలేని విద్యార్థులకు బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తల తీసుకోవాలి. రోజువారి సబ్జెక్టుల బోధనలకు ఆటంకం కల్గకుండా ఉదయం లేదా సాయంత్రం ఎదో సమయంలో నేర్పించాలి. జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో జిల్లా మానిటరింగ్ బృందాలు ఏర్పడి పర్యవేక్షిస్తారు. సెక్టోరియల్ అధికారులు మండలాలను దత్తత తీసుకొని ఏబీసీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్త్తారు. జిల్లా విద్యాధికారి ప్రతి 15 రోజులకు ఒక సారి పాఠశాల ప్రధానోపాధ్యాయులచే సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతినివేదికలు తయారు చేయించాలి. ఆగస్టు 15వ తేదీలోగా ఏ పాఠశాలలు అయితే పూర్తిగా ఏబీసీ ని పూర్తి చేపి ఫలితాలు సాధిస్తారో.. వారిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులను రాష్ట్ర స్థాయికి ఆహ్వానించి ప్రశంసా పత్రాలను అందజేస్తారు.

పాఠశాలల్లో ఏబీసీ నిర్వహణ ఇలా...
3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులందరికి మాతృభాష, ఇంగ్లీష్, గణితంపై కనీస సామర్థ్యాలు సాధించేందుకు వీలుగా బోధించాలి. విద్యార్థులను పూర్తి స్థాయిలో 45నుంచి 60 రోజుల లోపుల చదవడం రాయడం, గణిత ప్రక్రియలను చేసే వింధంగా చేయాలి. విద్యార్థుల స్థాయి తెలుసుకునేందుకు తెలుగు, ఇంగ్లీష్, గణితంలో మొదటగా ఎస్సీఈఆర్టీ ఇచ్చిన పరీక్ష ప్రశ్నాపత్రాలతో పరీక్ష నిర్వహిస్తారు. వాటి ఫలితాలను సీఆర్పీలు సేకరించి మండల ఎంఐఎస్ సహకారంతో నెట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నెట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆతరువాత ప్రారంభ పరీక్ష ఆధారంగా కనీస సామర్థ్యాలున్న వారిని, లేనివారిని గుర్తించి తరగతుల వారీగా జాబితా రూపొందించి లేని వారికి ఏబీసీ కార్యక్రమం అమలు చేస్తారు. మొదటి దశలో ఈ నెల 19న విద్యార్థులకు చదవడం, రాయడం రాని విద్యార్థులను విద్యపై ప్రోత్సహిస్తూ శిక్షణ నిస్తారు. రెండో దశలో ఆ విద్యార్థులు వాటిలో ఫలితాలు సాధించడంతో తిరిగి వారు ఆయా సబ్జెక్టుల్లో స్వయంగా రాయడం, చదవడం, గణితంలో భాగహారాలు, గుణకారాలు, కూడికలు, ఇతర లెక్కలను చేసే విధంగా శిక్షణ నిస్తారు. అయితే ఈ శిక్షణ నిరంతర సమగ్రమూల్యాంకనం (సీసీఈ)కి అనుగుణంగా నిర్వహిస్తున్నారు.

నేడు, రేపు విద్యార్థులకు ఏబీసీ ప్రీ టెస్టు...
ఏబీసీ గ్రేడింగ్ నమోదులో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 17,18న ఏబీసీ బేసిక్ (ప్రీ) టెస్టును నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ టి. విజయకుమార్ నెం. 3117/టీఎస్‌ఎస్/టీ6/పీడీజీ/2019తో ఈ నెల 15న జీఓను విడుదల చేశారు. దీనిలో భాగంగా 17న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 18న ఉదయం ఇంగ్లీష్‌లో పరీక్ష నిర్వహించాలి. పరీక్షకు సంబంధించిన అంశాలను సీఆర్‌పీలు సేకరించి డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా నమోదు చేయించాల్సి ఉంటుంది.

గ్రేడింగ్ ఇలా..
ఏబీసీ కార్యక్రమానికి సంబంధించిన పరీక్ష గ్రేడింగ్ ఇలా ఉండనుంది. ఆరంభ పరీక్షలో తెలుగులో చదవడంలో 10మార్కులకు 10వస్తే గ్రేడ్-ఎ, 7 నుంచి 5 మార్కులు వస్తే -బి, 4 కంటే తక్కువ వస్తే సి- గ్రేడ్ కేటాయిస్తారు. అదే విధంగా తెలుగులో రాయడానికి 15 మార్కులకు గాను 12 నుంచి 15 వస్తే గ్రేడ్-ఎ, 8 నుంచి 11 వస్తే గ్రేడ్-బి, 7 కంటే తక్కువ వస్తే గ్రేడ్ -సీ నమోదు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా గణితంలో 4 చతుర్వేద ప్రక్రియలు రాత లెక్కలో చేయగలిగితే గ్రేడ్-ఎ, సగ మే చేస్తే గ్రేడ్-బి మిగతా వారికి గ్రేడ్-సి ఇస్తారు. ఇంగ్లీష్‌లో చదవడం , రాయడం వస్తే గ్రేడ్-ఎ, కొన్ని పదాలు మాత్రమే రాయగలిగితే గ్రేడ్-బి, అంతకు తక్కువగా ఉంటే సీ-గ్రేడ్‌ను కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన పరీక్ష ప్రశ్నపత్రాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష, విద్యా శాఖ కార్యాలయం నుంచి పంపించారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి
జిల్లా సైన్స్ అధికారి లక్ష్మీపతి l సైన్స్ ఉపాధ్యాయులకు ప్రాజెక్టుల తయారీపై అవగాహన
రామగిరి : విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికి తీయాలని జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి అన్నారు. 27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా మంగళవారం నల్లగొండలోని న్యూస్ పాఠశాలలో నల్లగొండ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని అన్ని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు ప్రాజెక్టుల తయారీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పరిశుభ్రత, హరిత మరియు ఆరోగ్యకరమైన దేశం కోసం శాస్త్ర సాంకేతిక నూతన ఆవిష్కరణలు అనే అంశంపై బాలల సైన్స్‌కాంగ్రెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉప అంశంగా 1.పర్యావరణ వ్యవస్థ సంబంధిత సేవలు, 2.ఆరోగ్యం, పారిశుధ్యం, 3.వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టి, 4.సమాజం, సంస్క్రతి, జీవనం, 5.సంప్రదాయక విజ్ఞాన వ్యవస్థలు తదితర వాటిపై ప్రాజెక్టులను రూపొందించాలన్నారు. పోటీల్లో 10-17 సంవత్సరాల మధ్య కలిగిన విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాధిక మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పాఠశాలలకు రూ.5వేల గ్రాంటును మంజూరు చేసినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో 161 పాఠశాలలు ఎంపికైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో 180 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...