ఖానాపురంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు


Sun,July 14, 2019 02:00 AM

ఖానాపురం : వ్యవసాయం, సంక్షేమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పెద్దపీట వేస్తున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఖానాపురంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ మండలంలో నాలుగు రోజుల్లో 10 వేల సభ్యత్వాలు పూర్తిచేయాలని కోరారు. సకాలంలో సభ్యత్వాలు నమోదు పూర్తి చేస్తే తన కోటా నుంచి మండల అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ రైతు పార్టీ అయినందున రైతులు పెద్దెత్తున సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా గెలిచిన ఎమ్మెల్యే కంటే నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చారని అన్నారు.

కార్యకర్తలకు అనునిత్యం వెన్నంటి ఉంటారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మెప్పించి, మాజీ మంత్రి హరీష్‌రావు సహకారంతో రూ.336 కోట్లతో పాకాల ప్రాజెక్టును సాధించిన ఘనత పెద్దికి దక్కిందని ఆయన కొనియాడారు. గోదావరి జలాల రాకతో పాకాల పూర్వవైభవం సంతరించుకోనుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఇకపై ఈ ప్రాంతానికి ప్రతి యేటా రెండుపంటలు ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ రైతును రాజును చేసేందుకు నడుం బిగించారని, దేశంలో మర్కెడా లేనివిధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి ఎకరానికి రూ.10 వేలు అందజేస్తున్నారని వివరించారు. అదేవిధంగా రైతు ఏదైనా కారణంతో మృతిచెందితే రైతు కుటుంబానికి రైతు బీమా కింద రూ.ఐదు లక్షలు ఇస్తున్నారని తెలిపారు. 24 గంటల విద్యుత్, ఎరువుల, విత్తనాలు సకాలంలో అందిస్తున్నారని పేర్కొనారు. రూ.80 వేల కోట్లు వెచ్చించి గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి గత నెల 21న జాతికి అంకితం చేసిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కేంద్రం సహకారం లేకున్నా రాష్ట్ర ఏర్పడిన 5 ఏళ్లలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టర్టీ ఊసే లేదని, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి నిధులు మంజూరు చేయలేదని తెలిపారు. రాష్ర్టానికి నరేంద్ర మోడీ న్రభుత్వం చేసిందేవి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు కావడంతో బీజేపీ అధికారంలోకి రావాలని అమిత్‌షా పగటి కలలు కంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాకుంటే తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...