జిగేల్..జిగేల్..


Fri,October 4, 2019 02:57 AM

-నర్సంపేటలో కొత్త వెలుగులు
-ఆరు ప్రధాన కూడళ్లలో సెంట్రల్ లైటింగ్
-రూ.8.16 కోట్లతో పనులు పూర్తి
-ఫలించిన ఎమ్మెల్యే పెద్ది కృషి
-నేడు ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి

నర్సంపేట, నమస్తే తెలంగాణ : అభివృద్ధిలో నర్సంపేట పట్టణం కొత్త పుంతలు తొక్కుతున్నది. మెట్రో నగరాలకు దీటుగా అన్ని హంగులతో ముస్తాబవుతున్నది. సీఎం కేసీఆర్ సంకల్పం, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి ఫలితంగా నర్సంపేట పట్టణం మోడల్ సిటీగా రూపు దిద్దుకుంటున్నది. నర్సంపేట పట్టణాన్ని ఆధునీకరించడంలో భాగంగా కమ్యూనిటీ భవనాలు, ఆడిటోరియం, ఉద్యానవనం, సెంట్రల్ ఎల్‌ఈడీ లైటింగ్, డివైడర్లు, గ్రిల్స్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, కూరగాయల మార్కెట్ లాంటి వసతులను కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొట్ట మొదటగా నర్సంపేట పట్టణంలో పూర్తయిన సెంట్రల్ ఎల్‌ఈడీ లైటింగ్, డివైడర్లను పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు వరంగల్ రోడ్డు జంక్షన్‌లో వరంగల్ రోడ్డు, నెక్కొండ రోడ్డు, అరవింద థియేటర్ ఎదురుగా మల్లంపల్లి రోడ్డు, జయలక్ష్మి సెంటర్ మహబూబాబాద్ రోడ్డు, పాకాల రోడ్డులో మంత్రి దయాకర్‌రావు ప్రారంభిస్తారు. రూ.8 కోట్ల 16 లక్షల వ్యయంతో 10 కిలో మీటర్లకు 6 కిలో మీటర్ల పొడవుతో సెంట్రల్ ఎల్‌ఈడీ లైటింగ్, డివైడర్ల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

నూతన టెక్నాలజీతో..
హైటెక్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ముందే నర్సంపేట పట్టణం మొత్తం ఎల్‌ఈడీ లైట్లు, విద్యుత్ దీపాల వెలుగులతో కాంతులు విరజిల్లనున్నాయి. సెంట్రల్ లైటింగ్స్ ప్రారంభం అనంతరం డివైడర్ల మధ్య పచ్చదనంతో కూడిన గడ్డి, వివిధ రకాల పూల మొక్కలతో అందంగా అలంకరించనున్నారు. దీంతో నర్సంపేట పట్టణం మొత్తం రాత్రి వేళలో ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు, పగటి వేలలో పచ్చదనం సంతరించుకోనుంది. ప్రారంభోత్సవంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ముండ్రాతి హరిత తదితరులు పాల్గొననున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...