బంజర వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


Sat,October 5, 2019 04:17 AM

దేవరుప్పుల, అక్టోబర్ 04 : రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని బంజర పెట్రోల్ పంపు వద్ద జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ నుంచి మహబూబాబాద్‌జిల్లా తొర్రూరులోని బంధువుల ఇంట్లో జరిగే ఓ వేడుకకు హాజరు కావడానికి కారులో జనగామ వీవర్స్ కాలనీకి చెందిన బోగ సోమనర్సయ్య (32) తన నలుగురు కుటుంబ సభ్యులతో బయలు దేరారు. ఈ క్రమంలో పెదమడూరు నుంచి జనగామకు దసరా పండుగకు కొత్తబట్టలు కొందామని మరో కారులో వర్రె మహేశ్ తన నలుగుగురు స్నేహితులతో బయలు దేరారు. కాగా జనగామ వైపు నుంచి వస్తున్న కారు బంజర పెట్రోల్ పంపు వద్దకు రాగానే పెట్రోల్ పంపు నుంచి యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలశాపూర్‌కు చెందిన జక్కుల రాములు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వర్రె మహేశ్ కారును వేగంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బోగ సోమనర్సయ్య వాహనంలో ముందు సీట్లో కూర్చున్న చింతకింది మణికుమార్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న బోగ సోమనర్సయ్య జనగామ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండో కారులో ప్రయాణిస్తున్న కొము కృష్ణ( 32) ముందు సీట్లో కూర్చోగా తీవ్ర గాయాలపాలై జనగామ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. కారు డ్రైవింగ్ చేస్తున్న వర్రె మహేశ్ ( 26) హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. సోమనర్సయ్య కారులో ప్రయాణిస్తూ తీవ్ర గాయాలపాలైన బిర్రు రమాదేవి, బోగ సుధీర్, బోగ ప్రమీలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన బోగ రోహిత్ జనగామ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా వర్రె మహేశ్ కారులో ప్రయాణిస్తున్న దండబోయిన ప్రశాంత్, కర్రె అశోక్, చెరుకు సందీప్‌కు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌కు తరలించారు.

పెదమడూరులో విషాదం
పెదమడూరులో శుక్రవారం ఏడో రోజే సద్దుల బతుకమ్మ పండుగ జరపడం ఆనవాయితీ. కాగా అదే రోజు గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. వర్రె మహేశ్ ఇటీవలే కారు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కిరాయికి నడుపుతున్నాడు. పండుగకని ఊరుకు వచ్చి మృత్యువాత పడ్డారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...