రహదారులు రక్తసిక్తం


Sat,October 5, 2019 04:19 AM

-వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
-కటాక్షపూర్ హైవేపై కారు, అంబులెన్స్ ఢీకొని నలుగురి మృతి

పరకాల/ఆత్మకూరు నమస్తే తెలంగాణ : ఆత్మకూరు మండల పరిధిలోని 353 జాతీయ రహదారి రక్తసిక్తమైంది. కారు, పోలీస్ అంబులెన్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరునెలల బాబు ఉన్నాడు. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసేంది. ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ఈ హృదయవిదారక ఘటన ఆత్మకూరు మండలం కటాక్షపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలోని మెడికల్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న బానోత్ సోనాల్ కుటుంబంతో కలిసి ఆత్మకూరు మీదుగా హన్మకొండ వైపునకు తన కారులో బయలుదేరారు. డ్రైవర్ చింత ప్రశాంత్ వాహనం నడుపుతుండగా సోనాల్ ముందుసీటులో, ఆయన భార్య బానోత్ రజిత ఆరునెలల కుమారుడిని ఎత్తుకుని కూర్చుంది. ఆమెతోపాటు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన దాసుపల్లి అశ్విన్, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన సాధనపల్లి హేమలత, గుండమల్ల జాన్ మొత్తం ఏడుగురు కారులో ఉన్నారు.

కారును నడుపుతున్న ప్రశాంత్‌కు ఎదురుగా మరో కారు రావడంతో దానిని తప్పించబోయాడు. ఆ కారుకు వెనుకటైరు భాగంగా తాకించి ముందుకు వెళ్తున్న క్రమంలో అటుగా వస్తున్న పోలీసు అంబులెన్స్‌ను ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఆరునెలల పసికందుతోసహా సోనాల్ (35), రజిత (32), అశ్విన్ (23) మృతిచెందారు. అదేవిధంగా కారు డ్రైవర్ ప్రశాంత్, హేమలత, గుండమల్ల జాన్, పోలీస్ అంబులెన్స్ డ్రైవర్ ఎండీ వజీర్‌అహ్మద్ గాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న జాతీయ రహదారి ఒక్కసారిగా రక్తసిక్తం కావడం, అందులో ఆరునెలల పసికందు ఉండడంతో క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. తల్లిఒడిలో ఉన్న పసికందు సీటుకింద పడి మృతిచెందిన తీరు చూపరులను కలచివేసింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం మార్చురీకి టాటాఏస్‌లో తరలించారు.

ముందున్న వాహనాన్ని తప్పించబోయి..
కారు నడుపుతున్న డ్రైవర్ చింత ప్రశాంత్.. ఎదురుగా హన్మకొండ నుంచి ములుగు వైపు వస్తున్న కారు జిగ్‌జాగ్‌గా రావడంతో ఆ కారును తప్పించబోయాడు. ఇక్కడే రెండు కార్లు ఢీకొనాల్సి ఉండగా ప్రశాంత్ చాకచక్యంగా వ్యవహరించగా ఆకారును వెనుకభాగంలో ఢీకొట్టి ముందుకు వెళ్లాడు. ఓ ప్రమాదం తప్పిందని భావించి ముందుకువెళ్తున్న క్రమంలో ఆ కారు వెనకాలే ఖైదీలను రిమాండ్ చేసి వస్తున్న పోలీస్ అంబులెన్స్ వాహనం ఉండగా.. ఆ వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. కారుసీట్లు రక్తంతో తడిచిపోయాయి. తలలకు తీవ్రగాయాలు కావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రుల పరిస్థితి విషమం..
కారు, పోలీస్ అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎంజీఎం వైద్యులు తెలిపారు. సోనాల్ కుటుంబ బంధువు గుండమల్ల జాన్ కోమాలోకి వెళ్లారు. కారు డ్రైవర్ ప్రశాంత్, పోలీస్ వాహన డ్రైవర్ వజీర్‌అహ్మద్ కాళ్లు విరిగాయి. అంతేకాకుండా కారులో ఉన్న హేమలత పరిస్థితి కూడా విషమంగా ఉందని వారు తెలిపారు.
కన్నీటి పర్యంతం..
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అది చూసిన వారు కన్నీటిపర్యంతమయ్యారు. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందడం, క్షతగాత్రులైన విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలతోపాటు రోడ్డుపై ప్రయాణించే వారు ఈ ప్రమాదాన్ని చూసి విలపించసాగారు. మృతుల్లో ఆరునెలల పసికందు ఉండడం, ఆమె తల్లిదండ్రులు ఒకేసారి మృతిచెందడం జీర్ణించుకోలేకపోయారు. ప్రమాదం జరిగిన తీరును చూసిన వారు కన్నీటిపర్యంతమవడం కనిపించింది.
హుటాహుటిన చేరుకున్న పోలీసులు..
కటాక్షపూర్ వద్ద జాతీయరహదారిపై జరిగిన ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పటేల్, డీసీపీ విజయ్‌సారథి, ఏసీపీ సురేశ్‌కుమార్, సీఐలు మహేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, ఎస్సై రాజ్యలక్ష్మి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించడంతోపాటు మృతదేహాలను వరంగల్ ఎంజీఎం దవాఖాన మార్చురీకి ప్రత్యేక వాహనంలో తరలించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...