అలుగుపోస్తున్న మాదన్నపేట పెద్ద చెరువు


Sun,October 20, 2019 04:14 AM

నర్సంపేట రూరల్, అక్టోబర్ 19 : నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో పలు వాగులు, వంకలు శనివారం పొంగి పోర్లాయి. మాధన్నపేట గ్రామ శివారులోని జిల్లాలోనే రెండవ అతిపెద్ద పురాత చెరువైనా మాదన్నపేట పెద్దచెరువు భారీ వర్షానికి జోరుగా మత్తడి పోస్తుంది. మాదన్నపేట పెద్ద చెరువు ఇప్పటికే పలు దఫాలుగా కురుస్తున్న వర్షాలకు మత్తడిపోయగా తాజాగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మరల చెరువు మత్తడి పోస్తుంది. 4ఫీట్ల ఎత్తుతో చెరువు మత్తడి పోసింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు నల్లబెల్లి మండలం రంగాయ్యచెరువు మత్తడిపోయగా ఆనీరంతా వచ్చి మాధన్నపేట చెరువులోకి చేరింది. దీంతో 4ఫీట్ల సామర్థ్యంతో మాదన్నపేట చెరువు మత్తడి పోస్తున్నది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈచెరువు నీరంతా వాగుల గుండా భారీ మొత్తంలో ప్రవహించి మాదన్నపేట పెద్ద కాల్వ పొడవు దాదాపు 5 కిలోమీటర్ల మేర వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో ఇటీవల రైతులు వేసిన వరి పంటలు పూర్తిగా నీటి మునిగాయి. మాదన్నపేట గ్రామ శివారు నర్సంపేట - నల్లబెల్లి ప్రధాన రహదారిలోని లోలెవల్ బ్రిడ్జిపై వరద నీరు 5 ఫీట్లకు పైగా ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు స్తంభించి పోయాయి. మాదన్నపేట, నాగుర్లపల్లి, దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, భోజ్యనాయక్‌తండా ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొందరు పర్శనాయక్‌తండా మీదుగా మహేశ్వరానికి చేరుకుని నర్సంపేటకు తిరిగి వచ్చారు. అదేవిధంగా కమ్మపల్లిలోని దామెరచెరువు, గుండంచెరువు, దాసరిపల్లిలోని రోకరాంకుంట, శంభునిచెరువు, కమ్మునిచెరువు, లక్నెపల్లిలోని పెద్దచెరువు, మహేశ్వరంలోని పెద్ద చెరువులతోపాటు వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలు భారీ వర్షానికి మత్తళ్లు పోస్తున్నాయి. ఆయా మత్తడి నీటిలో మత్స్యకారులు చేపలు పట్టారు. శనివారం మాదన్నపేట చెరువు మత్తడిని టీఆర్‌ఎస్ నాయకులు ఆకుతోట కుమారస్వామి, మచ్చిక నర్సయ్యగౌడ్, రంజిత్, రాజేందర్, తడిగొప్పుల మల్లేష్ తదితరులు పరిశీలించారు. లోలెవల్ బ్రిడ్జి పరిసరాలను ఆర్డీవో రవి, తహసీల్దార్ విజయ్‌భాస్కర్, రెవెన్యూ అధికారులు, పోలీసులు పరిశీలించారు.

రైతు కష్టం వర్షార్పణం
రైతు కష్టం నీటిపాలైంది. భారీ వర్షానికి మక్కల రాశులు భారీగా తడిసిపోయాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని అన్ని గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన పంటలు నీటమునిగాయి. వరి, మిర్చి, పత్తి పంటలు వర్షానికి నీట మునిగి దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న, మిర్చి పంటలపై ఈ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చేతికి అందివచ్చే సమయంలో పడిన వర్షాలు రైతులను కోలుకోని దెబ్బతీశాయి. కొందరు రైతులు నర్సంపేట-మల్లంపల్లి ప్రధాన రహదారి, సర్వాపురం బైపాస్‌రోడ్డుపై మక్కలను ఆరబోశారు. కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అంతేకాకుండా అర్ధరాత్రి నెలకొన్న వరద ఉధృతిలో మక్కల రాశులు కొట్టుకపోయాయి. కళ్లముందే పంటంతా వరదలో కొట్టుకుపోతుంటే రైతులు బోరునవిలపించారు. డివిజన్‌లోని ఖానాపురం మండలం చిలుకమ్మతండాకు చెందిన బానోతు బాలాజీ 4 ట్రాక్టర్ల మక్కలు, బానోతు కిషన్ 4 ట్రాక్టర్లు, మూడు చెక్కలపల్లికి చెందిన ఇస్లావత్ ధర్మా 6 ట్రాక్టర్లు, నూనావత్ వీరన్న 6 ట్రాక్టర్లు, భోజ్యనాయక్‌తండాకు చెందిన అజ్మీర మేఘు 3 ట్రాక్టర్లు, దారావత్ రాజు 2 ట్రాక్టర్లు, సూర్యాపేటతండాకు చెందిన బానోతు భద్రమ్మ 2 ట్రాక్టర్లు, అక్కల్‌చెడతండాకు చెందిన గాదె సూరయ్య 2 ట్రాక్టర్లు, బానోతు భద్రమ్మ 4 ట్రాక్టర్లు, మర్రినర్సయ్యపల్లికి చెందిన బానోతు చందూలాల్ 2 ట్రాక్టర్ల మక్కలు వరదలో కొట్టుకుపోయాయి.

ప్రభుత్వం ఆదుకుంటుంది : ఆర్డీవో, జెడ్పీ ఫ్లోర్ లీడర్
వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జెడ్పీ ఫ్లోర్ లీడర్, నల్లబెల్లి జడ్పీటీసీ పెద్ది స్వప్న అన్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు మార్కెట్ బైపాస్‌రోడ్డులో పలువురు రైతులు మక్కలను ఆరబోశారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలువురి మక్కల రాశులు కొట్టుకపోయాయి. ఈమేరకు శనివారం జెడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న, నర్సంపేట ఆర్డీవో రవితో కలిసి వరదకు కొట్టుకుపోయిన మక్కల రాశులను పరిశీలించారు. బాధిత రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జెడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న మాట్లాడుతూ అకాల వర్షంతో మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వరదలో 500 క్వింటాళ్ల మక్కలు కొట్టుకపోవడం బాధాకరమన్నారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిలాకలెక్టర్ దృష్టికి ఈసమస్యను తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. రైతులు పొలం గట్లు, మార్కెట్‌లో ఆరబోసిన మక్కలు చాలా వరకు తడిసిపోయాయని అన్నారు. కార్యక్రమంలో ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, పాకాల నీటి సంఘం మాజీ డైరెక్టర్ మునిగాల వెంకట్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...