వర్షంతో రైతులకు తీవ్ర నష్టం


Sun,October 20, 2019 04:15 AM

చెన్నారావుపేట,అక్టోబర్19 : భారీ వర్షాలతో పంట పొలాల్లో నీరు నిలిచి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో గ్రామ శివారులోని పాఖాలవాగు, మున్నేరు, వట్టెవాగులు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేగాక గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. చెన్నారావుపేటలోని కోపాకుల, మగ్ధుంపురం ఊరచెరువుతో పాటు గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి. వరద నీటి ఉధృతి కారణంగా చెరువులు, కుంటలు, పాఖాల వాగు కింద ఉన్న వరి పంటలు నీట మునిగాయి. ఎల్లాయగూడెం, పదహారుచింతల్‌తండా, అక్కల్‌చెడ, పాపయ్యపేట, ఖాదర్‌పేట, సూర్యపేటతండా, గొల్లపల్లె, గొల్లభామ, లింగగిరి, తిమ్మరాయిన్‌పహాడ్ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంటలు నేలవాలాయి. పత్తి చేలల్లో నీళ్లు నిలిచాయి. సూర్యపేటతండాలో ధరావతు భద్రుకు చెందిన పత్తి చేనులో పిడుగు పడడంతో మొక్కలు కాలిపోయాయి. పంటలు చేతికందే సమయానికి వర్షాలు నట్టేట ముంచుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుగ్గొండి : మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని రేఖంపల్లి, తిమ్మంపేట, మల్లంపల్లి, వెంకటాపురం, దుగ్గొండి, చాపలబండ. గిర్నిబావి,మధిర, రంగాపురం గ్రామాల్లో మూడు గంటల పాటు కురిసిన వర్షానికి పత్తి, మొక్కజొన్న, పసుపు, వరి, అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు వర్షానికి తడిచిపోయాయి. తిమ్మంపేట గ్రామంతో పాటు పలు గ్రామాల్లో మిర్చి పంటలో ఇసుక మేటలు వేసి నీరు నిలిచింది. తిమ్మంపేట గుండం చెరువు, వెంకటాపురం, దుగ్గొండి గ్రామాల ఊర చెరువులతో పాటు అన్ని గ్రామాల్లోన్ని చెరువులు, కుంటలు పూర్తిగ నిండి మత్తడి పోస్తున్నాయి. వర్షంతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం అధికారులచే సర్వే చేయించి పూర్తి గా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఖానాపురం : మండలంలో కురిసిన భారీ వర్షం రైతులకు అపారనష్టం కలిగించింది .మండలకేంద్రం శివారులో తుంగబంధం కాలువ, పాకాల వాగు ఉధృతంగా ప్రవహించడంతో సమీపంలోని వరి పొలాలన్నీ నీటమునిగాయి. అదేవిధంగా మండలకేంద్రంలోని టేకులతండాలో రోడ్లన్నీ జలమయమై ఇళ్లలోకి నీరుచేరింది. ఖానాపురం, బుధరావుపేట,అ శోక్‌నగర్ గ్రామాల్లో రైతులు ఆరబోసుకున్న మక్కలన్నీ తడిసిపోయాయి.

రైతులకు అందుబాటులో వేరశనగ విత్తనాలు : ఏవో
చెన్నారావుపేట : రైతులకు సబ్సిడీపై అందుబాటులో వేరుశనగ విత్తనాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి కర్పూరపు అనిల్‌కుమార్ శనివారం తెలిపారు. 30కిలోల వేరుశనగ బస్తాకు సబ్సిడీతో రూ. 1500 చెల్లించాలన్నారు. కావాల్సిన రైతులు పట్టాపాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి
దుగ్గొండి : సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడిగా ఓడేటి తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పక్షం సర్పంచ్‌ల సమావేశంలో మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన సర్పంచ్ ఓడేటి తిరుపతిరెడ్డిని సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడిగా సర్పంచ్‌లంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా నాచినపల్లి సర్పంచ్ పెండ్యాల మమత, ఉపాధ్యక్షులుగా రంగాపురం సర్పంచ్ కొండం రమాదేవి ్డ, తొట్ల నీలవేణి , కోశాధికారిగా మర్రిపల్లి సర్పంచ్ ఇట్టబోయిన స్వామినిఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోకల శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రల్ల బాబు, లంకా మురళీ, అశోక్‌కుమార్, అనుముల రాజిరెడ్డి, రామ్మూర్తి, ఎంపీటీసీ కుమారస్వామి, సర్పంచ్‌లు సమతరాజు, రాజేశ్వర్‌రావు, సునీత పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...