పల్లెపల్లెలో... ప్రగతి పరుగులు


Mon,September 16, 2019 11:16 PM

-11వ రోజుకు చేరిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
-అభివృద్ధే లక్ష్యంగా కదులుతున్న సబ్బండవర్ణాలు
-చురుగ్గా పారిశుధ్యం, హరితహారం పనులు
-గ్రామాల్లో కలియదిరుగుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
-సమస్యల పరిష్కారంపై ఊరూరా ప్రణాళికలు
-నిధుల సద్వినియోగంపై అంచనాలు
-స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్న ప్రజలు
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జిల్లా వ్యాప్తంగా 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉత్సాహంగా కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. సోమవారం ఊరూరా శ్రమదానాలు చేసి, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. పలు గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పారిశుధ్యం, రోడ్ల మరమ్మతు పనులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అభివృద్ధి పనులతో పాటు పారిశుధ్యం, హరితహారం, మౌలికవసతులు కల్పనతో పల్లెల్లో ప్రగతి వికసించేలా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత వైపు పల్లెలు అడుగులు వేస్తున్నాయి. బీబీనగర్ మండలంలోని కొండమడుగు,బీబీనగర్ తదితర గ్రామాల్లో కొనసాగుతున్న పనులను ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతా పింగళ్‌రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలన్నారు. పోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామంలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ అనితారాంచంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 30రోజుల కార్యాచరణలో అందరినీ భాగస్వామ్యం చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆమె సూచించారు. వలింగొండ, గోపరాజ్‌పల్లి, గొల్లెపల్లి తదితర గ్రామాల్లో గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు పల్లె ప్రణాళిక పనులను పండుగలా నిర్వహించారు.

ప్రజల్లో స్పందన..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికపై ప్రజల్లో రోజురోజుకూ స్పందన పెరుగుతున్నది. ఆదివారం జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలు జరిగాయి. ఎక్కడ చూసినా వీధుల్లోని చెత్తా చెదారాన్ని, రోడ్లపై ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. గ్రామాల్లో పాత బావులు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేశారు. పాత బోరుబావులను పూడ్చి వేశారు. ప్రభుత్వం చేపడుతున్న 30 రోజుల ప్రణాళిక పల్లె పల్లెనా పండుగలా కొనసాగుతున్నది. ఆదివారం 10వ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి వాడలన్నీ కలియదిరిగారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులు చేపట్టి.. రోడ్లకు మరమ్మతులు చేశారు.

ఆలేరు నియోజకవర్గంలో..
30 రోజుల ప్రణాళికలో భాగంగా జరుగుతున్న కార్యాచరణ ప్రణాళిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట మండలంలోని ఆయా గ్రామాల్లో పాడుబడిన బావులు, పాత ఇండ్లు, గోడలను కూల్చివేశారు. రోడ్డుకు ఇరువైపులా మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించారు. నిధులను సక్రమంగా వినియోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని తీర్మానించారు. యాదగిరిగుట్ట మండలంలో జరిగిన పురోగతి పై డీపీవో వనం జగదీశ్వర్ పాల్గొని సమీక్ష జరిపారు. ఆయా గ్రామాల్లో గుర్తించిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పాడుబడ్డ బావులను గుర్తించి వెంటనే పూడ్చి వేయాలని ఆయన సూచించారు. నిరుపయోగంగా ఉన్న ఇండ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి కూల్చి వేయాలని తెలిపారు. రాజాపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు కొనసాగాయి. రోడ్లకు ఇరువైపుల పేరుకుపోయిన చెత్త్త, పిచ్చి మొక్కలను తొలగించారు. పలు గ్రామాల్లో మొక్కలను నాటి నీళ్లు పోశారు. తుర్కపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్య పనులు కొనసాగాయి. గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నెలకొన్న చెత్తను తొలగించారు. బొమ్మలరామారం మండలంలోని ఆయా గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ అమలును అందరి సహకారంతో పక్కాగా చేయాలని అధికారులు సూచించారు. ప్రధాన రోడ్లు, ప్రభుత్వ భవనాల సమీపంలో పారిశుధ్య పనులు నిర్వర్తించారు. శిథిలావస్థలోని ఇండ్ల యజమానులకు నోటీసులు అందజేసి వారి కోరిక మేరకు జేసీబీల సాయంతో తొలగించారు. గ్రామాల్లో జరుగుతున్న పనులను ఎంపీడీవో సరిత పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచనలు చేశారు. గ్రామ పరిశుభ్రతలో అందరిని భాగస్వాములను చేయాలని తెలిపారు. ఆత్మకూరు(ఎం) మండలంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో పిచ్చి మొక్కల తొలగింపు, వీధులను శుభ్రపర్చడం, ప్రధాన వీధుల వెంట మొలకెత్తిన గడ్డి తొలగింపు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూల్చివేయడంతో పాటు పాతబావులను పూడ్చివేశారు. ఆత్మకూరు(ఎం)లో జరుగుతున్న ప్రణాళిక కార్యాచరణపై జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధిగమించాలని అధికారులకు సూచించారు. ఆలేరు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, పాతగోడలు, పాత బోరుబావులను కూల్చివేత పనులు చేపట్టారు. మోటకొండూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్ల యాజమానులకు నోటీసులు అందజేశారు.

పండుగ వాతావరణంలో గ్రామ ప్రణాళిక..
చౌటుప్పల్ డివిజన్ వ్యాప్తంగా గ్రామ ప్రణాళిక పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక అన్ని మండలాల్లో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తున్నారు. చౌటుప్పల్‌లో గ్రామ ప్రణాళిక యుద్ధప్రాతిపాదికన కొనసాగుతుంది. అన్ని గ్రామాల్లో గ్రామప్రణాళికలో గుర్తించిన పనులను మెరుపువేగంతో చేపడతున్నారు. గ్రామ ప్రణాళికలో భాగంగా సోమవారం అన్ని గ్రామాల్లో పేరుకుపోయిన పిచ్చి, కంప చెట్లను తొలగించారు. శిథిలావస్థలోని భవనాలను కూల్చివేశారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని గ్రామ ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యమయ్యే విధంగా కృషి చేస్తున్నారు. సంస్థాన్‌నారాయణపురం మండల వ్యాప్తంగా గ్రామ ప్రణాళికలో భాగంగా గుర్తించిన పనులను పూర్తిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ ప్రణాళికలో ఎంపీడీవో జలేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రోడ్లకు ఇరువైపుల, ఇళ్ల మధ్యపేరుకు పోయిన కంప చెట్లను తొలగించారు. మోరీలను శుభ్రం చేయించారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరిన భవంతులను తొలగించారు. అన్ని గ్రామాల్లో ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ ప్రణాళికలో పాల్గొన్నారు. రామన్నపేట మండల వ్యాప్తంగా గ్రామప్రణాళికలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. ఇండ్లు, కార్యాలయాల సముదాయాల్లో పేరుకుపోయిన పిచ్చి, కంప చెట్లను తొలగించాలన్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు.మోత్కూరు మండల వ్యాప్తంగా గ్రామప్రణాళికలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామాల్లో పేరుకుపోయిన పిచ్చి చెట్లను తొలగించారు. మోరీలను శుభ్రం చేయించారు. అడ్డగూడూరు మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులు చేపట్టారు. రోడ్ల వెంట మొలిచిన కంప, పిచ్చి చెట్లను తొలగించారు. ఇండ్ల మధ్యన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...