ప్రతిష్టాత్మకంగా గ్రామాల అభివృద్ధి


Fri,September 20, 2019 11:50 PM

-యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో డబుల్‌బెడ్ రూం ఇండ్లకు భూమి పూజ
-పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి , కలెక్టర్ అనితారామచంద్రన్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రతిఒక్కరూ ఛాలెంజింగ్‌గా తీసుకొని ప్రతిష్టాత్మకంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లకు భూమి పూజ చేశారు. అనంతరం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ మనందరికీ ఆదర్శమని, ఆయన ఏ పనినైనా ఛాలెంజింగ్‌గా తీసుకొని పూర్తి చేస్తారని చెప్పారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రూపంలో ఆలేరుకు మంచి ఎమ్మెల్యే దొరికిందన్నారు. నిత్యం నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ నిధులు మంజూరు చేయించుకుంటున్నారని. ఆలేరుకు అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే తనకు సోదరిలాంటిదని.. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిలో తానూ పాలుపంచుకుంటానని హామీ ఇచ్చారు. మూసాయిపేట గ్రామానికి రూ.39 లక్షలు మంజూరయ్యాయని, ఇప్పటికే రూ.5 లక్షలు మంజూరు చేశామన్నారు గతంలో మంచినీటి సరఫరాకు పంచాయతీ నిధులు ఖర్చు చేసేవారని.. ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టవద్దని తెలిపారు. గ్రామ ప్రణాళికలో భాగంగా మాసాయిపేట గ్రామాన్ని సందర్శించేందుకు తాను ఎంచుకున్నానని, జిల్లాకో గ్రామం తిరుగుతున్నానని తెలిపారు.

గ్రామ ప్రణాళికలో భాగంగా గ్రామాలను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని సూచించారు. అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక పనులు చాలా బాగా అమలవుతున్నాయని తెలిపారు. గతంలో భూగర్భ జలాలు అడుగంటి బోరు నీళ్లు తాగితే రోగాల బారినపడి అలమటించాల్సి వచ్చేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్‌భగీరథతో మంచినీటి గోస తీరిందన్నారు. మరో మూడు రోజుల్లో దేవాదుల నుంచి గుండాలకు సాగు జలాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నవాబుపేట రిజర్వాయరు వద్ద గుండాలకు వచ్చే నదీ జలాలను విడుదల చేస్తామని చెప్పారు. ఇక్కడి ప్రజలకు సాగు జలాలు లేక అల్లాడిపోతున్నారని చెప్పారు. నవాబుపేట రిజర్వాయర్ వద్ద నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆలేరుకు సాగు జలాలు వస్తున్నాయని చెప్పారు. ఇవే కాకుండా ఇప్పటికే మిషన్‌భగీరథ ద్వారా గోదావరి నీళ్లతో తీసుకొచ్చి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాలు చేపట్టిన ఎస్‌ఆర్‌ఎస్పీ 50 ఏండ్ల నుంచి తవ్వుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. కానీ రైతున్నలకు సాగునీటినందించేందుకు సీఎం కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేశారని తెలిపారు. మాట తప్పని.. మడమ తిప్పని నేతగా ప్రజల హృదయాల్లో సీఎం కేసీఆర్ గూడుకుట్టుకున్నారన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్.. ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్న మహాత్ముడని అన్నారు. అప్పట్లో రూ.200 వచ్చే పింఛన్‌తో వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడేవారని, ఇంట్లో అవమానాలు ఎదుర్కోవల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం రూ.2 వేల పింఛన్‌తో వారి గౌరవం పెరిగిందన్నారు. జిల్లాకు ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పంచాయతీలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. గ్రామాలాభివృద్ధి కోసం సర్పంచ్‌లకు పవర్స్ ఇచ్చామని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు అన్ని గ్రామ శాఖల అధికారులు పర్యవేక్షణలో పనిచేసేలా సీఎం కేసీఆర్ నూతన పంచాయతీ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. గ్రామ సభలో తీర్మానం చేసిన ప్రతి పని పక్కగా చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలన్నారు. హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే కార్యదర్శులతోపాటు సర్పంచ్‌లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. గతంలో స్వీపర్లకు కేవలం 500 నుంచి 2 వేలు చెల్లించేవారిని, నేడు సీఎం ఏకంగా రూ.8500 చెల్లిస్తున్నారని తెలిపారు.

ప్రణాళిక పనులు పురోగతిలో ఉన్నాయి..
జిల్లాలో 1263 కో-ఆప్షన్ సభ్యులు, 2670 స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నారని, ఇందులో 50 శాతం మహిళలను భాగస్వాములు చేశామని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. యాదగిరిగుట్ట మండలంలోని మసాయిపేట గ్రామంలో నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఆమె పాల్గొని జిల్లాలో గత 14 రోజులుగా జరిగిన పనుల పురోగతిపై, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నివేదించారు. గత 5వ తేదీ నుంచి ప్రారంభమైన కార్యాచరణలో రెండురోజులు గ్రామాలను పర్యటించి గ్రామాల్లో సమస్యలు, పాడుబడ్డబావులు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించామని చెప్పారు. మొత్తం 421 గ్రామాల్లో 239 గ్రామాల్లో డంపింగ్ యార్డులను గుర్తించామని తెలిపారు. 53 గ్రామ పంచాయతీల్లో సమస్యలు గుర్తించాల్సి ఉందన్నారు. 44 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదని, 231 గ్రామ పంచాయతీల్లో శ్మశానవాటిక ఉండగా మిగతా గ్రామాల్లో స్థలం గుర్తించామని చెప్పారు. జిల్లాలో మొత్తం 6300 మంది ప్రజలు శ్రమదానంలో పాల్గొన్నారని తెలిపారు. పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని, గ్రామాల్లో ప్రజలు, మహిళా సంఘాలు స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొంటున్నారని వివరించారు. ప్రతి నెల శుక్రవారం శ్రమదానం కార్యక్రమం చేసేందుకు సన్నాహాలు చేశామని చెప్పారు. ప్రతి ఇంటికి చెత్తకుండీలు అందజేయనున్నామని తెలిపారు. జిల్లాలో హరితహారంలో భాగంగా 2 కోట్లు 35 లక్ష మొక్కలు నాటాలని టార్గెట్ ఇచ్చామని, ఆ టార్గెట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

గ్రామాలకు నిధుల కేటాయింపు..
ఉపాధ్యాయుడిగా నేను పనిచేసిన గ్రామానికే ఎమ్మెల్సీగా రావడం చాలా గర్వంగా ఉందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. 1950-60 ప్రాంతంలో మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పల్లెలు ప్రగతిబాట పట్టాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి దాతల సాకారం అవసరమని చెప్పిన ఆయన దాతలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన గ్రామాలను తన నిధులు వేచించి అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు.

ఖాళీలను భర్తీ చేయాలి..
పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మాసాయిపేట గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని జిల్లాలో జరు గుతున్న ప్రణాళిక వివరాలను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వివరించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా జిల్లాలో పలు గ్రామాలను నీటి సమస్య తీరుతుందని తెలిపిన ఆయన ఎత్తైన గ్రామాల్లో నీటి పంపింగ్ జరుగడంలేదని, వెంటనే మరిన్నీ ట్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రికి వివరించారు. అందుకు కావాల్సిన ట్యాంకులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనురాధాబీరయ్య, మాసాయిపేట సర్పంచ్ వంటేరు సువర్ణ, మాసాయిపేట ఎంపీటీసీ ననబోలు ప్రసన్నాశ్రీనివాస్‌రెడ్డి, మాసాయిపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు రవివర్ధన్, జిల్లా అధికారులు జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీఎఫ్‌వో వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా అధికారులు, ఆలేరు నియోజకవర్గం ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...