బ్రిటిష్ స్వభావం!


Sat,April 13, 2019 12:27 AM

వందేండ్ల కిందటి ఘోర కృత్యానికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ చెప్పమని అడుగడం అవసరమా? చరిత్రలో ఎంత మంది రాజులు పరిపాలించలేదు, ఎన్ని దాడులు జరుగనూ లేదు. అంద రూ వచ్చి క్షమాపణలు చెబుతారా అనే వాదనలు కొందరు చేస్తుంటారు. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశాంగ మంత్రి ఒకరు వెల్లడించిన అభిప్రాయం కూడా గమనార్హమైనది. భారత్‌తో మా ఆధునిక సంబంధం ఇరుపక్షాల శక్తులను కూడగట్టడానికి భవిష్యత్తుపై కేంద్రీకరించినది. అయితే ఇరుదేశాల భవిష్యత్తు కొంత గతం పునాదిగా కూడా ఏర్పడినది అని పేర్కొన్నారు. కానీ భారత్‌తో భవిష్యత్ సంబంధాలను నిర్మించుకోవాలనుకుంటున్న బ్రిటన్ గత ఘోరాలకు క్షమాపణ చెప్పడం కనీస సంస్కారం.

బ్రిటిష్ సామ్రాజ్యవాద క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిన జలియన్‌వాలా బాగ్ ఊచకోత జరిగి వందేండ్లయిన సందర్భంగా, ఈ ఘోర కృత్యానికి బ్రిటన్ క్షమాపణ చెప్పాలన్న వాదన మరోసారి ముందుకువచ్చింది. దీంతో బ్రిటిష్ ప్రధాని థెరీసా మే మొక్కుబడిగా విచారం వ్యక్తం చేశారు. జరిగిన దానికి, కలిగించిన బాధకు మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం అని ఆమె అన్నారు. ఈ నిర్వికారమైన వ్యాఖ్యలో నిరాయుధులపై మిషిన్ గన్‌లతో కాల్పులు జరిపి కనీసం వేయి మం దిని ఊచకోత కోసిన దౌష్ట్యానికి ఇసుమంత పశ్చాత్తాపం లేదు. బ్రిటిష్ మంత్రి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ ఇట్లా ఎన్నింటికని క్షమాపణ చెప్పుకుంటూ పోవాలన్నారు. ప్రజాస్వామిక విలువల గురించి ప్రపంచానికి ఎన్ని నీతులు చెప్పినప్పటికీ, అప్పుడైనా ఇప్పుడైనా తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలను కాపాడుకోవడమే బ్రిటిష్ ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఎంత దమననీతినైనా ప్రయోగిస్తుంది. ఇప్పటికీ నాటో దళాలలో భాగంగా అమెరికాతో కలిసి బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న దాడులు జలియన్‌వాలా బాగ్ ఊచకోతకు తక్కువేమీ కాదు. స్వాతంత్య్రోద్యమం తెచ్చిన ఒత్తిడి మూలంగా డయ్యర్‌పై కొన్ని శాఖాపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, బ్రిటిష్ పాలకవర్గం దృష్టిలో అత డు కర్తవ్యపరాయణుడే.

ఈ ఊచకోత జరిపిన బ్రిటిష్ సైన్యాధికారి రెజినాల్డ్ డయ్యర్ పచ్చి శ్వేతజాత్యహంకారి. ఊచకోత జరిపిన మరుసటి రోజు భారతీయులను హెచ్చరిస్తూ చేసిన ప్రకటన, బ్రిటిష్ యువతిపై దాడి జరిగిన వీధిలో ప్రజలు (నడువకుండా) పాకుతూ వెళ్ళాలని ఆదేశాలు జారీచేయడం ఆయనలోని ఉన్మాదాన్ని వెల్లడిస్తున్నది. తెల్లవాళ్ళపై దాడులు జరిగాయనే కారణాన్ని బ్రిటిషర్లు చూపుతున్నప్పటికీ, ఆ దాడులకు కారణం కూడా అంతకుముందు ప్రభుత్వం జరిపిన కాల్పులే. రౌలట్ చట్టం మూలంగానే ప్రజలలో నిరసన పెల్లుబికింది. జలియన్‌వాలా బాగ్ అమానుష చర్య డయ్యర్‌ను జీవితమంతా వెంటాడింది. అయి నా ఆయనలో అణువంత కూడా పశ్చాత్తాపం లేదు. మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా తన చర్యను సమర్థించుకున్న హీనచరితుడు రెజినాల్డ్ డయ్యర్. పైకి ఎంతో సంస్కారపూరితంగా కనిపించే భారతదేశంలోని బ్రిటిష్ సమాజం బహిరంగంగా లోపాయికారిగా డయ్యర్ క్రూరత్వానికి బాసటగా నిలిచింది. అతడి కోసం చందాలు వసూలు చేయడం, ఖడ్గాన్ని బహూకరించి సన్మానించడం వారి ఆధిపత్య, క్రూర మనస్తత్వానికి సూచికలు. అప్పటివరకు ఏదో రూపంలో బ్రిటి ష్ పాలనతో మమేకమైన భారతీయ శిష్టవర్గం కూడా ఈ దాడి తర్వాత కొంతదూరం జరుగక తప్పలేదు. జలియన్‌వాలా బాగ్ ఊచకోతకు పథకం వేసింది, ఆ తర్వాత సమర్థించింది పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న మైకెల్ ఓ డ్వయర్. అతడిని ఉధమ్‌సింగ్ అనే పంజాబ్ యువకుడు లండన్‌లో కాపుకాసి కాల్చిచంపాడు. జలియన్‌బాగ్ ఊచకోత పంజాబీయుల స్వాభిమానాన్ని ఎంతగా దెబ్బతీసిందో ఈ ప్రతీకార హత్య ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఊచకోత నేపథ్యం కూడా గమనించదగినది. అంతర్జాతీయ పరిస్థితులు, భారతదేశ పరిస్థితులు బ్రిటిష్ సామ్రాజ్యవా దం భయపడే పరిస్థితులను సృష్టించాయి. అనేక ఉద్యమాలు వెల్లువెత్తుతున్న దశ ఆ తర్వాత 19 40 దశకం వరకు కనిపించింది. అయినా జలియన్‌వాలా బాగ్ ఉదంతం తర్వాత గాంధీ నాయకత్వం బలపడటం ఆశ్చర్యకరమే. అప్పటికే 1915లో మితవాద నాయకుడు గోఖలే కోరికపై భారత్ చేరుకున్న గాంధీ క్రమంగా కాంగ్రెస్‌కు, స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించారు.

వందేండ్ల కిందటి ఘోర కృత్యానికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ చెప్పమని అడుగడం అవసరమా? చరిత్రలో ఎంత మంది రాజులు పరిపాలించలేదు, ఎన్ని దాడులు జరుగనూ లేదు. అంద రూ వచ్చి క్షమాపణలు చెబుతారా అనే వాదనలు కొందరు చేస్తుంటారు. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశాంగ మంత్రి ఒకరు వెల్లడించిన అభిప్రాయం కూడా గమనార్హమైనది. భారత్‌తో మా ఆధునిక సంబంధం ఇరుపక్షాల శక్తులను కూడగట్టడానికి భవిష్యత్తుపై కేంద్రీకరించినది. అయితే ఇరుదేశాల భవిష్యత్తు కొంత గతం పునాదిగా కూడా ఏర్పడినది అని పేర్కొన్నారు. కానీ భారత్‌తో భవిష్యత్ సంబంధాలను నిర్మించుకోవాలనుకుంటున్న బ్రిటన్ గత ఘోరాలకు క్షమాపణ చెప్పడం కనీస సంస్కారం. వర్తమానంలో ప్రాధాన్యం ఉన్నప్పుడే చరిత్రకు సంబంధించిన అంశాలు చర్చనీయాంశాలు అవుతాయి. భారత దేశంలో పాశ్చాత్య ఆధిపత్యం ఇంకా ఎన్నో రూపాలలో కొనసాగుతున్న నేపథ్యమే జలియన్‌వాలా బాగ్ ఘోరకృత్యానికి క్షమాపణలు చెప్పాలన్న వాదనను బలోపేతం చేసింది. ఇదేరీతిలో జలియన్‌వాలా బాగ్ ఘోరానికి బ్రిటన్ క్షమాపణ చెప్పాలని కోరుతున్న వారు, వర్తమానంలో పాశ్చాత్య రాజకీయ- ఆర్థిక ప్రాబల్యం నుంచి బయటపడటం అంతకన్నా ముఖ్యమని, మనం కోరుకోవలిసింది అదేనని గ్రహించాలె. సామ్రాజ్యవాదం కొత్త రూపాల్లో ముంచెత్తుతున్నప్పుడు, అవి మన బతుకులను శాసిస్తున్నప్పుడు, మనం ఇంకా జలియన్‌వాలాబాగ్‌కు క్షమాపణల దగ్గరనే ఆగిపోకూడదు. అది జలియన్‌వాలా బాగ్ పోరాట స్ఫూర్తికి, స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలకు విరుద్ధం.

376
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles