పీఆర్ ఇప్పుడొక తక్షణ అవసరం

Sat,April 20, 2019 12:47 AM

సమాచారం అనేది ఒక అస్త్రంగా మారి ఎక్కువసార్లు విషప్రచారాలకు, కల్లోల వాతావరణానికి కారణం అవుతున్న కాలంలో దానికి విరుగుడు మంత్రం పీఆర్ అని గ్రహించడం, ఈ వృత్తిలో నాణ్యత పెంచే దిశగా చర్యలు తీసుకోవడం తక్షణావసరాలు.

PHOTO-RAMU
నాజేబులో చివరకు ఒక్క డాలరే మిగిలివుంటే దాన్ని ప్రజా సంబంధాల (పీఆర్) కోసం వెచ్చిస్తా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ చాలా ఏండ్ల కిందట చెప్పిన మాట ఇది. దీన్ని మన దగ్గర సీరియస్‌గా తీసుకున్నవాళ్ళు తక్కు వ. కంప్యూటర్లకు సంబంధించిన సంస్థలో పీఆర్ పాత్ర అంతేమి ఉంటుందబ్బా..అనుకున్నవాళ్ళూ వుంటారు. ఎంతో అనుభవం తో గేట్స్ లాంటి వ్యాపార దిగ్గజాలు చెప్పిన మాటను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, వ్యాపారవర్గాలు, కార్పొరేట్లు, వైద్య, విద్య తదిత ర సంస్థలు మాత్రమే కాకుండా ఒక స్థాయికి వచ్చిన ప్రతీ అధికారి, రాజకీయ నాయకుడు సైతం పీఆర్ నిపుణులను నియమించుకోక తప్పని పరిస్థితి వచ్చేసింది. బ్రిటన్‌కు చెందిన ఛార్టెడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ రిలేష న్స్ (సీఐపీఆర్) నిర్వహించిన వార్షిక సర్వేలో పీఆర్ సంస్థల వ్యాప్తి పెరుగడమే కాకుండా దీన్ని వృత్తిగా స్వీకరించిన వారి జీతాలూ పెరిగాయని తేలింది. దేశంలో పీఆర్ సంస్థల వ్యాపారం,ఆదాయం గణనీయంగా పెరు గుతున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీఆర్‌సీఏఐ) తాజా సర్వే తేల్చింది. పీఆర్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం (ఏప్రిల్ 21) సందర్భంగా సమాజంలో పెరిగిన పీఆర్ ఆవశ్యకతను, దానికి కారణమైన అంశాలను చెప్పుకోవడం సందర్భోచితం.

ఒకప్పుడు ప్రభుత్వాలు నామమాత్రమైన పీఆర్ వ్యవస్థతో తమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోయే ప్రచారాన్ని నిర్వహించేవి. సరళీకర ణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ తర్వాత పీఆర్ పాత్రను భారతీయ వ్యాపారవర్గాలు పెద్ద కార్పొరేట్ల నుంచి ఆకళింపు చేసుకుని సంస్థాగత ఏర్పాట్లు చేసుకోవడం భారతీయ పీఆర్ రంగంలో ఒక మలుపు. అయితే సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కి సామాజిక మాధ్యమాల వ్యాప్తి రోజురోజుకూ విస్తరించడం మరో మలుపు. ఈ క్రమంలో పీఆర్ రూపురేఖా విలాసాలు మారిపోయాయి. కొన్ని పత్రికా ప్రకటనలు రాసి రిపోర్టర్ల కు చేరవేసి, అది మర్నాడు ఫొటోతో సహా వచ్చేలా చేసి చేతులు దులుపుకునే కాలం పోయింది. పత్రికలు, ఛానళ్లు, వెబ్ పోర్టల్స్, యూట్యూబ్ ఛానెల్స్ గణనీయంగా పెరిగాయి. మీడియా ప్రపంచంలో పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా జర్నలిస్టుల సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగింది. సంస్థ పరువు ప్రతిష్టలు కాపాడటం, పేరు ప్రఖ్యాతులు పెంచడం వంటి మౌలిక విధులు నిర్వహించే క్రమంలో వినసొంపుగా మాట్లాడే ప్రతిభ, చక్కగా రాసే సామర్థ్యం, వేగంగా పనిచేసే గుణం, వినూత్న ఆలోచనలు చేసే లక్షణం, సృజనాత్మకత, నలుగురిని ఒప్పించే చతురతతో పాటు టెక్నాలజీ వాడకం ఈ వృత్తి నిపుణులకు అత్యావశ్యమైంది.
పీఆర్ వ్యవస్థ అవసరం మున్నెన్నడూలేనంతగా పెరుగడానికి కార ణం. అనూహ్యవేగంతో విస్తరిస్తున్న సోషల్ మీడియా, దాంతోపాటు పెచ్చరిల్లిన ఫేక్ న్యూస్ వంటి జాడ్యాలు. బుర్రలో అంకురం తొడిగే వెర్రి ఆలోచన వెలిమొన (ఫింగర్ టిప్)తో మొబైల్ కీ ప్యాడ్ మీద నాట్యంచేస్తే చాలు.. అది వందల వేల మస్తిష్కాలలోకి చొచ్చుకుపోయి మంచీ చెడులు ఆలోచించని బుర్రతక్కువ గ్రహీత (రిసీవర్)లతో ఒక విష ప్రచారానికి మూలమవుతుంది. ఒక్క ట్విటర్ పోస్టుతో ఎంత నష్టమైనా సృష్టించవచ్చ ని పీఆర్‌సీఏఐ అధ్యక్షుడు చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. కమ్యూనికేషన్ రంగంలో టెక్నాలజీ పిచ్చోడి చేతిలో రాయిలా మారి ఇలాంటి విధ్వంసకర పరిస్థితి ఏర్పడినందున సంస్థలకు, ప్రముఖులకు పీఆర్ నిపుణుల అవసరం పెరిగింది. ఇది ఈ రంగంలో ఉద్యోగాల సృష్టికి దారితీసింది.

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా (పీఆర్‌ఎస్‌ఏ) నిర్వచనం ప్రకారం.. సంస్థకు, ప్రజలకు పరస్పర ప్రయోజనం కలిగించేలా సహకరించేవే ప్రజా సంబంధాలు. ఇది ఒక వ్యూహాత్మక భావప్రసారణ, వినిమయ ప్రక్రియ. జీవితాలు క్లిష్టమై, మానవసంబంధాలు మృగ్యమవుతున్న ఈ కలికాలంలో పీఆర్ నిపుణులు చేయాల్సిన పనులు పెరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది సంక్షోభ నియంత్రణ. సంస్థలో ఒక సంక్షోభం తలెత్తగానే అగ్నికి ఆజ్యం పోసే అంతర్గత, బాహ్యశక్తుల నుంచి యాజమాన్యాన్ని కాపాడటం ఇప్పుడు పీఆర్ నిపుణుల కర్తవ్యంగా మారింది. వృత్తి ప్రాధాన్యాలపై సీఐపీఆర్ సర్వేలో భాగంగా అడిగిన ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన స్పందన వచ్చింది. గత ఏడాది సర్వేలో సోషల్ మీడియా రిలేషన్స్ విధి నిర్వహణలో ఒక ప్రాధాన్యంగా ఉండగా ఇప్పుడు సంక్షోభ నివారణ, నియంత్రణ ఒక ముఖ్యమైన పనిగా ఉందని పీఆర్ వృత్తి నిపుణులు చెప్పా రు. పుంఖానుపుంఖాలుగా సృష్టించబడుతున్న బిగ్ డేటాను విశ్లేషించి సంస్థకు అనుకూలంగా మలుచుకోవడం కూడా పీఆర్ నిపుణుల పని గా మారుతున్నది.

సుశిక్షితులైన పీఆర్ వృత్తి నిపుణుల అవసరం బాగా పెరుగగా, సప్లయ్ చైన్ ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. ప్రభుత్వాల చేతిలో వున్న సమాచార ప్రసార శాఖ చిక్కి శల్యమైపోతున్నది. వీటిలో నియామకాలపై దృష్టిపెట్టాలి. పబ్లిక్ రిలేషన్స్‌లో నాణ్యమైన శిక్షణ అందించడం ధ్యేయంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ (ఆస్కీ) పీఆర్ విభాగం ఇందుకు సంబంధించిన ఒక కార్యాచరణ ప్రణాళికతో కూడిన ప్రతిపాదన రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు సమర్పిస్తున్నది. పీఆర్‌లో ఇప్పటికే రెండు శిక్షణ తరగతులను ప్రకటించిన ఆస్కీ అంతర్జాతీయ నిపుణుల సహకారం, అమెరికాలోని విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ప్రత్యేక కోర్సులను ఆరంభించే పనిలో ఉన్నది.
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మాజీ జాతీయ ఛైర్మన్, పీఆర్ గురు గా పేరు గడించిన డాక్టర్ సీవీ నరసింహా రెడ్డి చెబుతున్నట్లు.. విద్య, సాహిత్యం, శిక్షణ, పరిశోధన, వృత్తి సంఘాలు ఈ ఐదూ ప్రజా సంబంధాలు పరిఢవిల్లడానికి కీలకం. సమాచారం అనేది ఒక అస్త్రంగా మారి ఎక్కువసార్లు విష ప్రచారాలకు, కల్లోల వాతావరణానికి కారణం అవుతున్న కాలంలో దానికి విరుగుడు మంత్రం పీఆర్ అని గ్రహించడం, ఈ వృత్తిలో నాణ్యత పెంచే దిశగా చర్యలు తీసుకోవడం తక్షణావసరాలు.
(వ్యాస రచయిత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఎడిటర్, మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్)
(రేపు జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవం)

364
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles