సమర్థపాలనా ప్రావీణ్యం

Sat,April 20, 2019 12:49 AM

రాజకీయ సుస్థిరత్వం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆరవ ఏడా దిలో అడుగుపెట్టుతున్న తరుణాన భూయాజమాన్య సంబంధ (రెవెన్యూ) కీలక సంస్కరణలకు కంకణధారణ చేయబోతున్నది. 250 ఏండ్ల కిందట వారెన్ హేస్టింగ్స్, కార్న్‌వాలీస్ వంటి బ్రిటిష్ పాలకులు భారత రైతు జన ప్రయోజనాలకు భంగకరంగా ప్రవేశపెట్టిన దుష్ట చట్టాల నుంచి, వాటి నీడల నుంచి విముక్తి కల్గించే విప్లవాత్మక ప్రయత్నం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో జరుగడం గర్వకారణం.తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయ సుస్థిరత్వం, పటిష్ట పాలన, పకడ్బందీ వ్యూహం ఫలితంగా అవినీతి నిర్మూలన చర్యలు విజయవంతమవుతాయని దృఢ విశ్వాసంతో చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ వికాసం, రైతుజన సంక్షేమం విషయాలలో వలె అవినీతి నిర్మూలనలోనూ తెలంగాణ ప్రభుత్వం మొత్తం దేశానికి ఆదర్శప్రాయం అవుతుందనడంలో సందేహం లేదు.

Prabhakar-Raoo
అంతర్గత ఎమర్జెన్సీ అనంతరం, 42 ఏండ్ల కిందట కేంద్రం లో అప్రతిష్టపాలైన పాత ప్రభుత్వం పతనమై ఎన్నికల ముందు, ఎన్నికలప్పుడు దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన కొత్త పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. పగ్గాలు చేపట్టిన నేతలు పాతవారే; కాని, నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. అంతకుముందు ఆరేండ్లు నడిచిన ప్రభుత్వం దేశ ప్రజలకు విపరీతమైన రోత పుట్టించింది. రోతకు, నిరసనల మోతకు, కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతిఘటనల చేతలకు ప్రధాన కారణం 1975 జూన్ 25వ తేదీన అప్పటి రాష్ట్రపతి ఆమోదముద్రతో వచ్చిన అంతర్గత ఎమర్జెన్సీ. ప్రాథమికహక్కులు, పౌరహక్కుల సంగతి దేవుడికెరుక-దేశ ప్రజలకు జీవించే హక్కు సైతం లేదని నాటి భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ సి.కె.దఫ్తరి వివరించారు. స్వాతంత్య్రానంతరం ముప్ఫై ఏండ్ల భారత రిపబ్లిక్‌లో మొదటిసారి ప్రజాస్వామ్యానికి ఘోర విపత్తు ఏర్పడిందని, ఇక ఆరవ లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం లేదని భారత ప్రజలు భయపడ్డారు. దేశానికి గ్రహచారం బాగాలేదని విదేశీ పరిశీలకులు సైతం భయపడ్డారు, వాపోయా రు. ఎమర్జెన్సీ అనంతర ఉద్రిక్త వాతావరణంలో ఆరవ లోక్‌సభ ఎన్నిక లు జరిగాయి.

ఇంటెలిజెన్స్ బ్యూరో అందించిన ఉప్పుతో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు, ఎన్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్, సి.బి.ఐ. అధికారులు ప్రత్యర్థుల మీద (వారి ఇండ్లు, కార్యాలయాల మీద) నడిరాత్రి దాడులు చేయడం, భయానక పరిస్థితి కల్పించడం వంటివి ఏవీ లేకుండానే ఆరవ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు సక్రమంగా జరుగలేదని, ఎన్నికల కమిషన్ తన విధులను సరిగ్గా నిర్వహించలేదని ఎవరూ అనలేదు. ఎన్నికల ప్రచారం సందర్భాన హైదరాబాద్ వచ్చిన ప్రముఖ సోషలిస్టు నాయకుడు అశోక్ మెహత ఓ బహిరంగసభలో ప్రసంగిస్తూ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రతిపక్ష ప్రభుత్వం, మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడడం ఖాయమని ప్రకటించారు. అశోక్ మెహతా జోస్యం నిజమైంది. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవం నినాదంతో ఉద్యమం నడిపి, ప్రతిపక్షాలను (ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నిటిని) ఏకం చేసి అవతరింపజేసిన జనతాపార్టీ అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రంలో మొరార్జీదేశాయి ప్రధానిగా ప్రభుత్వం ఏర్పా టు చేసింది. చౌధరి చరణ్‌సింగ్, బాబూ జగ్‌జీవన్‌రామ్ ఇద్దరు ఉపప్రధానులు. ఉప ప్రధానిగా చరణ్‌సింగ్ దేశ వ్యవహారాల శాఖను నిర్వహించారు.

ఇందిరాగాంధీ పట్ల వ్యతిరేకత ఒక్కటే ముఖ్యంగా ప్రతిపక్షాల కూటమికి (జనతాపార్టీకి) ప్రాతిపదిక. ఇతర విషయాలలో జనతా పార్టీ లో భిన్నాభిప్రాయాలు అనేకం. అందువల్లనే, పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు 1977 మార్చి నెలలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతాపార్టీ అంతర్గత కలహాల కారణంగా కొన్ని మాసాల్లోనే 1979 జూలైలో కుప్పకూలింది. దేశంలో చిన్నరాష్ర్టాల ఏర్పాటుకు అనుకూలం గా ఉన్న చరణ్‌సింగ్ ఉపప్రధానిగా దేశ వ్యవహారాల శాఖను చేపట్టడం తెలంగాణవాదులకు సంతోషం కల్గించింది; చరణ్‌సింగ్ రైతు సంక్షేమానికి, రైతుల హక్కులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ఈ మట్టి బిడ్డ, ఈ నేలనేత కావడం వల్ల దేశమంతట రైతులు హర్షంతో పులకితులయ్యారు. కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉప ప్రధానిగా, దేశ వ్యవహారాల శాఖామంత్రిగా చరణ్‌సింగ్ హైదరాబాద్ వచ్చారు. చాల రోజుల పిదప జై తెలంగాణ నినాదాలు ఇస్తూ చరణ్‌సింగ్‌కు హార్దిక స్వాగతం పలుకడానికి తెలంగాణ ఉద్యమకారులం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లాం; నినాదాల హోరులో చరణ్‌సింగ్‌కు ఒక వినతిపత్రం ఇచ్చాం వెంటనే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కోరుతూ. ఆలస్యంగా నయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చరణ్‌సింగ్ అన్నారు.

ఆయన అన్న ఆ ఒక్క మాట కొండంత బలం ఇచ్చింది. కేసీఆర్ అపూర్వ ఉద్యమ వ్యూహం, తపస్సు ఫలితంగా ముప్పయి ఐదేండ్ల తరువాత చరణ్‌సింగ్ మాట నిజమైంది-తెలంగాణ రాష్ట్రం అవతరించింది. తెలంగాణ రాష్ట్రం అవతరణ ఒక మహత్తర ఘటన. కేంద్రంలో జనతాపార్టీ ప్రభు త్వ పతనం, అనంతర రాజకీయ పరిణామాలలో జనతాపార్టీ విచ్ఛిత్తి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌కు అమిత మానసిక ఖేదం కల్గించింది. ఆ ఖేదంతో ఆయన కృంగిపోయాడు. బహు నాయకత్వం, పటిష్ట నాయకత్వం లేకపోవడం, జనతాపార్టీలో భాగస్వామ్యం గల పార్టీలన్నిటికి ఆమోదయోగ్యమైన ఉమ్మడి కార్యక్రమం రూపొందకపోవడం, సైద్ధాంతిక విభేదాలు, రాజకీయ అస్థిరత్వం జనతా పార్టీ విచ్ఛిత్తికి దారితీసిన, ఆ పార్టీల ప్రభుత్వాలు కేంద్రంలో, కొన్ని ఉత్తరభారత రాష్ర్టాల లో కూలిపోవడానికి కారణమైన ప్రధాన లోపాలు.

ఈ లోపాలకు అణుమాత్రమైనా ఆస్కారం లేకుండా గత ఐదేండ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అంతకుముందు పధ్నాలుగేండ్ల అసాధారణ ఉద్యమానికి కేసీ ఆర్ సమర్థవంతంగా నాయకత్వం వహించడం విశేషం. రాజకీయ సుస్థి రత్వం, పటిష్ట, విశిష్ట ప్రభుత్వ నాయకత్వం, ప్రభుత్వ సారథ్య ప్రావీ ణ్యం పుష్కలంగా ఉన్నందువల్లనే గత ఐదేండ్ల నూతన రాష్ట్రంలో, నూతన ప్రభుత్వం అటు ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను, ఇటు కోట్లాది ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే సంక్షేమ పధకాలను అద్భుతంగా అమలు జరిపింది, జరుపుతున్నది. సర్వతోముఖ అభ్యుదయానికి అత్యావశ్యకం రాజకీయ సుస్థిరత్వం, ప్రభుత్వ పటిష్టత.ఈ రెండూ కేసీఆర్ నేతృ త్వంలో నూతన తెలంగాణ రాష్ర్టానికి శైశవ దశలోనే సంతరించడం అదృ ష్టం. రాజకీయ అస్థిరత్వం కారణంగా చరణ్‌సింగ్ ముఖ్యమంత్రి అయి నా, ఉప ప్రధాని అయినా, కొంతకాలం ప్రధాని అయినా ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రైతుల ప్రయోజనాల పరిరక్షణకు గణనీయ చర్యలు తీసుకోలేకపోయారు. ఇంత కాలానికి (దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పిదప 72 ఏండ్లకు) తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ నాయకత్వంలో రైతుజన ప్రయోజన పరిరక్షణ ఒక ఉద్యమ స్వరూపంతో అత్యధిక ప్రాధాన్యం పొందడం చరిత్రాత్మక పరిణామం. రాజకీయ సుస్థిరత్వం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆరవ ఏడా దిలో అడుగుపెట్టుతున్న తరుణాన భూయాజమాన్య సంబంధ (రెవె న్యూ) కీలక సంస్కరణలకు కంకణధారణ చేయబోతున్నది. 250 ఏండ్ల కిందట వారెన్ హేస్టింగ్స్, కార్న్‌వాలీస్ వంటి బ్రిటిష్ పాలకులు భారత రైతు జన ప్రయోజనాలకు భంగకరంగా ప్రవేశపెట్టిన దుష్ట చట్టాల నుంచి, వాటి నీడల నుంచి విముక్తి కల్గించే విప్లవాత్మక ప్రయత్నం ఇప్పు డు తెలంగాణ ప్రభుత్వంతో జరుగడం గర్వకారణం.

చేతికి వచ్చిన అధికారంతో చరిత్ర నిర్మించే మహత్తర కృషి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఈ కృషిని హర్షించడం, అభినందించడం విజ్ఞుల విధి. మన ప్రభుత్వాల్లో, సమాజంలో స్వాతంత్య్రానంతరం విశృంఖల, విపరీత స్వరూపం ధరించిన అవినీతికి వ్యతిరేకంగా నినదించడంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానికి ముందు, 1935లో, బ్రిటిష్ పాలనలో, బ్రిటిష్ ఇండియాలోని కొన్ని రాష్ర్టాల్లో శాసనసభల ఎన్నికలు జరిగి భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) ప్రభుత్వాలు ఏర్పాటు కావడం గాంధీజీకి ఎంతమాత్రం ఇష్టం కాలేదు. అధికారం చేతికివస్తే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ వాదులు అవినీతిపరులు, లంచగొండులవుతారని గాంధీజీ భయపడ్డాడు. ఆయన భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి కూపాలై అప్రతిష్టపాలైనాయి. అవినీతి ప్రపంచమంతట ఉందని అంటూ ఈ దేశంలో అదొక సమ్యే కాదన్నట్లు ఇందిరాగాంధీ మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పధకాలకు చీడపురుగు వంటిది అవినీతి. అవినీతి కారణంగా అభివృద్ధి ఫలితాలు పేదలకు అందడం లేదు. రైతు సంక్షేమం, శ్రేయస్సు కోసం వివిధ చర్యల ద్వార కంకణం ధరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ శాఖలలో అవినీతి నిర్మూలనకు సంకల్పించడం సహజ పరిణామం. ఐదేండ్ల కిందట కేంద్రంలో మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు మోడీజీ అవినీతి నిర్మూలన గురించి గంభీరంగా మాట్లాడారు.

ఆయన అవినీతి నిర్మూలన ఈ ఐదేండ్లలో కేవలం మాటలకే పరిమితమైంది. ఢిల్లీలో, రక్షణమంత్రిత్వ శాఖలో రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఫైలు పత్రాలు బజారులోకి వచ్చాయంటే అవినీతి భయంకర స్వరూపం ధరించిందనుకోవాలె. కొరకడానికి తనకు పండ్లులేవని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న వారిపై కొరడా ఝళిపించే అధికారం తనకు లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్) వారంరోజుల కిందట సుప్రీంకోర్టులో తన గోడు విన్పించింది. ఎలక్షన్ కమిషన్ గోడు సుప్రీంకోర్టుకు ఆశ్చర్యం కల్గించి తీవ్రంగా వ్యాఖ్యానించింది. అవినీతిని (అది ఏ రూపంలో ఉన్నప్పటికి) నిర్మూలించాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్ ఈ గోడు విన్పించకపోయేది. నాడు ఎన్నికల సమయాన రాజకీయ పార్టీలను గడగడలాడించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టి.ఎన్.శేషన్‌కు (1990-96) ఉన్న అధికారాలే ఇప్పటి కమిషన్‌కు ఉన్నాయి-తగ్గలేదు. రాఫెల్ యుద్ధ విమానాలే ఉంటే బాల్‌కోట్‌పై తమ తడాఖా ఇంకా జోరుగా ఉండేదని చీఫ్ ఏర్‌మార్షల్ ధనోవా అన్నారు. రాఫెల్ విమానాల కొనుగోలులో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో ధనోవాకు తెలియదని కాదు! తెలిసినప్పటికీ ఆయన జరిగిన జాప్యానికి చింతించడం విచిత్రం. బయటి సంగతి ఏమైనా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయ సుస్థిరత్వం, పటిష్ట పాలన, పకడ్బందీ వ్యూహం ఫలితంగా అవినీతి నిర్మూలన చర్యలు విజయవంతమవుతాయని దృఢ విశ్వాసంతో చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ వికాసం, రైతుజన సంక్షేమం విషయాలలో వలె అవినీతి నిర్మూలనలోనూ తెలంగాణ ప్రభుత్వం మొత్తం దేశానికి ఆదర్శప్రాయం అవుతుందనడంలో సందేహం లేదు.

357
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles