సంస్కరిస్తేనే కాంగ్రెస్‌కు మనుగడ


Wed,June 12, 2019 01:10 AM

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా విఫలం కావడం, రాహుల్‌గాంధీ స్వయంగా అమేథీలో ఓడిపోవడం వల్ల సంక్షోభంలో పడిపోయింది. పార్టీ నాయకత్వం నుంచి వైదొలుగుతానని రాహు ల్ ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు ఆయ న వైదొలుగడానికి అంగీకరించడం లేదు. దీంతో స్తంభన ఏర్పడి మరింత అయోమయం నెలకొన్నది. బీజేపీతో సహా అన్ని పార్టీలలోనూ కుటుంబ రాజకీయాలున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీది మాత్రం కుటుంబ వ్యాపార సంస్థ మాదిరిగా గుర్తింపు పొందింది. ఐదవతరం నాయకత్వం పార్టీని నియంత్రిస్తున్నది. ఈ అంశాన్ని బీజేపీ ప్రభావవంతంగా ఉపయోగించుకున్నది. దేశ చరిత్ర, నెహ్రూ కుటుంబ పాత్ర గురించి తెలువని యువత రం బీజేపీ ప్రచారంతో ప్రభావితమైంది. నెహ్రూ కుటుంబసభ్యులు నాయకులుగా లేకుండా కాంగ్రెస్ పార్టీ మనగలదా అనేదే ఇప్పుడు వేధిస్తున్న సమస్య. పార్టీనంతా కలిసికట్టుగా నిలిపే శక్తి నెహ్రూ కుటుంబానికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక స్పష్టమైన సిద్ధాంతం, కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్ళలేక పోయిందనేది ఇప్పటికే చాలా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలంటే, సంస్థాగతంగా సంస్కరించుకొని తనకుతాను కొత్తరూపు సంతరించుకోవలసి ఉన్నది. కుటుంబ సంస్థగా కాకుండా, నెహ్రూ కుటుంబంతో నిమిత్తం లేని ప్రజాస్వామిక పార్టీగా రూపాంతరం చెందవలసి ఉన్నది. ఈ మార్పు ఎప్పుడో జరుగవలసింది. ఇందిరా గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు రావలిసింది. పార్టీలో కింది అంచెల వరకు అధికార వికేంద్రీకరణ జరుగవలసింది. కానీ నెహ్రూ కుటుంబ సభ్యుడి ఆధిపత్యంలో ఉండే ఏర్పాటుజరిగింది.


బీజేపీ చేతిలో వరుస పరాజయాల నుంచి బయటపడాలంటే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా సంస్కరించుకోవలసిన అవసరం ఉన్నది. రాహుల్‌గాంధీ నిష్క్రమించవచ్చు, లేదా పార్టీని ప్రజాస్వామిక సంస్థగా తీర్చిదిద్దనూ వచ్చు. పార్టీకి శస్త్ర చికిత్స చేయడం బాధతో కూడుకున్నదే. కానీ కాంగ్రెస్ పార్టీని సంస్కరించకపోతే, మనుగడ సాగించలేదు. అది దేశానికి ఎంతో నష్టదాయకం.


రాజీవ్‌గాంధీ మార్పులు చేయడానికి ఎప్పుడూ సిద్ధపడలేదు. 1990 దశకంలో నెహ్రూ కుటుంబానికి చెందని ఇద్దరు నాయకులు- పీవీ, సీతారాం కేసరి- పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. 1998 లో సోనియాగాంధీ ఆసక్తి చూపడంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం నాయకత్వంలోకి వెళ్ళింది. కనీసం ఈ దశలోనైనా ఆ ఒక్క కుటుంబంపై ఆధారపడకుండా, సమిష్టి నాయకత్వాన్ని నెలకొల్పి, దేశావ్యాప్తంగా రాష్ర్టాలలో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరుచాల్సింది. అదే జరిగితే, ఇవాళ హిందు మెజారిటీవాదం దాడికి విలవిలలాడేది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ కుటుంబ సంస్థగా కాకుండా ప్రజాస్వామిక పార్టీ గా మారవచ్చు. కార్యనిర్వాహక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో కుటుంబసభ్యులతో పాటు సీనియర్ నాయకులు అధికారాలు కలిగి ఉండాలె. దీంతో నెహ్రూ కుటుంబం పార్టీని ఆడించడం అనేది ఉండదు. ఒకవైపు కుటుంబ ప్రభావం ఉన్నప్పటికీ మరోవైపు సమిష్టి నాయకత్వం కూడా ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టమవుతుం ది. కుటుంబ పెత్తనం, భజన రాజకీయాలు నశిస్తాయి. ఎన్నికలలో గెలువలేని, పార్టీలో గౌరవం లేని పాత నాయకులను సీడబ్ల్యుసీ నుంచి తొలగించాలె. సీడబ్ల్యుసీకి ఒక్కో దశలో అధికారం మారుతూ వచ్చింది. నెహ్రూ హయాంలో బలమైన నాయకులు ఉండి, ప్రజాస్వామిక సంస్కృ తి కలిగి ఉన్నది. సీడబ్ల్యుసీ సభ్యులు నెహ్రూ సూచనలతో విభేదించే వారు కూడా. 1967 తర్వాత కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. 1971లో ఇం దిరా గాంధీ ఘన విజయంతో పార్టీలో కేంద్రీకరణ పెరిగిపోయింది. పీసీసీలు, ఏఐసీసీలు బలహీనపడ్డాయి. అధిష్ఠానం చెప్పిందే శాసనమైపోయింది. ఈ పరిస్థితి మారాలె. కాంగ్రెస్ పార్టీలో సమాఖ్య విధానం నెలకొల్పడం అవసరం.

స్వాతం త్య్రం వచ్చిన కొత్తలో పార్టీకి కింది నుంచి పైవరకు చక్కని అనుసంధానం ఉండేది. పీసీసీ స్థాయిలో ఇంకా కింది స్థాయిలో ఎన్నికలు జరిగేవి. అందువల్ల ఎన్నికల్లో గెలిచే శక్తి పార్టీకి ఉండేది. ఇందిరాగాంధీ అన్ని వ్యవస్థల ను ధ్వంసం చేశారు. అధికార కేంద్రీకరణ జరిపారు. పార్టీ , ప్రభుత్వం వ్యక్తి కేంద్రంగా మారిపోయింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు, సీడబ్ల్యుసీ, కేంద్ర క్యాబినెట్ మొదలైనవన్నీ నిర్వీర్యమైనాయి. ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై ఇంకా కనబడుతూనే ఉన్నది. ప్రజా ప్రాతినిధ్యం అనే సూత్రం ఆచరణలో లేదు. 1972 తర్వాత కాంగ్రెస్ పార్టీ కమిటీలు, పదవులు అన్నీ నియామకాల ద్వారా జరుగుతున్నాయి. కీలకమైన యూపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణాధారం వంటి ఎనిమిది వేల సహకార సంస్థలకు 1977 తర్వాత ఎన్నికలే లేవు. 1977లో పార్టీ ఓటమి తర్వాత స్థానిక విభాగాలు నామరూపాల్లేకుండా పోయాయి. క్రమంగా పార్టీ శిథిలావస్థకు చేరుకున్నది. సంజయ్ గాంధీ యువజన కాం గ్రెస్ నాయకుడు కావడంతో ఆయన భజన బృందానిదే పెత్తనమైపోయిం ది. మాతృ సంస్థ యువజన కాంగ్రెస్ కిందికి చేరింది. 1970, 80 దశకాలలో అధికారానికి తన చేతుల్లోకి తెచ్చుకున్న ఇందిరా గాంధీ క్రమంగా- తన తర్వాత స్థానాన్ని ఆక్రమించగల బలమై న నాయకులను పార్టీ నుంచి తొలిగిస్తూ పోయారు. ఈ విధంగా కుమారులు పార్టీ పగ్గాలు చేపట్టడానికి అనుకూల పరిస్థితిని సృష్టించారు. 2000 సంవత్సరం నుంచి సంస్థాగత ఎన్నికలు జరుపడానికి రాహుల్ ప్రయత్నించారు. అందువల్లనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో అనుకూల ఫలితాలు కనిపించాయి. కానీ ఈ మార్పు మెల్లగా సాగడం వల్ల ముఠా రాజకీయాలు పెరిగిపోయాయి. పార్టీని గెలిపించగల రాష్ట్రస్థాయి నాయకులు లేకుండాపోయారు.
sudha-sai
ఇటీవలికాలంలో రాష్ట్రస్థాయి నాయకులను ఎదుగనిచ్చిన రాష్ర్టాలలో పార్టీ బలపడింది. ఢిల్లీలో షీలాదీక్షిత్, మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సిం గ్, పంజాబ్‌లో అమరీందర్‌సింగ్ వంటి నాయకులు ఎదిగివచ్చారు. జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్ వంటి యువ నాయకులను, రాహుల్‌కు పోటీ అవుతారనే భావనతో ప్రోత్సహించడం లేదు. బీజేపీ చేతిలో వరుస పరాజయాల నుంచి బయటపడాలంటే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా సంస్కరించుకోవలసిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ నిష్క్రమించవచ్చు, లేదా పార్టీని ప్రజాస్వామిక సంస్థగా తీర్చిదిద్దనూ వచ్చు. పార్టీకి శస్త్ర చికిత్స చేయడం బాధతో కూడుకున్నదే. కానీ కాంగ్రెస్ పార్టీని సంస్కరించకపోతే, మనుగడ సాగించలేదు. అది దేశానికి ఎంతో నష్టదాయకం. పటిష్టమైన ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరం. హిందూ మెజారిటీవాదం, ఆధిపత్యవాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరుచడం అవసరం.
(రచయిత్రి: జేఎన్‌యూలో మాజీ ప్రొఫెసర్. ప్రొ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు)

434
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles