కఠువా దోషులకు శిక్ష

Wed,June 12, 2019 11:31 AM

దేశం యావత్తూ సిగ్గుతో తలదించుకునే రీతిలో జరిగిన అమానుషత్వానికి ఏడాదిన్నర కాలంలోనే తగిన శిక్షపడింది. జమ్మూకశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేండ్ల పసిబాలిక అసిఫాపై సామూ హిక అత్యాచారం, హత్య కేసులో ముద్దాయిలు ఏడుగురిలో ఆరుగురిని పంజాబ్‌లోని పాటియాలా ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అందులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా మరో ముగ్గురికి సాక్ష్యాధారాలను నాశనం చేయటానికి ప్రయత్నించినందుకు ఐదేండ్ల శిక్షతో పాటు యాభై వేల రూపాయల జరిమానా విధించింది. ప్రధాన నిందితుడు సాం జిరాం కుమారుడిని సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషిగా విడుదల చేసింది. గతేడాది జనవరిలో కఠువాలో ముస్లిం మతవర్గం సంచార తెగకు చెందిన ఎనిమిదేండ్ల బాలిక అసిఫాపై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అడవిలో మేతకు వెళ్లిన గుర్రాలను చూపిస్తామంటూ నమ్మబలికి అమాయక బాలికను కిడ్నాప్ చేసి సమీపంలోని ఓ ప్రార్థనా మందిరంలో బంధించి సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఓ క్షణికావేశ దుర్ఘటనగా కాకుండా నిందితు లు అత్యంత అమానవీయంగా ఆ పసిబాలికకు నాలుగురోజులు మత్తు మందు ఇచ్చి మరీ లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండటం కోసం సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు తలపై బండరాయితో కొట్టి హత్యచేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగికదాడుల్లో కఠువా ఘటన అత్యంత అమానుషమైనదిగానే గాకుండా అనేక విధాలుగా దేశంలోనే అరుదైన దుర్ఘటనగా నిలువటం గమనార్హం. కఠువా ఘటన నేపథ్యంలో దేశంలో ముఖ్యంగా జమ్మూలో జరిగిన ఆందోళనలు, వాదవివాదాలు మరింత అందోళనకరమైనవి.

కఠువా ఘటన తీరు మాత్రమే కాదు, ఘటన వెనుక ఉన్న సామాజిక మూలాలు మరింత భీతిగొలిపేవిగా ఉన్నాయి. ముక్కుపచ్చలారని ఎనిమిదేండ్ల అమ్మాయిపై నడివయస్కులైన వారితో సహా లైంగికదాడికి ఒడిగట్టడం వెనుక లైంగికాంశం ఎంతమాత్రం కాదు. గుర్రాలు, గొర్రెలు మేపుకొని బతికే నిస్సహాయ సంచార జాతికి చెందిన ముస్లిం సమూహాలను భయబ్రాంతులకు గురిచేసి ఆ ప్రాంతం నుంచి వారిని పారదోలటానికి నిందితులు ఎంచుకున్న కపట మార్గం అది.


ఓ నేరానికి మత రంగు పులిమి దోషులకు మద్దతుగా నిలువటం సమాజ విచ్ఛిన్నానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. కశ్మీర్‌లో ఎంతమంది మహిళలపై దాడు లు జరుగటం లేదు, ఓ బాలికపై జరిగిన దాడికి ఇంత ప్రాధాన్యం ఎందుకనే వాదనలు వినిపించటం జుగుప్సాకరం. ఒకానొక దశలో పోలీసు లు కేసు నమోదు చేసుకోవటానికి కూడా నిరాకరించారు. ఇక నిందితులను అరెస్టు చేయటా న్ని నిరసిస్తూ హిందూ ఏక్తా మంచ్, కఠువా బార్ అసోసియేషన్ లాంటి సంస్థలు జాతీయ జెండాలు పట్టి ప్రదర్శనలు చేశాయి. నిందితుల కు మద్దతుగా జరిగుతున్న ప్రదర్శనల్లో అప్పటి పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయటానికి వచ్చిన అధికారులను కఠువా బార్ అసోసియేషన్ అడ్డుకున్నది. దీంతో బాధితులు తమకు అక్కడ న్యాయం జరుగదని కేసును మరోచోటుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లటంతో కేసు పంజాబ్‌లో ని పాటియాలా కోర్టుకు బదిలీ అయ్యింది. మరో వైపు అసిఫా కేసులో బాధితులకు న్యాయం జరుగాలని, నిందితులు శిక్షింపబడాలని మహి ళా న్యాయవాది దీపికాసింగ్ రజావత్ అలుపెరుగని పోరాటం చేశారు. ఆ క్రమంలో దీపికాసింగ్ ఎదుర్కొన్న సమస్యలు మరింత దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌నుంచి మిలిటెంట్ల దురాగతాలతో ఢిల్లీకి వలస వచ్చిన కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన మహిళగా దిపికాసింగ్ ముస్లిం బాలిక పక్షాన నిలువటాన్ని ఇరుగుపొరుగు వారు తీవ్రంగా తప్పుబట్టారు. రక్త సంబంధీకులు, ఇరుగుపొరుగు సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. చివరికి కోర్టులోని సహ న్యాయవాదులు కూడా మాట్లాడటం మానేశారు. దేశద్రోహి ముద్ర కూడా వేసి సూటిపోటి మాటలతో, ఈసడింపులతో కాకుల్లా పొడుచుకుతిన్నారు.

కఠువా ఘటన తీరు మాత్రమే కాదు, ఘటన వెనుక ఉన్న సామాజిక మూలాలు మరింత భీతిగొలిపేవిగా ఉన్నాయి. ముక్కుపచ్చలారని ఎనిమిదేండ్ల అమ్మాయిపై నడివయస్కులైన వారి తో సహా లైంగికదాడికి ఒడిగట్టడం వెనుక లైంగికాంశం ఎంతమాత్రం కాదు. గుర్రాలు, గొర్రెలు మేపుకొని బతికే నిస్సహాయ సంచార జాతికి చెందిన ముస్లిం సమూహాలను భయబ్రాంతులకు గురిచేసి ఆ ప్రాంతం నుంచి వారిని పారదోలటానికి నిందితులు ఎంచుకున్న కపట మార్గం అది. తద్వారా వారు ఆ ప్రాంతంలోని పచ్చికబయళ్ళను, వారి నివాస ప్రాంతాలను ఆక్రమించుకోవచ్చన్నది వారి పన్నాగం. ఆ నేపథ్యంలోంచే హిందూ జాగరణ్ మంచ్ లాంటి సంస్థలు లేవదీసి న వాదనలు అంతటి అమానవీయంగా, వివాదాస్పదంగా ఉన్నాయి. కేసు విచారణ సందర్భం గా న్యాయమూర్తి తేజ్వీందర్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హమైనవి. నిందితులు ఇదొక అటవి క రాజ్యంగా తలచి ఇష్టానుసారంగా వ్యవహరించారని తీవ్రంగా గర్హించారంటే పరిస్థితి తీవ్రత ను అర్థం చేసుకోవచ్చు. పఠాన్‌కోట్ అమానవీయ ఘటన జమ్మూకశ్మీర్‌లోని సామాజిక సమూహాల విచ్ఛిన్నతకు పరాకాష్టగా భావించాలి. అంతేగాకుండా నేరాన్ని రాజకీయం చేయటమే కాకుండా, దానికి మతరంగు పులమటం గర్హనీయం. ఈ ఘటనను మానవీయంగా కాకుండా మత మాయతెరలతో చూడటం మరింత విషాదం. ఈ క్రమంలో న్యాయవాదులు కూడా బాధితుల పక్షాన నిలువకుండా నిందితుల పక్షాన నిలిచి ఊరేగింపులు తీయటం న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకం చేసింది. ఏదేమైనా సామాజిక ఒత్తిళ్లు, పర్యవసానాల నేపథ్యంలో ఏడాదిన్న కాలంలోనే కోర్టు తీర్పు వెలువరించడం, దోషులకు కఠిన శిక్షలు విధించటం బాధిత కుటుంబానికి ఊరటనిచ్చేదిగా ఉన్నది.

278
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles