కర్పూర వసంతరాయలు


Mon,July 29, 2019 12:58 AM

కథా గమనంలోను, పాత్రల సజీవ చిత్రణలోను, లలితమైన అభివ్యక్తిలోను, విలక్షణత్వాన్ని పుణికిపుచ్చుకున్న - కర్పూర వసంతరాయలు, పాఠకుల, శ్రోతల మన్ననలను పుష్కలంగా చూరగొంది. 1960-80 దశకాలలో, ఆంధ్రదేశంలో ఎక్కడ కవిగారి సభ జరిగినా అది యీ కావ్యగానం లేకుండా జయప్రదం కాలేదన్నది నగ్న సత్యం. అంతేకాదు లబ్ధ ప్రతిష్ఠులైన కవులనుండీ ఉద్యమానులైన యువకవుల వరకూ, ఎందరో ఆ బాణిలో కథా కావ్యాలను రాశారంటే ఈ కావ్య ప్రభావం ఎంత బలీయమైందో మనం ఊహించవచ్చును.
cnr
కవిత్వం ఒక అక్షర తపస్సు
కవిత్వం ఒక అక్షయ యశస్సు
కవిత్వం
భావాంబర వీధుల్లో విహరించే మనో విహంగం ముందు
సాక్షాత్కరించే ఒక రసోదయ ఉషస్సు!
ఆ తపస్సును పండించుకుని, ఆ యశస్సును సముపార్జించుకుని, తాము దర్శించిన రసోదయ ఉషస్సులోని రోచిస్సులను, అక్షర గవాక్షాల ద్వారా అశేష పాఠకలోకానికి అందించి, అలరిస్తున్న కవులలో ప్రముఖులు డాక్టర్ సి. నారాయణరెడ్డి. ఆయన మాటకు పరిమళాన్ని, పాటకు సంగీత గమకాన్ని నేర్పిన శబ్దశిల్పి. పూల పాటల నుండి నేటి మినీ కవితల మేలి బాటల వరకు, నవ్వని పువ్వు నుండి నారాయణరెడ్డి గజల్స్ వరకు వెన్నెలవాడ నుండి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న విశ్వంభర వరకు ఆయన కవితా ప్రస్థానం ఒక సాహితీ జైత్రయాత్రగా కొనసాగుతూనే వుంది. ఆధునిక గేయ కవిత్వంలో లఘు కథా కావ్యాలను ప్రారంభించిన ఘనత,అభ్యుదయ కవితలవాడ శ్రీ గురజాడకు దక్కుతుంది. ఆయన రాసిన లవణరాజు కల, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి రచనలు ఈ కోవకు చెందుతాయి. ఆ తర్వాత శ్రీ తల్లావఝల శివశంకరశాస్త్రి వకుళ మాళిక ని, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలని, పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవాన్ని గేయ కథాకావ్యాలుగా అందించారు. వీటిలో కథ నామమాత్రంగా వుండి, కవి రచనా విన్నాణమే యెక్కువ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కావ్యానికి కథాబలం ముఖ్యమన్న విషయాన్ని గమనించిన సినారె వస్తువులోను, అభివ్యక్తిలోను ప్రకృష్టమైన బంధాన్ని ఏర్పరచి, తమ కావ్యాలను గేయ ప్రబంధాలుగా తీర్చిదిద్దారు. నాగార్జున సాగరం, స్వప్నభంగం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, ఋతుచక్రం, జాతిరత్నం ఆయన రాసిన గేయ కథాకావ్యాలు. వీటిలో వాసిలోను, వన్నెలోను, సొబగులోను, బిగువులోను తారా మణిహారంగా నిలిచే కావ్యం కర్పూర వసంతరాయలు.


ద్వితీయ ముద్రణకు కర్పూర సౌరభాన్ని అందిస్తూ డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు.. రమ్యమైన కథను గ్రహించి, దానిని రసభావ మహితముగా గ్రంథించి, గేయ రూపమున తీర్చిదిద్దిన కీర్తి నారాయణరెడ్డి గారికే దక్కుతుంది అన్న మాట లు అక్షర సత్యాలుగా మన ముందు నిలుస్తాయి. ఈ కావ్యం అయిదుసార్లు ముద్రణకు నోచుకోవడం కూడా ఆ కావ్య గరిమకు తార్కాణంగానే పేర్కొనవచ్చు.


కర్పూర వసంత రాయలు కావ్య రచనకు మూల ప్రేరణ రెడ్డి రాజుల యుగంలో ప్రసిద్ధుడైన కుమారగిరి రెడ్డికి-కర్పూర వసంతరాయలు- అనే బిరుదు వుందన్న యెరుక. ఆ యెరు కతో పొందిన స్పందన మల్లంపల్లి రచనలు అందించిన వివరణ, యీ కావ్య రచనకు ఆధారమని స్వయంగా సినారె తమ భూమికలో పేర్కొన్నారు. కవి కమనీయ కల్పనతో రూపం దిద్దుకున్న యీ కావ్యం-అయిదు ఆశ్వాసాల గేయ ప్రబంధం. మొదటి ఆశ్వాసంలో మదనోత్సవ సంబరం, నగరోద్యానంలో పూవిల్లుని పూజ, లకుమ నృత్య కళా ప్రదర్శన, రాయలచే కంఠహార బహూకరణ ప్రధానమైన అంశాలు. రెండవ ఆశ్వాసంలో లకుమ-వసంతరాయలుల ప్రణయోద్దీపన, లకుమకు రాజనర్తకి పదవీ పరికల్పన, లకుమ సంతోషము మహారాణి సంతాపము హృద్యంగా వర్ణించబడ్డాయి. మూడవ ఆశ్వాసం లో లకుమ -రాయలుల తీర్థయాత్రలు, లకుమ నాట్యలీలలో రాయలు అనుభవించిన ఆనందహేల, అంతఃపురంలో మహారాజ్ఞికి పీడకలల కలత-అక్షర రూపాన్ని సంతరించు కున్నా యి. నాల్గవ ఆశ్వాసంలో లకుమ కోసం కేళీ మందిర నిర్మాణం కాటయ వేముని దండయాత్ర, లకుమ నాట్య భంగిక పరవశించిన రాయలుచే వసంత రాజీయ నాట్యశాస్త్ర రచన. రాచకార్య బహిష్కరణ కాటయ వేముని అభ్యర్థన ముఖ్యమైన ఘట్టాలు. ఇక ఐదవ ఆశ్వాసంలో బావమరిది అభ్యరనపై రాయలు దర్బారుకు రాక, లకుమ కాలుబెణికిందన్న వార్తతో నిష్క్రమణ-ప్రజల గుసగుసలు -మహారాజ్ఞి పరితాపము-స్వయంగా లకుమ మందిరానికి వెళ్లి-వ్యక్తిగత స్వార్థం కోసం గాక దేశ క్షేమంకోసం రాయలపై గల ప్రణయాన్ని త్యాగం చేయవలసిందిగా అభ్యర్థన-లకుమ త్యాగం-రాయలులో కర్త వ్య జాగరణ-కమనీయంగా కావ్యబద్ధ మయ్యాయి.

కర్పూర వసంతరాయలు కావ్యంలో భావగాంభీర్యము, భాషా సౌకుమార్యము రెండూ సమపాళ్లలో ముందుకు సాగా యి. మదనోత్సవానికి బయలుదేరిన కుమారగిరిరెడ్డిని ప్రశంసిస్తూ వంది మాగధులు పలికిన కైవారాలు..
జయ జయ సమగ్రాంధ్ర
సర్వం సహా భార
సంభరణ శేషాహి రూపా!
పరి పంథి నృపతి దో
ర్చల కంధి మంధనా
పర మంద రాద్రి స్వరూపా..!
అంటూ సాగే సంస్కృత సమాన రచన రెడ్డిగారి ఉభయ భాషా పాండిత్యానికి నిదర్శన. అభివ్యక్తిలో సరికొత్త అందాన్ని ఆవిష్కరించడం ఈ కవికి వెన్నతో పెట్టిన విద్య. ఉత్సాహం ఉరకలు వేసే యువతీ యువకుల సంబరాన్ని వర్ణిస్తూ..
ఏ మొగమ్మున చూపు నిలిపిన
యిగురు వోసెడు కాంతి వల్లులు
ఏ సిగను పరికించి చూసిన
ఏటవాలుగ నవ్వు మల్లెలు.. అంటారు కవి.
ఈ చరణంలో మొదటి రెండు పాదాలు యువకుల మనోభావాలకి, మిగిలిన రెండు పాదాలు యువతుల నయనాభిరామ సౌందర్యానికి అద్దం పడతాయి. వడివడిగా నడిచేటప్పు డు, గాలి విసురుకి సిగలోని మల్లె సరులు నిటారుగా కాక ఏటవాలుగా ఎగురుతుంటాయి. ఈ సూకా్ష్మన్ని ఎంతో సుందరం గా అక్షరబద్ధం చేశారు. ఇది వారి పరిశీలనా దృష్టికి ఒక ఉదాహరణ మాత్రమే! లకుమ, కుమారగిరిరెడ్డి-యిరువురి మధ్య పొటమరించిన అనురక్తి కేవలము కాయికమైన వ్యామోహానికి సంబంధించినది కాదని, జననాంతర సౌహృదాని ఏర్పడిన రాగబంధమని ధ్వనింప జేస్తారు డాక్టర్ నారాయణరెడ్డి.

లకుమయే రాణ్మౌళి
బ్రతుకు నావను నడుపు చుక్కాని
లకుమయే ఱేని లీ
లా మహా సామ్రాజ్యమున రాణి..
ఆమె కన్నులు విరిసి
నంతనే అతడు పగలను కొనును
ఆమె కన్నులు మోడ్చి
నంతనే రాతిరియయ్యెననుకొనును..
నాదేవర నా గుండియు
పాదున రతనాల మొలక
నా మనసే పంజరమ్ము
గా మెలగెడు రామచిలుక.. అన్న పంక్తులు యీ సత్యాన్నే చాటి చెపుతాయి. భంగ్యతరంగా సౌందర్యాన్ని ప్రభావోత్పాదకంగా వర్ణించడము ఈ కావ్యంలోని మరొక విశేషమైన అంశం. లకుమ సౌందర్యాన్ని వర్ణించిన తీరు యిందుకు మకుటాయమానంగా నిలుస్తుంది. తనలో రాగము రవళి రవళింప జేసిన లకుమను పంచభూతాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా రాజు భావించడం, ఆ పంచభూతాల పోలికతోనే పరోక్షంగా లకుమ శారీరక సౌం దర్యాన్ని మన మనోపటలం పైన అంకితం చేయడం.. కవి ప్రతిభకు మచ్చుతునకలుగా నిలుస్తాయి.
పృధివి నాయమ జఘన పీఠమ్మునం జూచి
జల మామె కంటి పాపల లోతులం జూచి
తేజమ్ము నామె ముఖ రాజీవమున గాంచి
వాయుగతి నామె నిశ్వాసముల గుర్తించి
ఆకాశమామె మధ్యము నందు గమనించి
నిఖిల సృష్టికి లకుమనే ప్రతీకగ నెంచి.. అన్న వర్ణనలో కవి ప్రకటించిన కౌశలం, ఆయన ప్రతిభా, వ్యుత్పన్నతలకు నికషోపలం.

సాంప్రదాయికమైన ఉపమానాలను స్వీకరిస్తూనే స్వతహా గా ఉన్న ప్రతిభతో అభివ్యక్తిని మరింత హృదయంగమంగా రూపొందించడం ఈ కవికి కరతలామలకం. లకుమ-రాయలు వీరి పరస్పర రాగానుబంధాన్ని తెలియజేసే ఘట్టంలో..
నీ వొక నాగ స్వర మవు
నేనో నాగిని మాత్రము
ఇరువుర బంధించి వేసే
నేదో అంతస్సూత్రము -
నీవు నిండు చందురుడవు
నేనో కల్వల చెల్వను
పరిమళ సోపాన పంక్తి
యిరువుర నేకము చేసెను.. అన్న పంక్తులను యిందుకు ఉదాహరణంగా పేర్కొనవచ్చు. ఒక క్రియకు జరిగే భిన్న ప్రతిక్రియలను ఏకకాలంలో, గుం డెకు హత్తుకునేలా వర్ణించడం ఈ కావ్యంలోని యింకొక ప్రత్యేకమైన అంశం. లకుమను రాజ నర్తకిని చేసినప్పుడు..
లకుమ కావార్త క
ల్వ నెలంత కంటి పా
పల పైన పాల వె
న్నెల సోకినటులయ్యె..
రాణి కా వార్త క
ల్వ నెలంత చెవులలో
ఖర కరుని అశ్వరిం
ఖల చప్పుడుగ తోచె.. అన్న వర్ణన
లకుమ అపుడే తొలిసారిగ
రాయని తన మనసార కౌగిలించె
అచట కొండ వీట రాణి
అతి వికృత స్వప్నమున కలవరించె,
ఇట ఱేడు లకుమను తన
హృదయ పట్టమహిషిగా ప్రతిష్ఠించెను
అచట రాణి కలలో, శ
య్యపై పొరలి, పొరలి నేల పై దొరలెను.. అన్న పంక్తులు ఈ భిన్న దృశ్యమాలికా గ్రధన కౌశల్యానికి కరదీపికలుగా భాసిస్తాయి. ఏ కథా కావ్యంలో అయినా, నాటకీయత, సంవాదాత్మక శైలి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అవి పాఠకుని మనస్సులో పాత్రలను సజీవంగా ప్రతిష్ఠిస్తాయి. ఈ కావ్యంలో కూడా లకుమ-వసంతరాయలు మధ్య సాగిన ఎన్నో సంవాదాత్మక సంభాషణలు ఆ ప్రయోజనాన్ని పుష్కలంగా సాధించాయి.

ఓ లకుమా
నీ వూదిన ఊపిరి యే
ఈ వసంత రాజీయము..
మట్టిని ఒక అనర్ఘ
మణిగా మలచితి వీవే
రాతిని సాల గ్రామము
గా తీరిచినా వీవే.. అని రాజు అంటే..
ప్రభూ పాద దాసి నిటుల
ప్రశంసించ దగునా?
కాలిధూళి ఏనాటికి
గంధపు పొడి యగునా..? అని లకుమ బదులు చెప్పిన తీరు యెంతో సప్రశ్రయంగా కనిపిస్తుంది.
కర్పూర వసంతరాయలు ప్రధానంగా శృంగార రస ప్రబంధంగా సాగినా, కరుణ రసం, వీర రసం దానికి తోడుగా నిలిచాయి. ముగింపులో త్యాగానికి, దేశభక్తికి పెద్ద పీట వేయడం వల్ల, కావ్య వస్తువు మరింత ఔచిత్యాన్ని సంతరించుకుని, విశ్వజనీనమైన సందేశాన్ని ప్రబోధించింది.. భోగంలో కాదు, గొప్పతనం త్యాగంలో వుంది అని నిరూపించిన లకుమను దేశభక్తికి నిలువెత్తు దర్పణంగా నిలిపింది. తన కోసం కాక దేశ సంక్షేమం కోసం లకుమను త్యాగం చేయమని మహారాణి అభ్యర్థించే సన్నివేశం పాఠకుల హృదయాల్ని పిండివేస్తుంది..
దేశ మొక దెస, నీవు ఒక దెస
తేల్చుకొను మెయ్యది ఘనమ్మో
వ్యక్తి - సంఘములందు యెయ్యది
ప్రథమ గణ్యమొ చెప్పవమ్మా.. అంటూ మహారాణి వేసిన ప్రశ్న దేశభక్తిని ప్రేరేపిస్తుంది. తూర్పున బాలభానుని తొలికిరణ ప్రసరణంతో లకుమలోని యిరుల దొంతర కూడ తొలగిపోతుంది. ఆమెలో ఒక వజ్ర సంకల్పము వేళూనుతుంది. శిబి. దధీచులను మించిన త్యాగం చేస్తూ లకుమ తన ప్రాణాలను అర్పిస్తుంది. ఆ బలిదానంలో వసంతరాయునికి కర్తవ్యం స్ఫురిస్తుంది.

ఓ లకుమ ఎటు నుంటివో నీవు? ఇంకెచట
పరమ సాధ్వీ జగత్ స్వర్ణాసనము పైన..
ఓ సఖీ ఏమందువో నీవు? ఇంకేమి?
వ్యష్టికన్నను దేశ దృష్టియే గరిష్ఠమని..
అంటూ రాజు కర్తవ్యపథంలో అడుగు పెడతాడు.
కొమరగిరి చరితమ్ము కొండవీటను శిశిర
మును సైతము వసంతముగ రూపు గట్టించు..
కొండవీటను పాదు కొన్నట్టి మట్టిలో
సైతమ్ము కర్పూర సౌరభమ్ములు వీచు.. అంటూ కవి తన కావ్యాన్ని ముగిస్తారు. ఈ చివరి వాక్యాలను చదువగానే కొందరి మనస్సులో కిన్నెరసాని పాటల ముందుమాట కల్పనలో విశ్వనాథ వారు అన్న
అచట కిన్నెరసాని
నాయాత్మయందు
ఇప్పటికి దాని సంగీతమే నినదించు..
అనే పంక్తులు అప్రయత్నంగానే ముఖరితమౌతాయి. ఇది యాదృచ్చికమైనా కావచ్చు, లేదా కవి సిద్ధ హృదయంపై కిన్నెరసాని పాటలు వేసిన అజ్ఞాతముద్ర అయినా కావచ్చు. కావ్యం చదవటం పూర్తిచేసిన తర్వాత సామాన్య పాఠకుని మనస్సులో ఒకటి, రెండు సందేహాలు తలెత్తుతాయి! ఎంతో విజ్ఞుడు, ప్రాజ్ఞుడు అయిన కుమారగిరిరెడ్డి లకుమ సౌందర్యానికి దాసోహమని రాచకార్యాలను విస్మరించడం, బావమరిది మాటను, పట్టపురాణి ఆవేదనను పెడచెవిని పెట్టడం, నిండు దర్బారును ధిక్కరించడం..సమంజస మేనా? అన్నది మొదటి సందేహం. అయితే ఇనుప కచ్చడాల్ కట్టుకున్న ముని ముచ్చు లే, అప్సరసల అందాలకు బందీలై, తపోభంగానికి పాల్పడినప్పుడు రసజ్ఞుడు రాగ హృదయుడు అయిన కర్పూర వసంతరాయలు అలా ప్రవర్తించడం మానవ సహజమనే అనిపిస్తుం ది. కావ్యం చివరలో మానసిక వేదనతో, మరణ యాతన అనుభవిస్తున్న లకుమ తనను తాను సానిదానిగా సంబోధించుకోవటం మాత్రం కొంచెం యెబ్బెట్టుగానే అనిపిస్తుంది. అలా అనే బదులు ఆటవెలదికి అంటే బాగుండేదేమో!

ఇక అభివ్యక్తి పరంగా కర్పూర వసంత రాయలు లో ఎన్నో విశిష్టతలను వెలయించారు సినారె. త్రస్య, చతురస్ర గతులలో సాగే గేయఛందస్సులో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఒక టి, రెండు మాత్రలను పెంచి తగ్గించి నడకకు నవ్యతను చేకూర్చారు. సాంప్రదాయిక కవులు సీసపద్యాలలో ఎన్నెన్ని చమత్కారాలను సాధించారో, గేయ ఛందస్సులో డాక్టర్ సినారె అన్ని చమక్కులు చూపించారు. పరిమళించే పదబంధాలకు పెట్టింది పేరు ఆయన. ఆచంట జానకిరామ్ గారి మాటల్లో..కాలిధూళి, గంధపు పొడి, పాద పరాగము, పాపిట సింధూరము యీ పదముల పొందిక గమనింపదగినది. ఇలాగే కావ్యమంతటా అందమైన మాటలు పచ్చ కర్పూరపు పలుకులులాగా పరిమళిస్తాయి. ద్వితీయ ముద్రణకు కర్పూర సౌరభాన్ని అందిస్తూ డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు.. రమ్యమైన కథను గ్రహించి, దానిని రసభావ మహితముగా గ్రంథించి, గేయ రూపమున తీర్చిదిద్దిన కీర్తి నారాయణరెడ్డి గారికే దక్కుతుంది అన్న మాట లు అక్షర సత్యాలుగా మన ముందు నిలుస్తాయి. ఈ కావ్యం అయిదుసార్లు ముద్రణకు నోచుకోవడం కూడా ఆ కావ్య గరిమకు తార్కాణంగానే పేర్కొనవచ్చు. (ఈ కావ్యాన్ని రాగి రేకులలో, రాతి పలకలో కనుమూసిన తెనుగల చరితకు ప్రాణం పోసిన మహామనీషి మల్లంపల్లి సోమశేఖరశర్మగారికే అంకితమివ్వడం కవి ఉన్నత మనస్స్విన్నతను చాటుతుంది.) కథా గమనంలోను, పాత్రల సజీవ చిత్రణలోను, లలితమై న అభివ్యక్తిలోను, విలక్షణత్వాన్ని పుణికిపుచ్చుకున్న - కర్పూ ర వసంతరాయలు, పాఠకుల, శ్రోతల మన్ననలను పుష్కలం గా చూరగొంది. 1960-80 దశకాలలో, ఆంధ్రదేశంలో ఎక్క డ కవిగారి సభ జరిగినా అది యీ కావ్యగానం లేకుండా జయప్రదం కాలేదన్నది నగ్న సత్యం. అంతేకాదు లబ్ద ప్రతిష్ఠులైన కవులనుండీ ఉద్యమానులైన యువకవుల వరకూ, ఎందరో ఆ బాణిలో కథా కావ్యాలను రాశారంటే ఈ కావ్య ప్రభావం ఎంత బలీయమైందో మనం ఊహించవచ్చును.

కొండవీటి మృత్తికలోనే కాదు, సాహిత్యాభిమానుల గుండె వాటికలో కూడా యిప్పటికీ కర్పూర వసంతరాయలు కావ్య సౌరభాలు గుబాళిస్తూనే వున్నాయి. గేయ సాహిత్యం వున్నంత వరకు సాహిత్య అధ్యయనం సాగుతున్నంతవరకు, ఆ సౌరభాలు కాలాన్ని కర్పూరంలా పరిమళింపజేస్తూనే వుంటాయి. అందు కే ఆ కావ్యం ఆధునిక గేయ సరస్వతికి సువర్ణ సుమహారం. శత వసంతాల తెలుగు సాహిత్య నందనంలో వసివాడని అక్ష ర మందారం.
- కేవీఎస్ ఆచార్య
(శత వసంత సాహితీ మంజీరాలు అనే పుస్తకంలో సినారె రాసిన కర్పూర వసంతరాయలు గ్రంథంపై
రాసిన వ్యాసం.)
(సినారె 88వ జయంతి సందర్భంగా..)

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles