కంప్యూటర్ వ్యవసాయం

Mon,August 5, 2019 01:01 AM

GOPI-2
మా మనుమడు అప్పుడప్పుడు
కంప్యూటర్ గేవ్‌‌సుతో
వ్యవసాయం చేస్తుంటాడు.
బెండకాయల్లో పురుగులుంటాయా
అని అడుగుతూ
మందులు కూడా చల్లుతుంటాడు
(బెండకాయలు వాడి కిష్టం!)
రెండు వందల రూపాయలు
పెట్టుబడి పెడ్తాడు
ఆరు వందల యాభై
రాబడి సంపాదించినట్లు తేలుస్తాడు.
దళారీలుండరు
గిట్టుబాటు ధరలు వాడే నిర్ణయిస్తాడు.
భూమి ఎక్కడి నుంచి వస్తుందో
విత్తనాలు ఎవరిస్తారో తెలియదు
పన్నెండో రోజున
మొక్కలు చిగురించాలని శాసిస్తాడు.
వ్యవసాయాన్ని
లాభదాయక క్రీడగా భావిస్తాడు
కౌలుకు అర్థం
వెబ్ డిక్షనరీలో చూస్తానంటాడు.
ఇంతలో మా అబ్బాయి
బియ్యం కొనుక్కొచ్చి
బస్తాను డ్రాయింగ్ రూంలో పెట్టాడు
వాటి ధరకూ వీడి లెక్కలకూ పొంతన కుదరదు.
ఛా !
ఇదంతా బేకారు
కారు పందాలే బెటరు
అని గట్టిగా అరిచాడు.
- డాక్టర్ ఎన్.గోపి

88
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles