చరిత్రకు ఆధారాలు అవసరం

Mon,August 5, 2019 01:03 AM

ఈ విషయాలు నిజమైనా కాకపోయినా కవులుగా, తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాళ్లుగా వాళ్ల స్థానం ఏమీ మారదు. ఇది తెలుగు సాహిత్య చరిత్ర రచనకూ, చరిత్ర రచనా పద్ధతికీ (హిస్టోరియోగ్రఫీకీ) సంబంధించిన విషయం. చరిత్ర మన ఊహల ప్రకారం, ఇష్టా ల ప్రకారం నడువదు. మన ఊహల ప్రకారం, ఇష్టాల ప్రకారం రచి స్తే అది కాల్పనిక రచనో, ఊసుపోక కబుర్లో కాగలదు గాని, దానికి చరిత్ర ప్రామాణికత రాదు. నిస్సందేహమైన ఆధారా లు, ఆ ఆధారాల విశ్వసనీయత, సంభవనీయత, ఆ ఆధారాలకు స్పష్టమైన, ధృవీకరించుకోగలిగిన ప్రమాణాలు చరి త్ర రచనకు అనివార్యమైనవి.

నాకు జవాబుగా సామిడి జగన్‌రెడ్డి గారు లిఖిత, మౌఖిక ఆధారాలున్నాయి అని రాసిన వ్యాసంలో (నమస్తే తెలంగాణ, జూలై 15, 2019) ప్రస్తావించిన రెండు మౌఖిక ఆధారాల సంగతి చెప్పలేను గాని, ఇచ్చిన మూడు లిఖిత ఆధారాలలో రెండు నిజం కావనీ, మరొకటి సందేహాస్పదమనీ చెప్పడానికి విచారిస్తున్నాను.1.మహాస్వప్న గురించి శ్రీశ్రీ మూడు వాక్యాలకన్న ఎక్కు వ రాయలేదని నేను అనంతం నుంచే ఉటంకించాను. జగన్ రెడ్డిగారు తానే కొత్తగా అనంతంలో కనిపెట్టినట్టుగా ఐదు వాక్యాలున్నాయని అంటున్నారు. శ్రీశ్రీ అనంతం ఇప్పటికి అనేకసార్లు అచ్చయింది, ఎవరైనా చూడవచ్చు. విరసంలో వీరశైవులు అనే అధ్యాయంలో మొదటి భాగం వరవరరా వు గురించీ, కె.వి.రమణారెడ్డి గురించీ, మూడో భాగం పూర్తి గా చెరబండరాజు గురించీ రాసిన శ్రీశ్రీ, రెండో భాగంలో భైరవయ్య, మహాస్వప్నల గురించి రాశారు.

ఆ భాగంలో భైరవయ్యను మొదటిసారి కలుసుకోవడం గురించి కూడా ప్రస్తావించి, భైరవయ్య కవిత తెలుగు పాఠాన్నీ దానికి తన ఇంగ్లీష్ అనువాదాన్నీ కూడా ఇచ్చారు. అంటే ఆ భాగంలో దాదాపు తొంభై శాతం భైరవయ్యకే కేటాయించారు. భైరవయ్యను మొదటిసారి కలుసుకోవడం ప్రత్యేకంగా చెప్పిన శ్రీశ్రీ, మహాస్వప్నను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన సంగతి ఎందుకు మరిచిపోయారో తెలియదు. ఇక, ప్రారంభంలోనే వారిలో మహాస్వప్న విరసం ఆవిర్భావానికి ముం దే దిగంబరోద్యమం నుంచి తప్పుకున్నాడని ఒక వాక్యం, చివరిలో విరసం సభ్యుడు కాకపోయినా మహాస్వప్నను నేను వీరశైవుడిగా గుర్తిస్తాను. అతనిలోని అరాజకత్వం నాకు నచ్చిందని మరి రెండు వాక్యాలు మాత్రమే మహాస్వప్న గురించి రాసినవి ఉన్నాయి. ఆ తర్వాత అనార్కిజం గురించి తాత్విక చర్చ నాలుగైదు వాక్యాలున్నాయి. మహాస్వప్న గురించి ఆ మూడు వాక్యాలు కాక మరొక రెండు వాక్యాలు జగన్‌రెడ్డి గారికి ఎక్కడ దొరికాయో తెలియదు.

2.మహాస్వప్న కవితలు రెండిటిని శ్రీశ్రీ ఇంగ్లీష్ చేశారని జగన్‌రెడ్డి మొదట రాసినదాన్ని సరిచేస్తూ ఒకటి మాత్రమే చేశారని నేనన్నాను. కాదు, రెండు చేశారని మహాస్వప్న తన తో చెప్పారనీ, ఆ రెండూ శ్రీశ్రీ మిస్సెలెనీలో అచ్చయ్యాయనీ, తాను ఆ పుస్తకం చూడలేదనీ, లేకపోతే సవరించుకుంటాననీ ఇప్పుడు జగన్ రెడ్డి అంటున్నారు. శ్రీశ్రీ మిసెలెనీ 1970 ఫిబ్రవరిలో వెలువడింది. అందులో 52 పేజీ నుంచి 60వ పేజీ వరకూ దిగంబర కవుల కవితలకు శ్రీశ్రీ అనువాదాలున్నాయి. వాటిలో మహాస్వప్న కవిత ఒకటే (పేజీ 56-57) ఉంది. ఈ శ్రీశ్రీ మిసెలెనీ కె.వి.రమణారెడ్డి సంపాదకుడిగా అప్పటికి శ్రీశ్రీ రచనలన్నీ సేకరించి ప్రచురించిన సమగ్ర సంపుటాల్లో ఒకటి. ఆ తర్వాత 1984-20 00 మధ్య శ్రీశ్రీ రచనా సర్వస్వం 21 సంపుటాలు వెలువడ్డాయి. అప్పటివరకు దొరికిన శ్రీశ్రీ రచనల్లో ఒక్క అక్షరం కూడా వదలకుండా అచ్చయిన సంపుటాలవి. శ్రీశ్రీ ప్రత్యేకంగా దిగంబరకవుల మీద రాసిన రచనలూ అనువాదాలూ అన్నీ శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురించిన శ్రీశ్రీ-దిగంబర కవులులో వచ్చాయి. వీటిలో ఎక్కడా ఆ రెండో కవిత అనువాదం లేదు. శ్రీశ్రీ మిసెలెనీ తర్వాత పదమూడు సంవత్సరాలు బతికిన శ్రీశ్రీ గాని, ఆయన రచనలన్నిటినీ సేకరించిన ప్రచురించిన తర్వాతి పుస్తకాలు గాని ఆ రెండో అనువాదాన్ని ఎక్కడైనా ఎందుకు ప్రచురించలేదో తెలియదు. ఒకవేళ శ్రీశ్రీ, ఆయన రచనలు వేసినవారు ఆ రెండో అనువా దం వేయలేదనుకుంటే మహాస్వప్న అయినా, ఆయన మిత్రులైనా దాన్ని ఎందుకు ప్రచురించలేదో తెలియదు.

3.ఆంధ్రజ్యోతి దినపత్రిక శతజయంతి కానుక పేరుతో ఒక కాలమ్ నిర్వహించిందనీ, అందులో భాగంగా 2009 ఆగస్టు 6 సంచికలో మహాకవి శ్రీశ్రీతో ఒక రాత్రి అని మహాస్వప్న రాశారని జగన్ రెడ్డి అంటున్నా రు. ఆంధ్రజ్యోతి దినపత్రిక శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా 2009-10ల్లో ప్రచురించిన రచనలన్నీ చూశాను. జగన్‌రెడ్డి గారు అన్నట్టు 200 9 ఆగస్టు 6 సంచికలో అటువంటి వ్యాసమేదీ లేదు. పోనీ మిగిలిన రోజు ల్లో చూసినా కొన్ని పాత రచనలతో పాటు కొత్తగా వంగపండు ప్రసాదరావు, కాత్యాయని, ఓల్గా, కేకేఆర్, వీఏకే రంగారావు, చెరుకూరి సత్యనారాయణ, వరవరరావు వంటి ఎందరి రచనలో ఉన్నాయి గాని మహాస్వప్న రచన లేదు. జగన్‌రెడ్డి గారు పత్రిక ఏమన్నా పొరపాటు పడ్డారో తెలియదు. చరిత్ర రచన విషయంలో ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో పరిశోధించదలచుకున్న వారికి ఉపయోగపడ వు.

ఇంతకూ ఇది శ్రీశ్రీకీ, మహాస్వప్నకూ సంబంధించిన విషయం కాదు. ఈ విషయాలు నిజమైనా కాకపోయినా కవులుగా, తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాళ్లుగా వాళ్ల స్థానం ఏమీ మారదు. ఇది తెలుగు సాహిత్య చరిత్ర రచనకూ, చరిత్ర రచనా పద్ధతికీ (హిస్టోరియోగ్రఫీకీ) సంబంధించిన విషయం. చరిత్ర మన ఊహల ప్రకారం, ఇష్టా ల ప్రకారం నడువదు. మన ఊహల ప్రకారం, ఇష్టాల ప్రకారం రచి స్తే అది కాల్పనిక రచనో, ఊసుపోక కబుర్లో కాగలదు గాని, దానికి చరిత్ర ప్రామాణికత రాదు. నిస్సందేహమైన ఆధారా లు, ఆ ఆధారాల విశ్వసనీయత, సంభవనీయత, ఆ ఆధారాలకు స్పష్టమైన, ధృవీకరించుకోగలిగిన ప్రమాణాలు చరి త్ర రచనకు అనివార్యమైనవి.
- ఎన్.వేణుగోపాల్, 9848577028

103
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles