అశాస్త్రీయ భావాలకు అడ్డుకట్ట

Fri,August 9, 2019 01:26 AM

ఈమధ్యకాలంలో ఏది శాస్త్రీయమో, ఏది విశ్వాసమో తెలియని విధంగా అనేక విషయాలు ప్రచారంలోకి వస్తున్నవి. పాలకులు అవలంబిస్తున్న విధానాలు, ఆయా సందర్భాల్లో చెబుతున్న విషయాలకు తోడుగా సమాజంలో ఉన్నతులుగా చెప్పుకుంటున్నవారు కూడా మన కీర్తిప్రతిష్ఠల పేర చెప్పుకొస్తున్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శాస్త్రీయతకు, విశ్వాసాలకు మధ్య ఉన్న సన్నని గీతను చెరిపేసే పని ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నది. అదే మన భారతీయ ఘనకీర్తిగా నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రజలకు ఏది శాస్త్రీయమో, ఏదికాదో గుర్తించటం క్లిష్టమైపోయింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, విద్యార్థులు శాస్త్రీయ భావజా లం, విధానాల కోసం దేశవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని చేపట్టడం ముదావహం. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు, విద్యార్థులు మూఢ విశ్వాసాలను, అశాస్త్రీయ భావాలు, విషయాలను ప్రచారంలో పెట్టడం మానుకోవాలని నినదించటానికి సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే శాస్త్రీయ పరిశోధనలకు ప్రభుత్వాలు ఎక్కువ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలున్న వాటినే బోధించాలని కోరుతున్నారు. మన దేశానికి సంబంధించి చారిత్రకంగా చూస్తే.. ఆర్యభట్ట నుంచి సుశ్రూ త దాకా శాస్ర్తాభివృద్ధిలో కీలకభూమిక పోషించారు. ఇవ్వాళ పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, టెక్నాలజీతో శాటిలైట్ ప్రయోగాలు విజయవంతంగా చేస్తూ, మార్స్, చంద్రయాన్ ప్రయోగాలను విజయవంతంగా చేస్తున్నాం. ఇదంతా మన శాస్త్రవేత్తల కృషేనంటే అతిశయోక్తి ఏమీ కాదు. అని చెప్పి ఈ సందర్భంలోనే దేశంలో ప్రజల్లో శాస్త్రీయ భావజాలం పెరిగిందనీ, మూఢ విశ్వాసాలు క్రమం గా సన్నగిల్లుతున్నాయని చెప్పటానికి లేదు. మన శాస్త్ర, సాంకేతికరంగాల అభివృద్ధి, విజయవంతమైన ప్రయోగాలు చూసి ప్రజల్లో శాస్త్రీయత ఉచ్ఛస్థితిలో ఉన్నదని అనుకుంటే పొరపాటే. దీనికి ప్రధాన కారణం మన విద్యావిధానంలో ఉన్న లోపమని చెప్పవచ్చు. మన పాఠశాల విద్యలో విద్యార్థులు ప్రశ్న కు జవాబులు రాసే విధంగానే తయారవుతున్నారు.

హేతుబద్ధ, తార్కిక విద్యావిధానంతోనే విద్యార్థుల్లో శాస్త్రీయత పెరుగుతుంది. కుహన శాస్త్ర విషయాలను గుర్తించి పక్కనపెట్టే విచక్షణ ఏర్పడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ఏ కూడా.. శాస్త్రీయ, మానవీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయటమే ప్రతి పౌరుని ప్రాథమిక కర్తవ్యం. హేతుబద్ధ, సంస్కరణకు పెద్దపీట వేయాలని చెబుతున్నది. దురదృష్టవశాత్తూ.. ఇప్పుడు ఈ ధోరణి సర్వత్రా విస్మరణకు గురవుతున్నది.


ప్రశ్నలకు జవాబులు రాసే క్రమంలో అందులోని విషయంపై విద్యార్థులకు ఏ ఆసక్తి ఉండదు, పట్టింపూ ఉండదు. మరో ప్రశ్న రాస్తే అదెందుకు తప్పో కూడా ఆలోచించరు. ఈ క్రమంలో విద్యార్థుల్లో హేతుబద్ధ ఆలోచనకు తావుండటం లేదు. ఈ నేపథ్యంలోంచే.. దేశవ్యాప్తంగా సైన్స్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులు శాస్త్రీయ భావజాలం గురించి ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహిస్తూ ప్రజల్లో శాస్త్రీయత ప్రాముఖ్యాన్ని చాటేందుకు ప్రయత్నిస్తున్నా రు. ఈ నేపథ్యంలోనే పాఠశాలల్లో శాస్త్రీయత, భావజాలంపై సెమినార్‌లు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థుల్లో విశ్లేషణా శక్తిని, ప్రయోగాత్మక పరిశీలనా దృష్టిని పెంపొందించేదుకు కృషిచేస్తున్నారు. చదువులో, నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు విద్యార్థులు తమవైన పరిష్కారాలు కనుగొనేందుకు ప్రోత్సహిస్తున్నారు. నేటి విద్యార్థులకు తెలిసిందేమంటే.. తమ పాఠశాలలోని ఉపాధ్యాయుడే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడని. కానీ విద్యార్థి తనదైన పరిశీలనా, తార్కిక శక్తితో సమాధానాలను, పరిష్కారాలను కనుగొనే విధంగా చేసేందుకు చేస్తున్న బృహత్తర కార్యక్రమం. దేశంలో పాఠశాలలన్నింటిలో సైన్స్‌ను కూడా ప్రశ్నలు, జవాబుల రూపంలో బోధించబడుతున్నది. ఇలాంటివారు ఉన్నత చదువుల్లోకి వెళ్లి న తర్వాత పరిశోధనలు చేయాల్సి వచ్చినప్పుడు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి కనీసం శాస్త్రీయ దృక్పథం, సూత్రాల పట్ల ప్రాథమిక అవగాహన లేకుండా కూడా ఉంటున్నారు. దీంతో విద్యార్థుల పరిస్థితి దారి తెన్నూ లేని అగమ్యగోచరంగా తయారవుతున్నది. కాబట్టి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే సైన్స్ పాఠాల బోధన కాకుండా ప్రయోగాలు చేయించటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న వయస్సు నుంచే ప్రయోగాలతో అవగాహన పెంచుకునే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. అలా చేసినప్పుడే.. మన పురాతన కాలంలోనే విమానాలు ఉండేవని చెబుతు న్న విషయాల పట్ల విద్యార్థులు హేతుబద్ధంగా ఆలోచిస్తారు. నిజా నిజాలను తార్కికంగా ఆలోచించి తేల్చుకుంటారు.

ఇలాంటి ఆలోచనల నుంచే మంచి, చెడులను గుర్తించగలుగుతారు. ఇలాంటి తార్కిక, హేతుబద్ధ ఆలోచనల పునాదుల్లోంచే నేటి శాస్త్రీయాభివృద్ధి సాధ్యమైందన్నది మరువరాదు. దేశంలో తీవ్రంగా ఉన్న నీటి కరువు, నిరుద్యోగం, ఆర్థికమాం ద్యం లాంటి విషయాలు అర్థం చేసుకోవటం, వాటినుంచి పరిష్కారాలను కనుగొనటం శాస్త్రీయ దృక్ఫథంతోనే సుసాధ్యం. కానీ నేటి పాలక విధానాలు, ప్రజల్లో ప్రచారంలో ఉన్న భావనలు చూస్తే భవిష్యత్తుపై భయం కలుగుతున్నది. హేతుబద్ధ, తార్కిక విద్యావిధానంతోనే విద్యార్థుల్లో శాస్త్రీయత పెరుగుతుంది. కుహన శాస్త్ర విషయాలను గుర్తించి పక్కనపెట్టే విచక్షణ ఏర్పడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ఏ కూడా.. శాస్త్రీయ, మానవీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయటమే ప్రతి పౌరుని ప్రాథమిక కర్తవ్యం. హేతుబద్ధ, సంస్కరణకు పెద్దపీట వేయాలని చెబుతున్నది. దురదృష్టవశాత్తూ.. ఇప్పుడు ఈ ధోరణి సర్వత్రా విస్మరణకు గురవుతున్నది. తార్కిక, హేతుబద్ధతకు పాతరేసే ధోరణి పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కూడా విద్యార్థుల్లో శాస్త్రీయతను పెంచేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నది. అయితే ఈ కృషి సఫలీకృ తం కావాలంటే ప్రభుత్వపరంగా తోడ్పాటు అవసరం. కానీ ప్రభుత్వాలు శాస్త్రీయ పరిశోధనలకు అవసరమైన నిధుల కేటాయింపులో కోతలు విధిస్తున్నాయి. కొంతకాలంగా శాస్త్ర పరిశోధనల నిధుల్లో 40-50 శాతం తక్కువ కేటాయించారు. పరిశోధనలు చేసే స్కాలర్లకు కూడా ఉపకార వేతనాలు ఇవ్వడంలో కూడా వివక్ష చూపుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయత కోసం విద్యార్థులు, శాస్త్రవేత్తలు ప్రచారోద్యమానికి పూనుకోవటం హర్షణీయం.
ds-das
ఇందులో భాగంగానే దేశంలో నేడు (ఆగస్టు 9) ముంబై, కలకత్తా నగరాల్లో విద్యార్థులు, శాస్త్రవేత్తల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటా శాస్త్రీయభావాల కోసం ప్రచారోద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ శాస్త్రీయ ఆలోచనలు, భావాల పెంపుకోసం కృషిచేయాలి. హేతుబద్ధ, తార్కిక ఆలోచనలకు పెద్దపీట వేయాలి. అలాగే వివిధ రూపాల్లో ప్రచారంలోకి వస్తున్న అశాస్త్రీయ భావాలకు అడ్డుకట్ట వేయాలి. ఈ విధమైన ఆలోచన ఆచరణతోనే శాస్త్రీయ, మానవీయ సమాజం ఆవిష్కరించుకోగలుగుతాం.
(వ్యాసకర్తలు: శాస్త్ర పరిశోధక విద్యార్థులు)

217
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles