ప్రజారోగ్యం పట్టదా?

Sat,August 10, 2019 01:08 AM

దేశంలో సరైన వైద్యనిపుణులు అందుబాటులో లేక గ్రామీణ వైద్యరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సాధారణ పౌరుడు తన ఆదాయంలో డ్బ్భై శాతానికి పైగా వైద్యం కోసమే ఖర్చు చేస్తున్న దుస్థితి ఉన్నది. దీంతో గ్రామీణ భారతం పేదరికంలో మగ్గిపోతున్నదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రజావైద్యాన్ని బలోపేతం చేయటానికి ఈ వైద్యులను ఉద్యోగకల్పనతో వైద్యసేవలకు వినియోగించుకోవాలి.


కేంద్ర ప్రభుత్వం తోచిందే తడవుగా నిర్ణయాలు చేస్తూ పోతున్నది. ఎలాంటి చర్చలు, ప్రజాభిప్రాయాలకు తావులేకుండా పార్లమెంటులో ఉన్న మెజారిటీ బలంతో బిల్లుల రూపేణా విధాన నిర్ణయాలతో దూసుకుపోతున్నది. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు, వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లాంటి దేశవ్యాప్త సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లును కేంద్రం ఆమోదించింది. దీంతో జవాబుదారీతనంతో కూడిన అవినీతికి తావులేని, ప్రజానుకూల వైద్య విధానాన్ని తెస్తామని మోదీ ప్రభుత్వం అంటున్నది. ఈ క్రమంలో దశాబ్దాలుగా దేశ వైద్య విధానానికి మూలస్తంబంగా ఉన్న భారతీయ మెడికల్ కౌన్సిల్ (ఎంసీఐ)ని రద్దు చేస్తూ, పొంతనలేని వాదనను ముందుకుతెచ్చింది. అవినీతిలో కూరుకుపోయిన ఎంసీఐని రద్దుచేసి జవాబుదారీతనంతో కూడిన ఎన్‌ఎంసీకి రూపకల్పన చేశామంటున్నది. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామిక, సమాఖ్యస్ఫూర్తికి తూట్లు పొడిచింది. క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎన్‌ఎంసీ కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేస్తుంది. 25 మంది సభ్యులుండే కౌన్సిల్‌లో ఐదుగురు మాత్రమే వైద్యవృత్తికి సంబంధించిన వారుంటారు. మిగతావారంతా వైద్యవృత్తితో సంబంధం లేని, కేంద్రంలోని ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే వారుంటారనటంలో సందేహం లేదు. అలాగే ముగ్గురు సభ్యులుండే నాలుగు స్వయం ప్రతిపత్తిగల బోర్డులు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సహాయకరంగా పనిచేస్తాయని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా రూపంలో, సారంలో ఎన్‌ఎంసీ అనేది కేంద్ర ప్రభుత్వాధిపత్యం, అజమాయిషీలో నడుస్తుందని తేటతెల్లమవుతున్నది. దేశవ్యాప్త ప్రాతినిధ్యంతో ప్రజాస్వామికంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నిర్మాణమయ్యే ఎంసీఐ ని రద్దుచేసి తమ కనుసన్నల్లో నడిచే సంస్థగా దిగజార్చటం గర్హనీయం.

సుదీర్ఘ చరిత్ర కలిగిన 1956నాటి ఎంసీఐని రద్దుచేయటం వాంఛనీయం అనిపించుకోదు. దేశవ్యాప్త ప్రాతినిధ్యంతో ఎంసీఐ భారతీయ వైద్యాభివృద్ధికి ఎంతో కృషిచేసింది. అన్ని రాష్ర్టా లు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వైద్యుల నుంచి నేరుగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైన 120 మంది ఎంసీఐ సభ్యులుగా ఆయా ప్రాం తాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. విశాలమైన భారతావనిలో వివిధ ప్రాంతాల్లోని ప్రజల ఆరో గ్య అవసరాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి, వైద్యవిధానంలో తీసుకురాదల్చిన సంస్కరణలు, అభివృది ్ధగురించి చర్చించి విధాన నిర్ణయంలో భాగస్వాములవుతారు. ఎంసీఐ నిర్మాణం, వ్యవహరణ అంతా ప్రజాస్వామికంగా, ఫెడరల్‌స్ఫూర్తికి ప్రతిబింబంగా ఉంటుంది. ఇలాంటి దాన్ని రద్దుపరిచి, పూర్తిగా పరోక్ష నియామకం ద్వారా ఏర్పడే ఎన్‌ఎంసీని ఏర్పాటుచేయటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఎంసీఐకి ఎన్నికైన 120 మందిలో ఎవరో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని ఏకంగా దశాబ్దాల చరిత్ర ఉన్న ఎంసీఐని రద్దు చేస్తామనటం కేంద్రం అరువు తెచ్చుకున్న సాకు మాత్రమే. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రైవేటు వైద్యకళాశాల యాజమాన్యాల ప్రయోజనాల కు పెద్దపీట వేసి, పేదలకు వైద్యవిద్యను దూరం చేసే పనిని నేర్పుగా చేసింది. గతంలో అయితే ప్రైవేటు వైద్య కళాశాలల్లో 15 శాతం మాత్రమే యాజమాన్య కోటాగా వైద్యసీట్లు ఉండేవి. వాటిని యాజమాన్యాలు ఇష్టానుసారం అమ్ముకునేవారు. ఇప్పుడు వాటిని 50 శాతానికి పెంచి, ఫీజు తదితరాలను యాజమాన్యాలకు వదిలేయటం గమనార్హం.

నేషనల్ మెడికల్ కమిషన్ విధానాల్లో ముఖ్యమైనది వైద్యవృత్తి చేపట్టగోరే వారి విషయంలో తీసుకొచ్చిన విధానపరమైన మార్పులు తీవ్రమైనవి. వైద్యవిద్య అయిపోయిన వారు ఎవరైనా వృత్తి చేపట్టేందుకు లైసెన్సియేట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే నిబంధన పెట్టారు. గతంలో అయితే ఇక్కడ ఎంసెట్, నీట్ లాంటి పరీక్షలు ఉత్తీర్ణులు కాకుండా విదేశాల్లో వైద్యవిద్య చదివి వచ్చినవారికే ఇలాంటి పరీక్ష నిర్వహించేవారు. ఇక్కడ నీట్ లాంటి కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణులై, ర్యాంక్ సాధించి వైద్యవిద్యలో భాగంగా థియరీ, ప్రాక్టికల్స్ అవసరమైనంతగా చేసి, క్లినికల్ ప్రాక్టీస్ కూడా అయిపోయి ఉత్తీర్ణులైన వారు కూడా వృత్తి చేపట్టేందుకు నెక్ట్స్ పరీక్ష రాయాలనటాన్ని వైద్యవిద్యార్థుల తో సహా, ఐఎంఏ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎలాంటి విద్య, వృత్తి నైపుణ్యాలు లేకుండా విదేశాల్లో చదివి వచ్చిన ధనవంతుల పిల్లలకు, ఇక్కడి వారితో సమానావకాశాలు కల్పించటానికే ఇదంతా అనే ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నాపత్రంతో వైద్య విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షిస్తామనటం అసమంజసం. నిజానికి ఏటా 60 వేల మంది వైద్య విద్యార్థులు పట్టా అందుకొని సమాజంలో అడుగుపెడుతున్నారు. వారందరూ తమకు పని కల్పించమ ని కోరుతున్నారు. సరైన సదుపాయాలు, వైద్యపరికరాలు అందించి వైద్యసేవలకు తమను వినియోగించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో సరైన వైద్యనిపుణులు అందుబాటులో లేక గ్రామీణ వైద్యరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సాధారణ పౌరుడు తన ఆదాయంలో డ్బ్భై శాతానికి పైగా వైద్యం కోసమే ఖర్చు చేస్తున్న దుస్థితి ఉన్నది. దీంతో గ్రామీణ భారతం పేదరికంలో మగ్గిపోతున్నదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రజావైద్యాన్ని బలోపేత ం చేయటానికి ఈ వైద్యులను ఉద్యోగకల్పనతో వైద్యసేవలకు వినియోగించుకోవాలి. దీనిపై దృష్టిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి అవినీతి పేర నీడతో యుద్ధం చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నది.

227
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles