నేనే ఒక సింగిడినై


Mon,August 12, 2019 01:25 AM

నేను కాలం గుప్పిట్లో బందీ నా!
కాలఘట్టాలకు చరిత్రను
ఆపాదించే ఆనందీ నా!!
ఈ తెలంగాణ నేలకు
నా మీద ఎందుకింత ప్రేమో!?
తన మీద పారాడి ఆడి పాడి పోరాడి పోరాడి
తరాల భారాలతో తనిసి పోతున్నందుకేనేమో
అందుకేనేమో ఈ నేలకు నా మీద ఇంత ప్రేమ!
ప్రవహిస్తున్నది ప్రాణహితా
గోదావరి నదా! నా మదా!
అలలెత్తుతున్నది కాళేశ్వర సాగరమా!
నా హృదయమా!
నదుల నీళ్ళను ఎత్తులకు ప్రవహింపజేస్తున్న
మహాసంకల్ప బలం నాది!!
కోటి ఎకరాల మాగాణం లక్ష్యంగా
తెలంగాణను విత్తన ధాన్యాగారంగా
అక్షయ పాత్రగా సర్వ సుభిక్షం చేసే దీక్షనాది!
నాలో లోలో ఎంత నిప్పో!!
కాకుంటే ధిక్కరించిన స్వరంగా
ఆత్మగౌరవ రేఖను ఉజ్వలిస్తున్న భాస్వరంగా
ఇంతింతగా గుప్పుమంటానా!!
అసాధ్య ఘటనలన్న సందర్భాలను
అత్యంత స్వల్పకాల వ్యవధిలో
అనల్పంగా ఆవిష్కరిస్తున్న ప్రతిభ నాది!
మానవ కృషికి నిజమైన ఆలంబనం స్వాతంత్య్రమే!
ఇప్పుడు నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి!
ఇప్పటి నా తెలంగాణ నన్నూ నా చరిత్రనూ
రైతుబంధుగా యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తున్న
జీవనోత్సాహ ఆసరా సందర్భాల ఖజానా నజరానా
నా తెలంగాణ బోనమెత్తే అవ్వ అక్క చెల్లి
నా తెలంగాణ రంగురంగుపూల బతుకమ్మ
నా తెలంగాణ పాట
నాగేటి చాళ్ళల్ల పల్లవించే మొలకల తళుకు బాట
నా తెలంగాణ నేలపై వీచే గాలికి
నా మీద ఎంత దయో!!
రాలిపోయే వరకూ ఈ నేల గాలిజోలెలో
నేనెప్పుడూ పసికందునే
నా కోసం కాకపోతే
ఈ ఆకాశానికి ఎందుకింత విశాలత !?
అందుకే శూన్యానికి విలువ పెంచుతూ
ఎప్పుడూ నేనే ఒక సింగిడినై
తెలంగాణ నేల గాలి నీరు నిప్పు ఆకాశాల
సజీవ సంపుటినినై
వర్ణ వర్ణ రంజిత సప్తవర్ణ పుంజిత
కావ్యాక్షరాలను సంధిస్తూనే వుంటాను
భావార్థాలను ఉత్తేజింపజేస్తుంటాను
నా జాతిజనుల హృదయాలను రంజింపజేస్తుంటాను
అక్షరాక్షరం నేను తెలంగాణ కవిని!
అక్షరాలా నేను తెలంగాణ కవిని!!


- గురిజాల రామశేషయ్య, 7032679471

154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles