అన్నం రుచుల నడక


Mon,August 12, 2019 01:26 AM

NIHARINI
సముద్రం నిదురిస్తున్నదట
కదపకండి
ఎడారి ఇసుక, సీసాలో జారుతున్నదట
సమయపు పిడికిళ్ళ బిగించకండి
గవ్వల గలగలలు కొన్ని మృత్యువులోంచే వినిపిస్తుంటె
కడలి అంచున నిలుచుండి ఆకాశాన్ని నిందించకండి
కళేబరాల ధ్వని సంకేతాలను
సంగీతాన్ని అద్దుతున్నంత ఆస్వాదించకండి
ఏడుపులు నిన్నటి విధ్వంస క్రీడల గురుతులు,
శబ్దమూలాల వినికిడికై ప్రయత్నాలను విస్మరించకండి
వాగు వంతెనలు దాటి, భ్రమరాల హోరులు దాటి
పుట్టతేనె అంతా కవిత్వమై ఇసుక మేటలు వేస్తున్నది
అమ్మ కొంగుతాకినట్టు-పసరిక వాసన
అన్నం రుచుల నడకతో వీస్తున్నది
అక్షరాల తడి స్పర్శిస్తుంటే చరిత్ర గాయాల్ని
చూసుకుంటున్నట్లున్నది
అవి దుఃఖ మేఘపు వలపోతలు కూడా కావచ్చు.
నింద తర్వాత పరామర్శలా
గూళ్లు నిండని గువ్వ పిల్లల పుల్లలేరే అల్లికల్ని
కృత్రిమ కట్టడాల ప్రక్కన చేర్చకండి.
నిశ్శబ్దం కూడా సందేశమిస్తున్నది
బహుశా జ్ఞాపకాలు విచ్చుకుంటూ
చెట్టు చెట్టూ తిరుగుతున్నట్లు
ఎండిన జలాశయాల్లా
మనుషుల ఆశయాలూ హోరులెత్తుతున్నవి
ఆత్మబంధువుల, బందీ ఆత్మల హృద్ఘోషలవ్వి
ఆవేశమొక్కటే విరబూస్తే చాలదు
పరిష్కార పరిమళాలు అంతరంగ ఆవృతమవ్వాలి
కన్నీళ్ళు తుండుగుడ్డతో తుడవకండి
గుండె తటాకం నిండాలి.
తడవ తడవకూ చీకటి సంద్రాన్ని గుర్తు చేయకండి
ఇది మునిగిపోయే చరిత్ర కాదు
నిందారోపణల పాత కంపును
భోషాణంలో బందీ చేయకండి
అపోహల వలయాలు ఛేదించ,
అసమానతల గోడలు బద్దలు గొట్ట
కొత్తదైన ఖడ్గసృష్టి, పచ్చిబాలింత నేల తల్లి వేదనౌతుంది


- డాక్టర్ కొండపల్లి నీహారిణి

145
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles