విముక్తి పోరుకు మతం లేదు


Thu,August 15, 2019 01:01 AM

మనిషి కొత్త ఆవిష్కరణలు, నూతన ఆలోచనలను పొంద లేకపోయినపుడే పాత జ్ఞాపకాల అనుభవాలనే గొప్పగా చెప్పుకుంటూ వర్తమానాన్ని మరిచిపోయి జీవించాలని చూస్తాడు. ఈ విషయంలో రాజకీయ నాయకులైనా, పార్టీలైనా మినహాయింపు లేదు. అందుకే వందేళ్లు పైబడిన కాంగ్రెస్ పార్టీ ఐనా, 40 యేళ్ళు నిండని బీజేపీ ఐనా తాము అధికారంలో ఉన్న రోజుల్లో సాధించిన విజయాలను చెప్పుకొనే స్థితిలో లేవు. దీంతో చరిత్రలో మిగిలిపోయిన చేదు అనుభవాలనే తమ ఘనకీర్తులుగా చెప్పుకొని ఈ తరం యువత ఆలోచనలను పక్కదారీ పట్టిస్తుంటాయి. రాజకీయ అవకాశాలను మెరుగుపరుచుకో చూస్తుంటాయి. భారత్ కన్నా చిన్న రాజ్యాలు, మన తర్వాత స్వాతంత్య్రం పొందిన ఎన్నోదేశాలు ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాలను శాసిస్తున్నాయి. మనం మాత్రం ఇంకా మన పూర్వీకుల చర్యలకు, ఈనాటి సామాజిక, రాజకీయ దృక్పథంతో చూస్తూ కొత్త అర్థాలను వెతుకుతున్నాం. యుగ, కాలాలకు అనుగుణంగా ధర్మాలు మారుతుంటాయి. నిన్నటి ఆలోచన నేడు సరియైనది కాకపోవచ్చు. పురాణాల్లో భూమిని చాపలా చుట్టిన హిరణ్యాక్షుడు, తన చంకలో పెట్టుకొని సముద్రంలో దాక్కొని, దేవతలను గడగడలాడిస్తే, విష్ణువు వరాహా అవతారమెత్తి భూమిని కాపాడాడని ఉన్నది. మరి నేడు భూమి గుండ్రంగా ఉందని శాస్త్రం నిరూపించింది. దాన్ని కాదనగలరా? ఆంగ్లేయుల నుంచి దేశం స్వాతంత్య్రం పొందిందని చెప్పుకొంటున్నాం. నేటికీ ఆంగ్లేయులంటే మన దేశాన్ని దోచుకొన్న దోపిడీదారుల్లానే చూస్తున్నాం. అంతకుముందే దేశానికి వచ్చి దాదాపు వెయ్యేళ్లు భారత దేశ సంపదను కొల్లగొట్టిన అరబ్, మంగోలియా, పర్షియన్ దేశాల రాజుల అరాచకాలను మరిచిపోయాం.


ఏ పార్టీ అయినా బలపడి రాజకీయాధికారం సంపాదించుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ మతాల మధ్య ఘర్షణలను, వైషమ్యాలను రెచ్చగొట్టే తీరులో రాజకీయాలను నడుపడం గర్హనీయం. ప్రధాని మోదీ ప్రకటించిన సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అన్న మాటలకు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇది వారి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే అనడంలో సందేహం లేదు.


నిన్నటి ఘటనలను నేటి దృష్టితో చూస్తే అప్పుడు జరిగిన, చేసిన ఎన్నో ఘటనలు, పనులు ఇప్పుడు మనకు రుచించకపోవచ్చు. కొన్ని మన నేటి ఆలోచనలకు అనుగుణమైనవి కావచ్చు. కానీ అవే సంఘటనలను అవే మాటలను పట్టుకొని ఇప్పటి సామాజిక ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇందులోని ఔచిత్యం ఏమిటో, ఏ వర్గ రాజకీయ ప్రయోజనాల కోసమో నేటి యువత ఆలోచించాలి. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశం 600లకు పైగా చిన్నా, పెద్దా రాజ్యాలుగా, జమిందారీ ప్రాంతాలుగా విడిపోయి ఉన్నది. దేశంలో కలువాలా లేక స్వతంత్రంగా ఉండాలా అనే సంశయంలో అనేక ప్రాంత పాలకులు ఉండేవారు. కొంతమంది స్వచ్ఛందంగా దేశంలో కలిస్తే మరికొంతమంది కొన్ని ఆర్థిక రక్షణలు, పరిహారాలు కోరుకున్నారు. మరికొందరు కొంత బెట్టు చేయడం, పాకిస్థాన్‌లో కలుస్తామని బెదిరించడం, లేదా స్వతంత్ర దేశంగా ఉంటామని పోరాటం చేశారు. ఆ క్రమంలోనే చివరగా మిగిలిన నిజాం, జునాగఢ్, జమ్ముకశ్మీర్ రాజ్యాల విషయంలో భారత ప్రభుత్వం కొంత ఘర్షణ పడిన మాట వాస్తవం. ఒక దశలో జమ్ముకశ్మీర్‌ను వదులుకొని జునాగఢ్‌ను దేశంలో కలుపుకోవడానికి కూడా నాటి నేతలు సిద్ధమయ్యారనే వాస్తవాన్ని మరవకూడదు. జునాగఢ్‌ను వదలుకోకూడదని నాటి కేంద్ర హోవ్‌ు మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుబడితే, తన పూర్వీకుల జన్మస్థలమైన జమ్ముకశ్మీర్‌ను వదులుకోకూడదని నెహ్రూ అనుకోవడం వల్లే ఈ రెండూ భారతదేశంలో అంతర్భాగం అయ్యాయన్నది మరువరాదు. నాడు జమ్ముకశ్మీర్ రాజు రాజా హరిసింగ్ మిగతా అన్నిప్రాంతాలలానే ముందుగానే భారత దేశం లో కలిసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అక్కడి ప్రజలు అధిక సంఖ్య లో ముస్లింలు. అయినా వారు భారత్‌లోనే ఉండాలనే కోరుకున్నారు.

దేశం మధ్యలో ఉన్న నిజాం రాజ్యంలో కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ నాయకులు అప్పటికే నిజాంకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం ప్రారంభించారు. దాదాపు రెండేండ్ల పోరాటం తర్వాత నిజాం రాజు 1948 సెప్టెంబర్17న దేశంలో కలువడానికి అంగీకరించాడు. అప్పటి నుంచి హైదరాబాద్ రాష్ట్రం దేశంలో భాగంగా 1956 వరకు కొనసాగింది. తర్వా త భాషాప్రయుక్త రాష్ర్టాల పేర హైదరాబాద్ రాష్ర్టాన్ని మూడు ముక్కలుగా చేసి, మరాఠీ మాట్లాడేవారిని బొంబాయి రాష్ట్రంలో, కన్నడ భాషను మాట్లాడే ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపి, మిగతా ప్రాంతాన్ని ఆంధ్రలో కలిపారు. సెప్టెంబర్ 17వ తేదీకి ఎవరూ అంత ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకొంటున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో ప్రజలకు పూర్వ చరిత్ర తెలువడానికి తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసిన రోజుగా సెప్టెంబర్ 17వ తేదీని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవాలని కోరుకున్నారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ విద్రోహదినంగా భావించలేదు. తెలంగాణ పోరాట ప్రత్యేకతను చాటడానికి సెప్టెంబర్ 17వ తేదీన అమర వీరుల దినంగా, సంస్మరణ దినంగా మాత్రమే కమ్యూనిస్ట్‌పార్టీలతో పాటు ప్రగతిశీల భావాలున్న ప్రజాసంఘాలన్నీ జరుపుకొనేవి. నిజాం వ్యతిరేక పోరాటంలో హిందువులతో పాటు ముస్లింలు, పార్శీలు, క్రైస్తవులు ఉద్యమించారు. అనేక మంది బలిదానాలు చేశారు. నిజాం వ్యతిరేక పోరాటం ఒక మతానికి కాకుండా ఒక రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. అలాగే జమ్ముకశ్మీర్‌లో హిందూ రాజుకు వ్యతిరేకంగా ముస్లిం ప్రజలు పోరాడారు. వారి పోరాటం వల్లనే కశ్మీర్ భారతదేశంలో కలిసింది. కానీ అక్కడ హిందువులకు వ్యతిరేకంగా ఎలాం టి చర్యలు జరుగలేదు.
Prabhakar-rao
మరి ఇక్కడ తెలంగాణలో మాత్రమే ఎందుకు నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటాన్ని ఒక మతానికి అంటగట్టి చూస్తూ మాసిపోయిన గాయాన్ని రేపాలని చూస్తున్నారు? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15నాటికి దేశంలోని కొన్ని ప్రాంతాలు స్వాతంత్య్రం పొందలేదు. వివిధ పరిస్థితులలో వివిధ రాజ్యా లు భారత ఫెడరల్ యూనియన్‌లో కలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 విమోచన దినంగా జరుపుకోవాలనే ఆలోచనలో ప్రజలను మతాల వారీగా విడదీసి, రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకొనే దుర్నీతి కనబడుతుంది. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడంతోనే మతా ల మధ్య ఘర్షణ వాతారణం పెరుగుతున్నది. ఏ పార్టీ అయినా బలపడి రాజకీయాధికారం సంపాదించుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ మతాల మధ్య ఘర్షణలను, వైషమ్యాలనురెచ్చగొట్టే తీరులో రాజకీయాలను నడుపడం గర్హనీయం. ప్రధాని మోదీ ప్రకటించిన సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అన్న మాటలకు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇది వారి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే అనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త:సీనియర్ జర్నలిస్ట్)

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles