స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు


Thu,August 15, 2019 01:03 AM

నేడు 15 ఆగస్టు! దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తరువాత కూడా ఈ జాతీయ పండుగను గర్వంగా జరుపుకోగలుగడమే మన దేశ ప్రజల గొప్పతనం. ఈ ఏడు దశాబ్దాలకు పైగా కాలంలో దేశం ఆశించిన మేర అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. మన ముందు మరె న్నో ఆకాంక్షలు ఉండవచ్చు. అయినా మనం సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడమే మన ప్రజల ఘనత. మత కలహాలు రాజుకుని అభివృద్ధికి నోచుకోలేని రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ సామ్రాజ్యవాదశక్తులకు కన్నుకుట్టే విధంగా లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనం పరిరక్షించు కుంటున్నం. ఆహారరంగంలో స్వావలంబనే గొప్పగా భావిస్తున్న దశను దాటి అంతరిక్షంలోకి తొంగిచూస్తున్నం. ఇటీవలి వరకు ప్రజాప్రాతిని ధ్య వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ మొదలైనవి బలపడ్డాయి. సజావుగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వెలుగు వెంట చీకటిలా ప్రపంచంలోనే గొప్ప ఆర్థికశక్తిగా ఎదుగుతున్నప్పటికీ, దేశంలో ఇంకా పేదరికం, ప్రాంతీయ సామాజిక అసమానతలు తొలిగిపోలేదు. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. స్వావలంబన విధానాలు ప్రాధాన్యం పొందడం లేదు. నదీ జలాలను, సహజవనరులను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. ప్రజాస్వామిక వ్యవస్థలను బలహీనపరిచే పోకడలు కూడా ఇటీవల పెరిగిపోయాయి. ఈ పోకడల పట్ల తక్షణం అప్రమత్తం కాకపోతే దీర్ఘకాలంలో ప్రజాస్వామిక మౌలిక స్వభావం దెబ్బతినే ప్రమాదం ఉన్నది.


కేంద్రంలో బలమైన జాతీయ పక్షం అధికారం చేపట్టినంత మాత్రాన మన సమాఖ్య స్వభావానికి భంగం కలుగదనే భరోసా ఇవ్వడానికి బదులు రాష్ర్టాల హక్కులను హరించడం పెడధోరణి. అన్నిజాతులు, భాషలు, సంస్కృతులు వికాసం చెందడమే దేశానికి బలం చేకూరుస్తుంది. అన్నిజాతులు, సంస్కృతులు, మతాల వారు శాంతియుత సహజీవనం చేసినప్పుడే స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు నెరవేరినట్టు.


రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అని రాసుకున్నంత మాత్రాన సరిపోదు. ప్రజాస్వామిక స్వభావం ప్రభుత్వంలో ఉండాలె, ప్రజలలో కనిపించాలె. సమాజంలో సామరస్య జీవన విధానం నెలకొని ఉండాలె. కానీ ఇటీవల దేశవ్యాప్తంగా విద్వేష దాడులు పెరిగిపోతున్నాయి. అల్ప సంఖ్యాక, బలహీనవర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయి. కొన్నివర్గాల ఆహార అలవాట్లను కూడా ఆక్షేపించే ఆధిపత్య ధోరిణి పేట్రేగిపోతున్నది. మహిళల వేషధారణను కూడా కొన్ని మూకలు శాసించే పరిస్థితి ఏర్పడ్డది. దేశ ప్రజాస్వామిక స్వభావాన్ని దెబ్బతీయడానికి విచ్ఛిన్నశక్తులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. దేశ సమైక్యతను దెబ్బతీయడానికి పరాయి దేశాల కుట్ర లు సాగుతుంటాయి. కానీ సమాజంలో ప్రజాస్వామిక సంస్కృతిని పెంచి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. రాజ్యాంగ స్వభావానికి, స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలకు, లౌకికత్వ విలువలకు విరుద్ధంగా తలెత్తే వికృత పోడకలను అరికట్టవలసిన బాధ్యత అందరిపై ఉంటుంది. కానీ కొన్ని రాజకీయశక్తులే ఈ విభజన భావనలను ప్రేరేపించడం మరింత దారుణం. మన దేశం పాశ్చాత్యదేశాలకు దీటుగా ఆధునిక రాజ్యంగా ఎదుగుతున్న దశలో ఆయవుపట్టులో దెబ్బకొట్టినట్లు మతవిద్వేషాలు చెలరేగడం అభిలషణీయం కాదు. కుల, మత విద్వేషాలు సమాజాన్నే కాదు, ఆర్థికవ్యవస్థను కూడా దెబ్బతీస్తాయి. సమాజాన్ని కల్లోల పరిచి, ఆర్థిక సుస్థిరత, పారిశ్రామిక ప్రగతి సాధించడం అసాధ్యం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఐదారువందల సంస్థానాలను విలీనం చేసుకోవడమే కాదు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న భిన్న జాతుల అస్తిత్వ కాంక్షలను తీర్చడం కోసం కొత్త రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణను చేపట్టవలసి వచ్చింది.

తెలంగాణను ఏపీతో విలీనం చేయడం వంటి ఘోర తప్పిదాలు కొన్ని జరిగినప్పటికీ, పునర్వ్యవస్థీకరణ కచ్చితంగా ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. దీనివల్ల దేశానికి కొత్తరూపు వచ్చింది. సమాఖ్య తత్తానికి పునాది పడ్డది. తెలంగాణ ఏర్పాటు వల్ల చేసిన తప్పిదాన్ని చక్కదిద్దుకోవడమే కాదు, ప్రజల ఆకాంక్షలు ప్రజాస్వామిక పద్ధతిలో నెరవేరుతాయనే భరోసా ఇచ్చినట్టయింది. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాలు కూడా ఏర్పడటంతో వారి అస్తిత్వ కాంక్షలను గుర్తించినట్టయింది. ఇంకా ముందే ఈశాన్యంలో పలు చిన్న రాష్ర్టాలు ఏర్పడ్డాయి. సామాజిక బహుళత్వం అనివార్యంగా రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసింది. దేశవ్యాప్తంగా అనేక కొత్తపార్టీలు ఆవిర్భవించాయి. ఈ క్రమంలో దేశం సమాఖ్య స్వరూపాన్ని సంతరించుకుంటున్నదనే వ్యాఖ్యానాలు వినిపించాయి. బీజేపీ 2014లో అధికారానికి వచ్చిన తరువాత మోదీ భాషణలు ఇందుకు బలం చేకూర్చాయి. కానీ మోదీ రెండవ పర్యాయం ప్రధాని పదవి చేపట్టిన తరువాత మాత్రం కేంద్రీకృత పోకడలు కనిపిస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులు ఇందుకు ఉదాహరణ. కేంద్రంలో బలమైన జాతీయ పక్షం అధికారం చేపట్టినంత మాత్రాన మన సమాఖ్య స్వభావానికి భంగం కలుగదనే భరోసా ఇవ్వడానికి బదులు రాష్ర్టాల హక్కులను హరించడం పెడధోరణి. అన్నిజాతులు, భాషలు, సంస్కృతులు వికాసం చెందడమే దేశానికి బలం చేకూరుస్తుంది. అన్ని జాతులు, సంస్కృతులు, మతాల వారు శాంతియుత సహజీవనం చేసినప్పుడే స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు నెరవేరినట్టు. రాజకీయశక్తులు, చైతన్యవంతమైన ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.

199
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles